హైదరాబాద్, కరీంనగర్ అక్టోబర్ 14 (నమస్తే తెలంగాణ) : మావోయిస్టు పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. కేంద్ర కమిటీ సభ్యుడు, పొలిట్‌బ్యూరో మెంబర్ మల్లోజుల వేణుగోపాల్ రావు అలియాస్ సోను అలియాస్ అభయ్ మంగళవారం మహారాష్ట్రలోని గడ్చిరోలి పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఆయనతో పాటు సుమారు 60 మంది మావోయిస్టు క్యాడర్ కూడా పోలీసుల వద్ద తమ ఆయుధాలు వదిలిపెట్టి లొంగిపోయారు. 70 ఏండ్ల మావోయిస్టు కురువృద్ధుడి లొంగుబాటును మహారాష్ట్ర పోలీసులు, ఛత్తీస్‌గఢ్ ఉప ముఖ్యమంత్రి విజయ్ శర్మ ధ్రువీకరించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశాల మేరకు దేశ వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో పోలీసులు, భద్రతా బలగాలు నిర్వహిస్తున్న ఆపరేషన్ కగార్ ఇప్పటికే తీవ్ర రూపం దాల్చింది. వరుస ఎన్కౌంటర్లలో వందల కొద్దీ మావోయిస్టులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలోనే గత సెప్టెంబర్‌లో మల్లోజుల తాము ఆయుధాలు వదిలి పెట్టేందుకు సిద్ధమని ప్రతికా ప్రకటన చేశారు. ఆయన నిర్ణయానికి ఛత్తీస్‌గఢ్‌తో సహా దేశంలోని ఇతర మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లోని కొన్ని కేడర్లు మాత్రమే మద్దతు తెలిపాయి. ఈ క్రమంలో మహారాష్ట్రలోని గడ్చిరోలిలో పోలీసుల ఎదుట ఆయుధాలను వదిలేసి లొంగిపోయారు.
ఆయుధాలు వదిలేసి శాంతి చర్చలకు వెళ్లాలని మల్లోజుల చేసిన ప్రకటన మావోయిస్టు కేడర్‌లో కొంత కలకలం రేపింది. మావోయిస్టు పార్టీ నార్త్ బస్తర్ డివిజన్ కమిటీ మద్దతు ఇచ్చినా.. మల్లోజుల లేఖను పీఎల్జీఏ చీఫ్ హిడ్మా, దేవ్‌జీ వ్యతిరేకించారు. ఈ నేపథ్యంలోనే కొన్నిరోజుల క్రితం మల్లోజుల మరో లేఖను విడుదల చేశారు. ఇంతకాలం పార్టీ చేసిన తప్పులకు, ఉద్యమం ఓడిపోకుండా కాపాడలేకపోయినందుకు బాధ్యత వహిస్తూ పొలిట్ బ్యూరో సభ్యుడిగా క్షమాపణలు కోరారు. ‘వందల మంది మావోయిస్టులను కోల్పోతున్న పరిస్థితుల్లో పార్టీ పిడివాద, అతివాద విధానాల నుంచి మిగిలిన వారినైనా కాపాడుకోవాలి. విప్లవోద్యమాన్ని విజయవంతంగా నడిపించడానికి బహిరంగంగా ప్రజల్లోకి వెళ్లడం మినహా మరో మార్గం లేదు’ అని మల్లోజుల లేఖలో పేర్కొన్నారు.
సుధీర్ఘకాలంగా మావోయిస్టు పార్టీలో పనిచేస్తున్న వేణుగోపాల్‌రావు పెద్దపల్లి జిల్లా కేంద్రానికి చెందిన మల్లోజుల మధురమ్మ-వెంకటయ్య దంపతుల కనిష్ఠ పుత్రుడు. 1956లో జన్మించిన ఆయన, మల్లోజుల కోటేశ్వర్రావు అలియాస్ కిషన్‌జీకి సోదరుడు. వీరి తండ్రి వెంకటయ్య స్వాతంత్య్ర సమరయోధుడు. వేణుగోపాల్‌రావు పెద్దపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదివారు. అనంతరం అక్కడే ఐటీఐలో రేడియో, టీవీ కోర్సు చేశారు. ఐటీఐ చదువుతున్నప్పుడే ఆర్ఎస్యూలో చేరి, కమ్యూనిస్టు భావజాలాన్ని అలవర్చుకున్నారు. తన అమ్మమ్మ స్వగ్రామమైన కాల్వశ్రీరాంపూర్ మండలం మంగపేటలో తన సోదరుడు కోటేశ్వర్రావు, బుర్ర చిన్నన్న తదితరులతో కలిసి కూనారం దొరలకు వ్యతిరేకంగా రాజకీయ శిక్షణ తరగతులు నిర్వహించి, ఉద్యమించారు. అప్పటి నుంచే విప్లవాలవైపు ఆకర్షితుడై, ఆదిలాబాద్ జిల్లాలో ప్రభుత్వోద్యోగం వచ్చిందని చెప్పి అడవి బాట పట్టారు. అప్పటికే ఆయన సోదరుడు మల్లోజుల కోటేశ్వర్రావు పీపుల్స్‌వార్‌లో ఉండడంతో వేణుగోపాల్ కూడా 1981-82ప్రాంతంలో అదే పీపుల్స్ వార్‌లో చేరారు.
అన్నబాటలోనే నడిచిన వేణుగోపాల్‌రావు, అజ్ఞాతంవైపు కదిలి మావోయిస్టు పార్టీలో అంచలంచెలుగా ఎదిగి క్రీయాశీలక పాత్ర పోషించారు. తొలిసారిగా మహదేవపూర్ దళంలో కమిటీ సభ్యుడిగా పనిచేస్తున్న సమయంలో అరెస్టయ్యారు. సుల్తానాబాద్, జూలపల్లి, ఎలిగేడు, ధర్మారం ఏరియా కమిటీలో సీవోగా పనిచేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన పెద్దపల్లి ముఖం చూడలేదు. 43 ఏళ్లుగా అజ్ఞాతంలోనే ఉన్నారు. ప్రస్తుతం ఆయన మావోయిస్టు పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడిగా, కేంద్ర కమిటీ సభ్యుడిగా కొనసాగుతున్నారు. వేణుగోపాల్‌రావు అలియాస్ భూపతి, సోనూ, మాస్టర్, అభయ్, సాధన వంటి పేర్లతో పనిచేశారు. మహారాష్ట్ర గడ్చిరోలి ప్రాంతంలోని మావోయిస్టు దండకారణ్య ప్రత్యేక జోనల్ కమిటీకి అధిపతిగా పనిచేశారు. అలాగే గోవా నుంచి కేరళలోని ఇడుక్కి వరకు గల గెరిల్లా జోన్‌ను నియమించడంతో క్రియా శీలక పాత్ర పోషించారు. 2010లో చెరుకూరి రాజ్‌కుమార్ అలియాస్ ఆజాద్ మరణించిన తర్వాత మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధిగా నియమితుడయ్యారు. 2010 ఏప్రిల్‌లో దంతెవాడలో జరిగిన ఘటనలో 76 మంది సీఆర్పీఎఫ్ పోలీసుల మరణం వెనుక వేణుగోపాల్‌రావు హస్తం ఉందని పోలీస్ వర్గాలు భావించాయి.
2011 నవంబర్ 24న మల్లోజుల కోటేశ్వర్రావు అలియాస్ కిషన్‌జీ ఎన్కౌంటర్ జరిగింది. ఆప్పట్లో ఆదో సంచలనం. అయితే ‘ఉద్యమబాట వీడిరా.. బిడ్డా’ అంటూ తల్లి మధురమ్మ మీడియా వేదికగా ఎన్నోసార్లు కోరినా.. తిరిగిరాలేదు. మల్లోజుల కోటేశ్వర్రావు ఎన్కౌంటర్ తర్వాత పశ్చిమ బెంగాల్లో జరిగిన ఆపరేషన్ గ్రీన్ హంట్‌కు వ్యతిరేకంగా జరిగిన లాల్‌గఢ్ ఉద్యమానికి వేణుగోపాల్‌రావును నాయకుడిగా అప్పట్లో పార్టీ నియమించింది. వేణుగోపాల్‌రావు పార్టీలో తన సహచరి అయిన తారక్క అలియాస్ నర్మదక్కను వివాహం చేసుకున్నట్టు వార్తలు వెలువడ్డాయి. ‘సాధన’ కలం పేరిట ఆయన అనేక రచనలు చేశారు. ఆయన లొంగుబాటు కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో సంచలనం సృష్టించింది.
మల్లోజుల వేణుగోపాల్‌రావు తల్లి 2022లో మరణించారు. ఆమె తన మరణానికి ముందు అనేకసార్లు మల్లోజుల వేణుగోపాల్‌ను ఉద్యమం వీడి రావాలని మీడియా వేదికగా కోరారు. 2020లో ఒకసారి వేణుగోపాల్ లొంగిపోతున్నట్టు వచ్చిన వార్తలను చూసిన ఆమె, ఆరోజు సంతోష పడ్డారు. ఆ తదుపరి మల్లోజుల లొంగిపోలేదని తెలిసినా.. చివరకు అమె వేణుగోపాల్ కోసం ఎదురు చూసినట్టు బంధువులు చెబుతున్నారు. మల్లోజుల లొంగుబాటును ఓ భారీ బహిరంగ సభగా పెట్టే ఆలోచనలో ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నట్లు తెలిసింది. కాగా, ఆయన మొదట తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోతారని అంతా భావించారు. ఈ మేరకు ఇంటెలిజెన్స్ సమాచారంతో ప్రభుత్వ వర్గాలు కూడా కొన్ని ఏర్పాట్లు చేసుకున్నాయి. అయితే, అనూహ్యంగా ఆయన మహారాష్ట్ర పోలీసుల ఎదుట లొంగిపోవడంతో తెలంగాణలోని ప్రభుత్వ పెద్దలు, పోలీసు ఉన్నతాధికారులు అసంతృప్తికి లోనయ్యారు.
2011 నవంబరు 24న బెంగాల్లో జరిగిన ఎన్కౌంటర్లో అన్నయ్య మల్లోజుల కోటేశ్వరరావు అలియాస్ కిషన్ జీ మృతి చెందారు. కిషన్ జీ మరణం తరువాత వేణుగోపాల్‌రావు పశ్చిమ బెంగాల్లో ఆపరేషన్ గ్రీన్ హంట్‌కు వ్యతిరేకంగా జరిగిన లాల్‌గఢ్ ఉద్యమానికి నాయకుడిగా నియమితులయ్యారు. అన్నయ్య మరణంతో పాటు పార్టీలో వర్గపోరు, పిడివాద సిద్ధాంతాలు ఆయన్ని పూర్తిగా నైరాశ్యంలోకి నెట్టాయని తెలుస్తున్నది. ఆ తర్వాత పార్టీ అగ్రనాయకత్వాన్ని ఒక్కొక్కరిగా కోల్పోతుండటంతో ఆయుధాలు వదిలేయాలనే చర్చలు సైతం ప్రారంభమయ్యాయి. దీంతో పార్టీలో భిన్నాభిప్రాయాలు రావడంతో ఆయనే నేరుగా మీడియాకు లేఖను విడుదల చేశారు. పార్టీలోని ముఖ్యులు దానిని వ్యతిరేకించడంతో, కేడర్‌ను బతికించుకోవడం కోసం ఆయుధాలు వదలి లొంగిపోవల్సి వచ్చింది. అంతకు ముందే మావోయిస్ట్ కమాండర్ అయిన వేణుగోపాల్ భార్య తారక్క కూడా మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఎదుట లొంగిపోయారు. ప్రస్తుతం మల్లోజుల తలపై సుమారు రూ.6 కోట్ల వరకు రివార్డు ఉన్నట్లు సమాచారం.
కొత్తగూడెం ప్రగతి మైదాన్ : పార్టీ సిద్ధాంతాలు నచ్చక ఆరుగురు మావోయిస్టులు భద్రాద్రి జిల్లా పోలీసులు, సీఆర్పీఎఫ్ 81వ, 141వ బెటాలియన్ అధికారుల ఎదుట లొంగిపోయారని భద్రాద్రి ఎస్పీ బిరుదరాజు రోహిత్ రాజు వెల్లడించారు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లా చిమ్మిలిపేటకు చెందిన పార్టీ సభ్యుడు కుంజం పాపారావు అలియాస్ దినేశ్, బీజాపూర్ జిల్లా పెద్దబట్టిగూడేనికి చెందిన పార్టీ సభ్యురాలు లేకం బండి అలియాస్ శాంతి, బీజాపూర్ జిల్లా గుండ్రాజిగూడెంకు చెందిన పార్టీ సభ్యుడు మడివి కోస, దొడ్డితుమ్నర్ గ్రామానికి చెందిన పద్దం లక్మా అలియాస్ బుడ్డి, మల్లంపెంటకు చెందిన మడివి లక్మా, దొడ్డి తుమ్నర్ పంచాయతీకి చెందిన దొడ్డి గుడ్రు లొంగిపోయిన వారిలో ఉన్నట్టు ఎస్పీ వెల్లడించారు.