కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇప్పటికి 22 నెలలు. చేసిన అప్పులు రూ.2.43 లక్షల కోట్లు! మరో రూ.2వేల కోట్లకు ప్రభుత్వం ఇండెంట్ పెట్టింది.ఓ వైపు రూపాయి కూడా అప్పు పుట్టడం లేదని ప్రచారం చేస్తూ..మరోవైపు నెలకు రూ.10వేల కోట్లకు పైగా అప్పులు చేస్తున్నది.
హైదరాబాద్ , అక్టోబర్ 14 (నమస్తే తెలంగాణ): సీఎం రేవంత్‌రెడ్డి గద్దెనెక్కినప్పటి నుంచి ఇప్పటివరకు ఒక్క ప్రాజెక్టు కట్టలేదు. కేసీఆర్ ప్రభుత్వం కట్టిన ప్రాజెక్టులను రిపేర్ చేసిందీ లేదు. కేసీఆర్ గద్దె దిగటంతో ఆగిన ప్రాజెక్టులకు తట్టెడు మట్టి కూడా ఎత్తిపోయలేదు. ఒక్క కొత్త రోడ్డు వేసింది లేదు, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ చేసింది లేదు, పేద విద్యార్థులకు పోషక విలువల గల టిఫిన్ పెట్టింది కూడా లేదు. పోనీ ఒక కొత్త మెడికల్ కాలేజీ అయినా కట్టారా? అంటే అదీ లేదు.
వరద బాధితులకు సాయం ప్రకటించి చేతులు దులుపుకున్నారు. కాంట్రాక్టర్లకు ఇంకా రూ.43 వేల కోట్ల బకాయిలు ఉన్నాయని చెప్తున్నారు. బకాయిలు పేరుకుపోతుండగా.. అప్పులు కుప్పలు తెప్పలుగా పేరుకుపోతున్నాయి. రుణ చెల్లింపులను 25, 30 ఏండ్లకు పొడిగించడంతో వడ్డీల భారం తడిసి మోపెడవుతున్నది. మరోవైపు రాష్ర్టానికి ఆదాయాన్నిచ్చే కీలక రంగాలన్నీ కాంగ్రెస్ పాలనలో తిరోగమనం వైపు సాగుతున్నాయి. సంక్షేమం అటకెక్కింది. పథకాల అమలు ప్రచారానికే పరిమితం అయ్యింది. దీంతో ప్రజల కొనుగోలు శక్తి తగ్గిపోయింది. సాధారణ పౌరులకు కూడా అప్పు పుట్టడం లేదు. వ్యాపారి పెట్టుబడికి రూపాయి దొరకటం లేదు. మరి.. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రోజూ ప్రభుత్వం తెస్తున్న అప్పులు ఎక్కడికి పోయాయి? వాటిని ఎందుకోసం వినియోగించినట్టు? 22 నెలలుగా రోజురోజుకూ దిగజారుతూ పతనం అంచుకు చేరిన ఆర్థిక వ్యవస్థ వైఫల్యానికి కారణం ఎవరు?
తరుముకొస్తున్న పతనం
రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థ వేగంగా పతనమవుతున్నదని ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత నాలుగు నెలల్లో మూడోసారి రాష్ట్రంలో నెగెటివ్ ద్రవ్యోల్బణం నమోదు కావడమే ఇందుకు సంకేతంగా పేర్కొంటున్నారు. గతంలో కేసీఆర్ సారథ్యంలో చోటుచేసుకున్న తెలంగాణ సమగ్ర, సమ్మిళిత అభివృద్ధి ఫలితంగా అన్ని వర్గాల ప్రజలు లబ్ధి పొందారు. రైతుబంధు, గొర్రెల పథకం, పాడి బర్రెల పథకం తదితర పథకాలు అమల్లోకి తీసుకురావడంతో గ్రామాలకు రూ.వేల కోట్ల నిధులు చేరాయి. ఫలితంగా ప్రజల్లో తక్షణ కొనుగోలు శక్తి పెరిగింది. దీంతో స్థానికంగా ఆదాయ వనరులను సృష్టించగలిగారు. మాంసం, పాలు, చేపలు, రొయ్యలు, వరి, పత్తి, మకజొన్న, పప్పులు, వేరుశనగలు, సోయాబీన్ లాంటి పంటల ఉత్పత్తి గణనీయంగా పెరిగి రైతులు, కూలీలకు ఉపాధి దొరికింది. దీంతో ప్రజల కొనుగోలు శక్తి పెరిగి సంపద వృద్ధి జరిగింది. గ్రామాలు కళకళలాడాయి. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం కేసీఆర్‌పై కక్షతో అనేక సంక్షేమ పథకాలను నిలిపివేసింది. రూ.4 వేల ఆసరా పెన్షన్, మహాలక్ష్మి కింద మహిళలకు నెలకు రూ.2,500, రైతుభరోసా రూ.15వేలు, వ్యవసాయ కూలీలకు ఏటా రూ.12 వేల సాయం, విద్యా భరోసా కార్డు కింద రూ.5 లక్షలు, దళితబంధు కింద రూ.12 లక్షలు తదితర 420 హామీలు ఇచ్చింది. కానీ ఇవేమీ అమలు చేయలేదు.
దీంతో గ్రామాలు నిధులు లేక వెలవెలబోతున్నాయని, గ్రామీణుల్లో కొనుగోలు శక్తి పడిపోయిందని ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు. ఇదే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పతనానికి కారణమని స్పష్టం చేస్తున్నారు. వాటిని నెరవేర్చి ఉంటే ప్రజల చేతిలో డబ్బు ఉండేదని, కొనుగోలు శక్తి పెరిగేదని, బహిరంగ మారెట్లో నగదు లావాదేవీలు జరిగేవని, వస్తు సామగ్రికి డిమాండ్ పెరిగి ఉండేదని నిపుణులు పేర్కొంటున్నారు. మరోవైపు ప్రభుత్వం వివిధ రంగాల మీద ప్రభుత్వ మూలధన వ్యయం గణనీయంగా తగ్గించింది. దీంతో ఆర్థిక వృద్ధి నిలిచిపోయిందని తెలిపారు. పరిపాలన మీద అవగాహన లేకపోవడం, అనాలోచిత నిర్ణయాలతో వ్యవసాయం, రియల్ ఎస్టేట్, చిన్న తరహా వ్యాపారాలు కుదేలైనట్టు ఆర్థిక రంగ నిపుణులు చెప్తున్నారు. మూసీ పునర్జీవం, హైడ్రా వంటివి రియల్ ఎస్టేట్ రంగాన్ని నాశనం చేశాయని, వేలాది ఉద్యోగ అవకాశాలు హరించుకుపోయాయని విశ్లేషిస్తున్నారు. బహిరంగ మార్కెట్లోకి ప్రభుత్వం మరింత డబ్బును పంపిణీ చేయడం ద్వారా ఈ పరిస్థితిని మెరుగుపరచవచ్చు. కానీ సీఎం రేవంత్‌రెడ్డికి ఇది సాధ్యం కాకపోవచ్చని ఆర్థిక నిపుణులు అంటున్నారు. 22 నెలల కాలంలో రూ.2.43 లక్షల కోట్ల అప్పులు తెచ్చారే తప్ప, ఆ డబ్బును ఏ రంగంలో పెట్టుబడి పెట్టారో అంతు దొరకటం లేదని నిపుణులు చెప్తున్నారు.
ఆర్థిక విధానాల అమలులో ఫెయిల్
రేవంత్‌రెడ్డి పాలనలో తెలంగాణ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతున్నదని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆందోళన వ్యక్తంచేశారు. గత నాలుగు నెలల్లో మూడుసార్లు నెగెటివ్ ద్రవ్యోల్బణం నమోదవడం రేవంత్ ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని అన్నారు. బతుకమ్మ, దసరా పండుగల సమయంలో సాధారణంగా వినియోగం పెరిగి పాజిటివ్ ద్రవ్యోల్బణం నమోదయ్యే అవకాశం ఎకువగా ఉంటుందని తెలిపారు. కానీ తెలంగాణలో మాత్రం నెగెటివ్ నమోదు కావడం ఆర్థిక విధానాల అమలులో ప్రభుత్వం వైఫల్యాన్ని ఎత్తి చూపుతున్నదని విమర్శించారు. కేసీఆర్ పాలనలో అభివృద్ధిలో దేశానికే ఆదర్శంగా నిలిచిన తెలంగాణ ఇప్పుడు రేవంత్‌రెడ్డి పాలన, ఆర్థిక అరాచకత్వంతో ఆర్థిక తిరోగమనం వైపు పయనిస్తోందని ఆరోపించారు.
కేసీఆర్ పాలనలో దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న తెలంగాణ ఇప్పుడు తిరోగమనంలోకి వెళ్లడం, శక్తిమంతమైన ఆర్థిక వ్యవస్థ కాంగ్రెస్ పాలనలో నాశనమవుతున్నదనే ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. గతంలో బీఆర్ఎస్ పాలనలో ఆర్థికంగా దూసుకుపోయిన రాష్ట్రం ఐటీ, ఫార్మా, రియల్ ఎస్టేట్ రంగాలు ఇప్పుడు సిక్ ఇండస్ట్రీగా మారిపోతున్నాయని నిపుణులు చెప్తున్నారు. కాంగ్రెస్ పాలన ఎంత తొందరగా ముగుస్తే, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంత త్వరగా కోలుకుంటుందని ఆర్థికరంగ నిపుణులు డీ పాపారావు తెలిపారు. హైడ్రాతో రియల్ ఎస్టేట్ దెబ్బతిన్నదని, సంక్షేమ పథకాలు అమలు కాకపోవటంతో గ్రామీణ ప్రాంత ప్రజల్లో కొనుగోలు తగ్గిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.