BRS | హైదరాబాద్, ఏప్రిల్ 24 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో మంగళవారం బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధుల సభలు నిర్వహించనున్నది. ప్రతి సభలో మూడు వేల నుంచి 3,500 మంది కార్యకర్తలు, పార్టీ ప్రతినిధులు పాల్గొననున్నారు. ఎన్నికల సంవత్సరం కావడంతో ఈ సభలకు ప్రాధాన్యత ఏర్పడింది. పార్టీ శ్రేణులను ఎన్నికల దిశగా ఎలా కార్యోన్ముఖులను చేయాలి? స్వరాష్ట్ర సాధన తర్వాత తెలంగాణ సాధించిన విజయ పరంపర, రాష్ర్టానికి బీజేపీ ప్రభుత్వం చేస్తున్న మోసం తదితర అంశాలపై తీర్మానాలు చేయనున్నది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీశాఖ మంత్రి కేటీఆర్ ఇప్పటికే మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఆయా అంశాలపై స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో పార్టీ ప్రతినిధుల సభల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.