Revanth Reddy | స్పెషల్ టాస్క్ బ్యూరో హైదరాబాద్, జూలై 11 (నమస్తే తెలంగాణ): ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా? అని పెద్దలు ఊరికే అనలేదు. వ్యవసాయం దండుగ అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎం హోదాలో వ్యాఖ్యానిస్తే.. అదే తరహాలోనే నేడు ఆయన అనుంగు శిష్యుడు, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మరో అడుగు ముందుకేసి రైతులకు ఉచిత విద్యుత్ అవసరం లేదని నిస్సిగ్గుగా ప్రకటించారు. పూర్వాశ్రమంలో తన గురువు చంద్రబాబునాయుడి ఆలోచన విధానాలను పుణికిపుచ్చుకొన్న రేవంత్‌రెడ్డి నోటి నుంచి ఇంతకంటే భిన్నంగా ఆలోచనలు ఎలా వస్తాయని యావత్తు తెలంగాణ సమాజం భగ్గుమంటున్నది. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్‌దే అధికారమని ఊహల్లో విహరిస్తున్న రేవంత్‌రెడ్డి, పార్టీ అధికారంలోకి రాకమునుపే రైతులకు ఉచిత విద్యుత్ అవసరం లేదన్న ఆయన వితండ వాదనపై పాలక, విపక్ష పార్టీలే కాకుండా సొంత పార్టీ నేతలే మండిపడుతున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ధరణిని రద్దు చేస్తామని ఇదివరకే రేవంత్‌రెడ్డి ప్రకటించారు. తాజాగా, వ్యవసాయానికి ఉచిత విద్యుత్తు అవసరం లేదని అంటున్నారు. మున్ముందు రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలను కూడా రద్దు చేస్తామంటారో లేక ఏకంగా వీటిని కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టోలో టీపీసీసీ అధ్యక్షుని హోదాలో రేవంత్‌రెడ్డి చేర్చుతారేమోనని రైతుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తం అవుతున్నది.
చంద్రబాబు అడుగుజాడల్లో రేవంత్
వ్యవసాయం దండుగ అన్న అభిప్రాయం కలిగిన చంద్రబాబు నాయుడి అడుగుజాడల్లోనే రేవంత్‌రెడ్డి పయనిస్తున్నారు. ఎప్పుడో నిజాం కాలం నాటి వ్యవసాయ భూముల పత్రాలు, ఖాతాలను బీఆర్ఎస్ ప్రభుత్వం నవీకరించి ధరణి పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ధరణి ఆధారంగానే రైతుబంధు పథకం అమలు చేస్తున్నది. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మొదటి సంతకం ధరణి రద్దు పైనే అని ఇప్పటికే టీపీసీసీ అధ్యక్షుడి హోదాలో రేవంత్‌రెడ్డి ప్రకటించారు. ధరణి రద్దు ప్రకటనపైనే రైతులు భగ్గున మండిపడుతుండగా.. తాజాగా, ఉచి త విద్యుత్తు అవసరం లేదంటూ రేవంత్‌రెడ్డి చేసిన ప్రకటన అగ్నికి ఆజ్యం పోసినట్టు అయింది. కాంగ్రెస్ అధికారంలోకి రాకమునుపే ఇలాంటి రైతు వ్యతిరేక విధానాలపై మాట్లాడుతున్న ఆ పార్టీ నేతలపై రైతులు తీవ్రంగా మండిపడుతున్నారు. రేవంత్ వ్యాఖ్యలు నాటి చంద్రబాబు నాయుడి పాలనను గుర్తు చేస్తున్నాయని విమర్శిస్తున్నారు. ఉచిత విద్యుత్తు పట్ల కాంగ్రెస్ అదిష్ఠానం వైఖరి, తన రాజకీయ గురువు చంద్రబాబు నాయుడి ఆలోచనా ధోరణి రేవంత్‌రెడ్డిని ప్రభావితం చేయడంతో ఆయన అలా మాట్లాడి ఉంటారని కాంగ్రెస్ సీనియర్ నేత ఒకరు వ్యాఖ్యానించారు. రియల్ ఎస్టేట్ వ్యాపారి, రాజకీయ దళారి అయిన రేవంత్‌రెడ్డికి వ్యవసాయం, రైతుల కష్టనష్టాలు, వారి బాగోగుల గురించి ఎలా తెలుస్తుందని బీఆర్ఎస్ నేత క్రిషాంక వ్యాఖ్యానించారు.
రైతులను కాల్చి చంపిన చరిత్ర రేవంత్ బాస్‌ది!
వ్యవసాయం దండుగ అని బలమైన అభిప్రాయం కలిగిన సమైక్య ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హయాంలో విద్యుత్ చార్జీల పెంపుదలను రైతులు తీవ్రంగా వ్యతిరేకించారు. పెంచిన విద్యుత్తు చార్జీలకు వ్యతిరేకంగా (2000 ఆగస్టు 28) వామపక్ష పార్టీల అధ్వర్యంలో బషీర్‌బాగ్ నుంచి రైతులు అసెంబ్లీ వైపు వెళ్లేందుకు ప్రయత్నించగా, రైతులపై కాల్పులు జరుపడం, అందులో ముగ్గురు ఆందోళనకారులు మరణించిన ఉదంతం గుర్తుండే ఉంటుంది. బషీర్‌బాగ్ కాల్పుల ఘటన చంద్రబాబు నాయుడు రాజకీయ జీవితంలో ఒక మచ్చగా నిలిచిపోయింది.