Minister Srinivas goud | హైదరాబాద్, మే 2 (నమస్తే తెలంగాణ): సమాజంలో అణగారిన వర్గాల ప్రజలకు మేలు చేయాలనే ఉద్దేశంతో సమర్థవంతమైన, సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకొని.. వాటిని క్షేత్రస్థాయిలో అమలు చేయగల, స్థితప్రజ్ఞత కలిగిన ఏకైక నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అని ఎక్సైజ్, క్రీడా, పర్యాటకశాఖ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ పేర్కొన్నారు. అలాంటి సమర్థవంతమైన నాయకులకు ప్రకృతి సైతం సహకరిస్తుందని చెప్పారు. రాష్ట్రప్రభుత్వం సుమారు రూ.13 కోట్లతో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా, కార్పొరేట్ హోటల్స్‌ను తలదన్నే రీతిలో నిర్మించిన నీరాకేఫ్‌ను మంత్రి కేటీఆర్ చేతులమీదుగా బుధవారం ప్రారంభించన్నారు. ఈ సందర్భంగా మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ ‘నమస్తే తెలంగాణ’తో నీరా ప్రత్యేకతలు, గౌడన్నల సంక్షేమంపై ముచ్చటించారు.
చెట్టు, మట్టి, మనిషి, శ్రమ విలువ తెలిసిన వారే నాయకులుగా ఎదుగుతరు. ఉమ్మడి పాలనలో తెలంగాణలోని అన్ని కులవృత్తులు ధ్వంసమైనయ్. చేతివృత్తిదారులంతా పొట్టబట్టుకొని పట్నానికొచ్చిర్రు. కేవలం ఎనిమిదేండ్లలో పట్నం వచ్చినవారిని పల్లెలకు వాపస్ పంపిండు మన కేసీఆర్ సార్. ఒక్క గీతవృత్తే కాదు.. ఏ కులవృత్తిని చూసిన.. అన్నింటికీ ప్రాణం పోసిండు. ఒకప్పుడు కల్లు అమ్ముకునే పరిస్థితులు లేవు. నేడు మద్యం వ్యాపారం చేసుకునేందుకు కూడా గౌడన్నలకు 15 శాతం రిజర్వేషన్ ఇస్తున్నడు కేసీఆర్ సార్. ఆసరా పింఛన్లిస్తుండు. అద్దెలు, బాకీలు మాఫీ చేసిండు. దుకాణాలకు అనుమతినిచ్చిండు. ఐదు లక్షల ఎక్స్‌గ్రేషియా కూడా ఇస్తుండు. కాబట్టే.. స్వరాష్ట్రంల మేము గౌడన్నలమని సగర్వంగా చెప్తున్నరు.
ఇది తెలంగాణ గౌడన్నలు చేసుకున్న అదృష్టం. రైతుబీమా తరహాలో.. గీతకార్మికులకు బీమా ఇవ్వడమనేది సాహసోపేత నిర్ణయం. గీతకార్మికుడు చనిపోతే.. ఆ కుటుంబానికి వారం పదిరోజుల్లోనే రూ.5 లక్షల బీ మా డబ్బులు నేరుగా వారి అకౌంట్లోనే జమయ్యేలా సీఎం కేసీఆర్ ఏర్పాట్లు చేసిన్రు. ఇందుకు సంబంధించిన విధి విధానాలను రూపొందించేపనిలో ఉన్నాం. దేశంలో ఎక్కడా గీతకార్మికుల జీవితాలకు బీమా ఇవ్వటంలేదు. బహుశా తెలంగాణలోనే తొలిసారి కావొచ్చు. ఇదీ పాలకుడికి సబ్బండ వర్గాలపై ఉన్న ప్రేమ.
తెలంగాణలోని అన్ని జిల్లాల నుంచి ఈ డిమాండ్ వినిపిస్తున్నది. ప్రస్తుతం హైదరాబాద్‌లోని నెక్లెస్ రోడ్లో ఏర్పాటు చేసిన నీరాకేఫ్‌లో.. నీరా, దాని అనుబంధ ఉత్పత్తులు విక్రయిస్తం. భవిష్యత్‌లో డిమాండ్ పెరిగితే.. అన్ని జిల్లాల్లో నీరాను విక్రయించేందుకు సిద్ధంగా ఉన్నాం.
అవును.. ప్రజల డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని నీరాను ప్రైవేట్ వ్యక్తులు విక్రయించుకునేందుకు అనుమతులు ఇచ్చే ఆలోచన చేస్తున్నాం. దీనిపై కార్యచరణ రూపొందించాల్సి ఉన్నది. ప్రకృతి నుంచి సహజసిద్ధంగా ఉత్పత్తి అయ్యే నీరాను.. అంతే స్వచ్ఛంగా విక్రయిస్తామని హామీ ఇచ్చిన వారికి మాత్రమే అనుమతులివ్వాలని ప్రాథమికంగా నిర్ణయించాం. ఈ నిర్ణయంపై కసరత్తు చేసి, తుది నిర్ణయాన్ని ప్రకటిస్తాం.
గీతవృత్తిదారులకు ప్రోత్సాహం అందించాలనే ఉద్దేశంతో హరితహారంలో భాగంగా సీఎం కేసీఆర్ ఈత, తాటిచెట్లను పెంచేందుకు నిర్ణ యం తీసుకున్నారు. ఇప్పటి వరకు సుమారు 4 కోట్లకుపైగా మొక్కలను నాటించారు. అవి కొన్నేండ్లలోనే నీరా ఉత్పత్తికి సిద్ధంగా ఉంటాయి. అవికూడా అందుబాటులోకి వస్తే.. ప్రజలు కలగన్నట్లు రాష్ట్రం మొత్తం స్వచ్ఛమైన నీరాను అందించేందుకు కృషి చేస్తాం.
ప్రకృతిసిద్ధమైన నీరాలో పోషకాలను అంచనా వేసేందుకు గుర్తింపు పొందిన ‘వీఐఎంటీఏ’ ల్యాబ్స్‌లో పరిశోధనలు చేయించాం. ఆ ఫలితాల్లో వంద గ్రాముల నీరాలో ఎనర్జీ 55 నుంచి 65 క్యాలరీలు, కార్బోహైడ్రేట్స్ 10 నుంచి 14 శాతం, ప్రొటీన్ 0.18 నుంచి 0.50 శాతం, పొటాషియం 70.00 మి.గ్రా నుంచి 170.00 మి.గ్రా, కాల్షియం 0.70 మి.గ్రా నుంచి 2.16 మి.గ్రా, ఫాస్ఫరస్ 5.70 మి.గ్రా నుంచి 16.90 మి.గ్రా, ఐరన్, విటమిన్ ఏ, ఈ. డీ2, కె, బీ2, బీ6, బీ12, సి పుష్కలంగా ఉన్నట్టు తేలింది. మొత్తం 20 అమైనో యాసిడ్స్ గాను నీరాలో 18 అమైనో యాసిడ్స్ పుష్కలంగా ఉన్నాయి. ఇవి కృత్రిమంగా తయారు చేయలేరు. ప్రకృతి నుంచి సహజ సిద్ధంగా వచ్చే నీరాలో పుషలంగా ఇవన్నీ లభిస్తాయి.
అన్ని వయసుల వారికి నీరా ఉపయుక్తంగా ఉంటుంది. దీనిని తాగడం వల్ల రోగనిరోధక శక్తిని పెంచుకోవచ్చు. రక్తపోటు అదుపులో ఉం టుంది. మూత్రపిండాల్లో రాళ్లు కరిగే అవకాశం ఉన్నది. క్యాన్సర్లు రాకుండా నివారిస్తుంది. కాలేయ సంబంధిత రోగాలు నయమవుతా యి. ఎముకలు బలపడతాయి. జీర్ణశక్తి పెరుగుతుంది. చక్కెర పేషెంట్లు కూడా దీనిని తీసుకోవచ్చని మా ఫలితాలు, అధ్యయనాల్లో తేలింది.
ఈ కేఫ్‌లో ప్రధానంగా తాటి, ఈత బెల్లం, సిరప్, తేనె, పామ్బూస్ట్, గ్రాన్యూల్స్, తాటి ఫలాలు, ముంజలు, గేగులు, ఈతపండ్లు, చక్కెర, ప్రత్యేకంగా నీరా ఐస్‌క్రీమ్‌లు అందుబాటులో ఉంటాయి. వీటితో పాటుగా మొత్తం ఏడు స్టాళ్లలో వెజ్, నాన్‌వెజ్, చిరుతిళ్లు, తెలంగాణలో ప్రత్యేకమైన పిండివంటకాలు అందుబాటులో ఉంటాయి. భువనగిరిలోని నందనం వద్ద, రంగారెడ్డిలోని ముద్విన్, సంగారెడ్డిలోని మునిపల్లి, నల్గొండలోని సర్వేల్లో నీరా సేకరణ కేంద్రాలున్నాయి.
ఇక్కడ మొత్తం నీరా అనుబంధ ఉత్పత్తుల తయారీకి సంబంధించి ప్రత్యేక రూములు, యంత్రసామగ్రి ఉన్నాయి. కేఫ్ మొత్తానికి సెంట్రల్ ఏసీ ఉన్నది. కస్టమర్లు సేదదీరేందుకు కుర్చీలు, టేబుల్స్ ఏర్పాటు చేశారు. హుస్సేన్‌సాగర్‌లో బోటింగ్ చేసే సదుపాయం టూరిం జం శాఖ కల్పించింది. ఫైర్ ఎక్విప్మెంట్ సిద్ధంగా ఉన్నది. ఈ కేఫ్‌ల నుంచి చూస్తే.. సెక్రటేరియట్, బుద్ధుని విగ్రహం, హుస్సేన్‌సాగర్ మరింత సుందరంగా కనిపిస్తాయి.
ఈ విషయం మీద రాష్ట్రప్రజలంతా అవగాహన పెంచుకోవల్సి ఉన్నది. ఎందుకంటే నీరా చెట్టు నుంచి సహజసిద్ధంగా ఉత్పత్తి అయ్యే పానీయం. ఆ నీరా రంగు మారకుండా, స్వచ్ఛత పాడవ్వకుండా చెట్లకే ప్రత్యేకంగా చిల్లర్ బాక్స్‌ను ఏర్పాటు చేశాం. వాటిల్లో ఐస్ జెల్‌ప్యాక్స్ ఉంటాయి. అవి మైనస్ నాలుగు డిగ్రీల వరకు నీరాను సంరక్షిస్తాయి. అక్కడ్నుంచి నేరుగా మళ్లీ ఐస్‌బాక్సుల్లో ప్రత్యేక వాహనం ద్వారా నీరాను హైదరాబాద్‌కు తరలిస్తాం. ఆ నీరాను మైనస్ నాలుగు డిగ్రీల ఉష్ణోగ్రతలో నిల్వచేసి, స్వచ్ఛమైన నీరాను ప్రజలకు అందిస్తాం. అయితే, చెట్టు నుంచి వచ్చే నీరా ఆరు డిగ్రీల ఉష్ణోగ్రత దాటితే.. కల్లుగా మారుతుంది. అప్పుడు అందులో ఆల్కహాల్ తయారవుతుంది. నీరా కల్లు దశకు మారకమునుపే మా సిబ్బంది అన్ని చర్యలు పకడ్బందీగా తీసుకుంటున్నారు. అందుకోసం కోట్ల రూపాయల యంత్రసామగ్రిని వినియోగిస్తున్నాం. కాబట్టి.. కల్లు వేరు, నీరా వేరు.