సోమవారం 23 నవంబర్ 2020
Telangana - Nov 21, 2020 , 00:59:04

మహానగరంలో కేటీఆర్‌ రణభేరి

మహానగరంలో కేటీఆర్‌ రణభేరి

నేటినుంచి దూకుడుగా టీఆర్‌ఎస్‌ ప్రచారం  

నియోజకవర్గాలవారీగా రోడ్‌షో

నేడు కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గాల్లో పర్యటన

హైదరాబాద్‌ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ స్టార్‌ క్యాంపెయినర్‌, పురపాలకశాఖమంత్రి కే తారకరామారావు రణభేరి మోగించబోతున్నారు. నియోజకవర్గాలవారీగా నేటినుంచి రోడ్‌షోలలో పాల్గొననున్నారు. రాష్ట్ర రాజకీయాలపై మంత్రి కేటీఆర్‌ది చెరగని ముద్ర. ముఖ్యంగా  హైదరాబాద్‌ రాజకీయాల్లో ఆయన మ్యాజిక్‌కు తిరుగేలేదు. అసెంబ్లీ అయినా, పార్లమెంట్‌ అయినా, స్థానిక ఎన్నికలైనా.. జీహెచ్‌ఎంసీ అయినా  మంత్రి కేటీఆర్‌ వ్యూహరచనకు సాటిలేదు. యువనేతగా అందరినీ కలుపుకొని పోతూ.. క్యాడర్‌లో ఎప్పటికప్పుడు నేనున్నానంటూ భరోసా కల్పించడం.. రాజధాని నగరంలో ఎలాంటి సమస్య వచ్చినా క్షణమాలస్యం చేయకుండా స్వయంగా వెళ్లి.. ప్రజలకు ధైర్యం కలిగించడం.. ఒక అన్నలా, తమ్ముడిలా అందరితో కలగలిసిపోవడం కేటీఆర్‌లో అంతర్లీనంగా ఇమిడిఉన్న శక్తి. తలపండిన రాజకీయనేతలను సమర్థంగా ఎదుర్కొని పార్టీని విజయతీరాలకు చేర్చిన నేతగా కేటీఆర్‌ నిలిచిపోయారని టీఆర్‌ఎస్‌ కార్యకర్తలంతా ముక్తకంఠంతో చెప్తారు. ఒంటి చేత్తో అటు గత జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో 99 స్థానాలు, ఇటు ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో 24 నియోజకవర్గాలకు గానూ 14  స్థానాల్లో విజయదుంధుబి మోగించడంలో అన్నీ తానై నడిపించిన యువనేతగా కేటీఆర్‌ కింగ్‌మేకర్‌ అయ్యారని ఆ పార్టీ నేతలు చెప్తున్నారు. 

గత ఎన్నికల్లోనూ అన్నీ తానై..

 గత గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల్లో తనకిచ్చిన బాధ్యతను భుజాలపై వేసుకొని గ్రేటర్‌ టీఆర్‌ఎస్‌ పార్టీని ఆనతికాలంలోనే బలమైన శక్తిగా మార్చారని కార్యకర్తలు గుర్తుచేస్తున్నారు. 120 డివిజన్లలో 135 చోట్ల ప్రసంగాలతో గ్రేటర్‌ హైదరాబాద్‌ను 360 డిగ్రీల కోణంలో కేటీఆర్‌ చుట్టివచ్చి  99చోట్ల జయకేతనం ఎగురవేసి స్వంతంగా మేయర్‌ స్థానాన్ని దక్కించుకోవడంలో ముఖ్యపాత్ర పొషించారు. ఈ నేపథ్యంలోనే తాజా గ్రేటర్‌ పోరులో రోడ్‌ షోలను విస్తృతంగా చేపట్టి వందకు పైగా స్థానాలను దక్కించుకోవడమే లక్ష్యంగా పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా కేటీఆర్‌ సమరశంఖం పూరిస్తున్నారు. 

నేటి రోడ్‌షో వివరాలు 

  • శనివారం కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గాల్లోని పార్టీ అభ్యర్థులతో కలిసి కేటీఆర్‌ నాలుగు చోట్ల రోడ్‌ షో నిర్వహిస్తారు. 
  • కూకట్‌పల్లి నియోజకవర్గం -సాయంత్రం ఐదు గంటలకు ఓల్డ్‌ అల్లాపూర్‌ చౌరస్తా. ఆరు గంటలకు మూసాపేట చిత్తారమ్మ తల్లి చౌరస్తా 
  • కుత్భుల్లాపూర్‌ నియోజకవర్గం - సాయంత్రం ఏడు గంటలకు ఐడీపీఎల్‌ చౌరస్తా. సాగర్‌ హోటల్‌ జంక్షన్‌ వద్ద సాయంత్రం 8 గంటలకు చేరుకుని ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తారు.