CM KCR | హైదరాబాద్/మహబూబ్‌గర్/మేడ్చల్, అక్టోబర్ 17 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): బీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ బుధవారం మహబూబ్‌నగర్, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల్లో పర్యటించనున్నారు. తొలుత జడ్చర్ల తర్వాత మేడ్చల్‌లో నిర్వహించే బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభల్లో కేసీఆర్ పాల్గొని ప్రసంగిస్తున్నారు. ఇటీవలి బహిరంగ సభల్లో సీఎం కేసీఆర్ చేసిన ప్రసంగాలు విస్తృతంగా జనబాహుళ్యంలోకి వెళ్లాయి. బీఆర్ఎస్ ఎన్నికల మ్యానిఫెస్టోలపై ప్రజల్లో అమితాసక్తి, ఆమోదం వ్యక్తం అవుతున్న నేపథ్యంలో బుధవారం నిర్వహించే సభల విజయవంతానికి జడ్చర్ల ఎమ్మెల్యే సీ లక్ష్మారెడ్డి, మేడ్చల్‌లో మంత్రి చామకూర మల్లారెడ్డి విస్తృత ఏర్పాట్లు చేశారు.
జడ్చర్ల పట్టణంలోని గంగాపూర్ రోడ్డు శివాలయం సమీపంలో నిర్వహించే సభకు బీఆర్ఎస్ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేశాయి. సభా ఏర్పాట్లను మంగళవారం మంత్రి శ్రీనివాస్‌గౌడ్, జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి పర్యవేక్షించారు. పోలీసులు బందోబస్తు చేపట్టారు. మేడ్చల్‌లోని గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలో 15 ఎకరాల్లో సభకు ఏర్పాట్లు చేశారు. సభ ప్రాంగణం సీఎం కేసీఆర్, మంత్రి మల్లారెడ్డి ఫ్లెక్సీలు పెట్టారు. సభకు వచ్చే ప్రజలకు అన్ని వసతులు కల్పించారు. సభ ఏర్పాట్లను మంత్రి చామకూర మల్లారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, ప్రభుత్వ విప్ శంభీపూర్ రాజు పరిశీలించారు.