హైదరాబాద్, జూన్ 23 (నమస్తే తెలంగాణ): రైతు భరోసా విజయోత్సవ సంబురాలను సచివాలయ ప్రాంగణంతోపాటు రాష్ట్రవ్యాప్తంగా అన్ని మండలకేంద్రాల్లో ఘనంగా నిర్వహించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు కాంగ్రెస్ కార్యకర్తలకు సూచించారు. ఈ నెల 16 నుంచి 24 వరకు తొమ్మిది రోజుల్లో రూ.9 వేల కోట్ల రైతు భరోసా నిధులను అన్నదాతల ఖాతాల్లో జమ చేస్తున్నట్టు చెప్పారు. కోటి 49 లక్షల 39 వేల 111 ఎకరాలకు రైతు భరోసా ఇస్తున్నట్టు పేర్కొన్నారు. సోమవారం గాంధీభవన్‌లో పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్, ఏఐసీసీ కార్యదర్శి చల్లా వంశీచంద్‌రెడ్డితో కలిసి భట్టి మీడియాతో మాట్లాడారు.