హైదరాబాద్, ఆగస్టు 5 (నమస్తే తెలంగాణ) : ప్రొఫెసర్ జయశంకర్ ఆశయాలను నిజం చేస్తూ, వారి స్ఫూర్తిని కొనసాగించడమే వారికి మనమందించే ఘననివాళి అని తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్పష్టంచేశారు. తెలంగాణ రాష్ట్ర స్వాప్నికుడు, నిర్దిష్ట పరిస్థితులకు నిర్దిష్ట కార్యాచరణ అనే సైద్ధాంతిక నిబద్ధతతో రాష్ట్ర సాధనోద్యమ భావజాలాన్ని వ్యాప్తి చేసిన ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి (ఆగస్టు 6) సందర్భంగా రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమంలో వారితో తనకున్న వ్యక్తిగత అనుబంధాన్ని, ఉద్యమ సంబంధాన్ని కేసీఆర్ స్మరించుకున్నారు.
ఉద్యమ కాలంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులకు అనుకూలంగా ప్రజలను ఉద్యమ దిశగా చైతన్యం చేసేలా, రాష్ట్ర సాధనకోసం అనుసరించాల్సిన వ్యూహాలను, ఎత్తుగడలను అమలు చేసేలా, తాను ప్రారంభించిన మలి దశ ఉద్యమంలో ప్రొఫెసర్ జయశంకర్ అందించిన స్ఫూర్తి మరువలేనిదని పేర్కొన్నారు. తాను చేపట్టిన ఉద్యమ కార్యాచరణకు అనుగుణమైన దిశగా వారిచ్చిన సలహాలు సూచనలు, ఉద్యమ రథ సారధిగా తనకు కొండంత ధైర్యాన్ని అందించాయని కేసీఆర్ తన కృతజ్ఞతాభావాన్ని వ్యక్తంచేశారు. ఉద్యమ కార్యాచరణలో తన వెంట నిలిచి, భుజం తట్టి అండగా నిలిచిన ప్రొఫెసర్ జయశంకర్ కన్న కలలను నిజం చేసే దిశగా తన కృషి కొనసాగిందని గుర్తుచేశారు. రాష్ర్టాన్ని సాధించడమే కాకుండా, పదేండ్ల ప్రగతి పాలనను తన ఆశయాలకు అనుగుణంగా సాగించి, దేశానికే ఆదర్శంగా తెలంగాణ రాష్ర్టాన్ని నిలిపామని తెలిపారు.