Congress | హైదరాబాద్, అక్టోబర్ 11 (నమస్తే తెలంగాణ): ‘కాంగ్రెస్ నేతలు ఢిల్లీకి గులాములు’ అనే ప్రచారాన్ని నిజం చేస్తూ మళ్లీ మళ్లీ రాష్ట్ర నాయకులు హస్తినకు పరుగులు తీస్తున్నారు. పార్టీ అధిష్ఠానం ఆదేశాలతో హైదరాబాద్-ఢిల్లీకి అప్ అండ్ డౌన్ చేస్తున్నారు. కాంగ్రెస్‌లో టికెట్ల కేటాయింపు పంచాయితీ తీవ్రస్థాయికి చేరింది. కొందరు నేతలు కుటుంబసభ్యులకు సైతం టికెట్లు అడుగుతున్న తరుణంలో అధిష్ఠానం నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నది. ఈ నేపథ్యంలో రాష్ట్ర నేతలు ఢిల్లీకి చక్కర్లు కొట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. మొన్నటి వరకు ఢిల్లీలోనే మకాం వేసిన టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వంటి కీలక నేతలు ఇప్పుడు మళ్లీ ఢిల్లీ బాట పడుతున్నారు. గురువారం ముఖ్యనేతలంతా మళ్లీ ఢిల్లీకి వెళ్తున్నారు. ఈ సారి కూడా మూడు నాలుగు రోజులు అక్కడే మకాం వేయనున్నారు. హస్తం నేతల హస్తిన పర్యటనలపై పార్టీలో సెటైర్లు, జోకులు పేలుతున్నాయి. ఢిల్లీ పర్యటనకు వెళ్తున్న నేతలు కూడా అంతర్గత సంభాషణల్లోనూ అసహనం వ్యక్తంచేస్తున్నారు. ‘మా నేతలు అచ్చంగా ఢిల్లీ గులాములే. రాష్ట్రంలో పార్టీని పట్టించుకోకుండా వీరంతా ఢిల్లీ చుట్టూ, అధిష్ఠానం చుట్టూ తిరిగేందుకే సరిపోతున్నరు’ అని ఆ పార్టీ కార్యకర్తలే వాపోతున్నారు.
ఇదేం ఖర్మరా నాయనా..
వరుస ఢిల్లీ పర్యటనలపై కాంగ్రెస్ ముఖ్య నేతలు సన్నిహితుల వద్ద ‘మాకు ఇదేం ఖర్మరా నాయనా’ అంటూ నిట్టూర్చుతున్నట్టు తెలిసింది. ‘ఓ వైపు రాష్ట్రంలో ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ప్రచారం ముమ్మరం చేయాల్సి ఉంది. ఇలాంటి కీలక సమయంలో క్షేత్రస్థాయిని వదిలేసి ఢిల్లీకి చక్కర్లు కొట్టడం ఏంటో అర్థం కావడం లేదు’ అంటూ వాపోతున్నట్టు సమాచారం. ఇష్టం లేకపోయినా సరే.. అధిష్ఠానం పిలుపుతో ‘అయిననూ హస్తినకు పోయి రావలె..’ అనే పరిస్థితి నాయకులకు ఎదురవుతున్నది. ఢిల్లీ పర్యటనలపై క్షేత్రస్థాయిలోనేమో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నదని, ఈ విషయాన్ని అధిష్ఠానం పెద్దలకు చెప్పలేకపోతున్నామని, వారు కూడా అర్థం చేసుకోవడం లేదని నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మేమైనా గెలుస్తామా?
వరుస ఢిల్లీ పర్యటనలు తమ కొంపముంచడం ఖాయమని కాంగ్రెస్ నేతలు ఆందోళన చెందుతున్నారు. ‘ఓ వైపు రాష్ట్రంలో ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. అధికార బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నది. నెల ముందు నుంచే ప్రజల్లోకి వెళ్లిపోయింది. మేము ఇంకా అభ్యర్థులను ప్రకటించలేని దుస్థితిలో ఉన్నాం. చివరికి మా స్థానాల్లోనూ ఎన్నికల ప్రచారానికి సన్నద్ధం చేసుకోలేదు. మరికొన్ని రోజులు పరిస్థితి ఇలాగే ఉండి.. హైదరాబాద్- ఢిల్లీకి తిరుగుతుంటే మా స్థానాలు కూడా గల్లంతవడం ఖాయం’ అంటూ పలువురు నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నట్టు తెలిసింది. ఇందుకు గత ఎన్నికల ఫలితాలు కూడా వారిని కలవరపెడుతున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ కీలక నేతలైన రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, జానారెడ్డి, పొన్నం ప్రభాకర్, షబ్బీర్ అలీ, జీవన్‌రెడ్డి, పొన్నాల లక్ష్మమ్య, డీకే అరుణ, ఉత్తమ్ పద్మావతి వంటి నేతలంతా ఓటమిపాలయ్యారు. ఈ నేపథ్యంలో నాటి ఫలితాలను గుర్తు తెచ్చుకొని వాపోతున్నారు.