శేరిలింగంపల్లి, జూలై 28 : గోపన్‌పల్లిలో ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో టీఎన్జీవోలు 12రోజులుగా ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదని ఉద్యోగులు మండిపడుతున్నారు. దీంతో సోమవారం 13వ రోజు వినూత్న నిరసన చేపట్టారు. ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులు పెద్దసంఖ్యలో నిరసనలో పాల్గొని మోకాళ్లపై నడుస్తూ తమ ఆవేదనను వ్యక్తంచేశారు. తమ స్థలాల కోసం న్యాయపోరాటం చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమని మండిపడ్డారు. వివిధ ప్రాంతాల నుంచి ఉద్యోగులు ఆందోళనలో పాల్గొంటున్నప్పటికీ తమగోడును పట్టించుకునేవారే లేరని వాపోయారు.
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ సంఘాల టీజేఏసీ నాయకులు సోమవారం రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డిని కలిశారు. టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు మారం జగదీశ్వర్, ప్రధాన కార్యదర్శి ఎస్ఎం ముజీబ్ హుస్సేని, అసోసియేట్ ప్రెసిడెంట్ కస్తూరి వెంకట్, కోశాధికారి, సొసైటీ అధ్యక్షుడు సత్యనారాయణగౌడ్, రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు లక్ష్మణ్‌రావు, ఉపాధ్యక్షుడు పర్వతాలు కలెక్టర్‌ను కలిసి టీఎన్జీవోల సమస్యను విన్నవించారు. ఇండ్ల స్థలాలను తమ సొసైటీకి అప్పగించాలని కోరారు.