Tirupati Reddy | హైదరాబాద్, నవంబరు 14 (నమస్తే తెలంగాణ): మూడు రోజుల పాటు అదో నిషేధిత ప్రాంతం. ఆ ప్రాంత దరిదాపుల్లోకి వెళ్లకుండా పోలీసుల నిర్బంధ ఆంక్షలు. అలాంటి ప్రాంతానికి ఓ వ్యక్తి మందీ మార్బలంతో వెళ్లారు. ఆయన కనీసం వార్డు మెంబర్ కూడా కాదు. కానీ ఆయన వచ్చారంటే అధికారులు వంగివంగి సలాములు కొడుతుంటే రండిరండి అంటూ పోలీసులు బందోబస్తు ఇస్తున్నారు. ఆయనే ముఖ్యమంత్రి సోదరుడు తిరుపతిరెడ్డి. అందుకే జిల్లా కలెక్టర్ ఎదురువెళ్లి స్వాగతం పలుకుతారు. అదనపు కలెక్టర్ పరుగున వెళ్లి పుష్పగుచ్ఛం ఇస్తారు. ఎంపీ, ఎమ్మెల్యేలను ఆ ప్రాంతానికి వెళ్లకుండా అడ్డుకునే పోలీసులు సదరు వ్యక్తికి రూల్స్ నహీ జాన్తా అంటారు.
లగచర్ల ప్రాంతంలో ఫార్మా కంపెనీల ఏర్పాటుకు రేవంత్‌రెడ్డి ప్రభుత్వం చేపడుతున్న భూసేకరణ ఆ ప్రాంత రైతులకు ప్రాణ సంకటంగా తయారైంది. గత సోమవారం జరిగిన ఘటనతో ఆ ప్రాంతాలన్నీ నిర్మానుష్యంగా మారాయి. యువకులు ఇతర ప్రాంతాలకు వెళ్లి తలదాచుకుంటున్నారు. గురువారం లగచర్ల బాధిత గిరిజన మహిళలు సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌తో పాటు తెలంగాణ భవన్‌లోనూ తమ దుర్భరస్థితిని వివరించారు. పోలీసులు ఎన్ని బాధలు పెడుతున్నారో వివరిస్తూ తిరుపతిరెడ్డి తమ గ్రామానికి వచ్చారంటూ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ప్రజాప్రతినిధులు, ఇతరులను అటువైపు కన్నెత్తి చూడనీయని పోలీసులు ఎలాంటి ప్రోటోకాల్ లేని సీఎం సోదరుడిని మాత్రం అక్కడికి అనుమతించి తమకు ఏం సంకేతాలు ఇవ్వాలనుకుంటున్నారని పలువురు ప్రశ్నిస్తున్నారు.
లగచర్లలో జరిగిన ఘటనలో అధికారులపై దాడిని ఖండిస్తున్నవారు సైతం అమాయక రైతుల బాధను అర్థం చేసుకోవాలని ప్రభుత్వానికి సూచిస్తున్నారు. ఈ క్రమంలో తమ ప్రాణంలా భావించే భూముల్ని కోల్పోయేందుకు వారు సిద్ధంగా లేరనే విషయాన్ని వాళ్లు తమ ఆక్రోశం ద్వారా వెల్లడించారని చెబుతున్నారు. కానీ సీఎం సోదరుడు తిరుపతిరెడ్డి మాత్రం ఓట్లేసిన జనంపై మళ్లీ కన్నెర్రజేస్తున్నారు. గతంలో మీరు భూములియ్యకున్నా బరాబర్ గుంజుకుంటాం అంటూ తీవ్ర దుర్భాషలాడుతూ రైతులను కించపరిచిన ఆడియో సామాజిక మాద్యమాల్లో వైరల్ అయింది. బుధవారం కూడా అదే స్థాయిలో భూముల్ని వదిలేది లేదు అంటూ ప్రకటనలు చేశారు. వికారాబాద్ కలెక్టరేట్‌కు వెళ్లిన తిరుపతిరెడ్డికి జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్, ఇతర యంత్రాంగం సాదరంగా ఆహ్వానం పలకడం సభ్య సమాజాన్ని నివ్వెరపరిచింది.
ఈ సందర్భంగానే లగచర్ల ప్రాంతంలో ఫార్మా కంపెనీ ఏర్పాటు తథ్యం… భూములు గుంజుకునేది ఖాయం అనే సంకేతాలిచ్చిన తిరుపతిరెడ్డి తిరిగి లగచర్లకు వెళ్లారు. అక్కడ కొందరు అనుచరులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఇంత జరిగినా… తిరుపతిరెడ్డి తిరిగి తమ గ్రామానికి రావడంతో రైతు కుటుంబాల్లో కలవరం మొదలైంది. స్థానిక మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ, పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలను కొడంగల్ దరిదాపుల్లోకి రానీయకుండా అడ్డుకుంటున్న పోలీసులు పుండు మీద కారం చల్లినట్టుగా సీఎం సోదరుడు తిరుపతిరెడ్డి లగచర్లకు వెళ్లడాన్ని అనుమతించడంపై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి.
ప్రజాపాలనలో ప్రజాస్వామ్య దుస్థితి. ప్రజాప్రతినిధి కాకుండానే సీఎం రేవంత్‌రెడ్డి సోదరుడు తిరుపతిరెడ్డికి ప్రభుత్వ, అధికార యంత్రాంగం నిబంధనలు తుంగలో తొక్కి ప్రోటోకాల్ కల్పించడం. ప్రాణాలు పోయినా సరే… భూములిచ్చేది లేదంటూ పోరాటం చేస్తున్న లగచర్ల పరిసర గ్రామాల ప్రజలు ఇప్పుడు తిరుపతిరెడ్డి రాకతో మరింత భయం గుప్పిట్లోకి వెళ్లారు. తమ ఆక్రోశం, ఆవేదనను అర్థం చేసుకోకపోతారా అని ఆశతో ఉన్న ఆ బడుగు బలహీన, గిరిజన రైతులు… సీఎం సోదరుడి పర్యటనలోని ప్రకటనలతో హడలెత్తిపోతున్నారు.