Revanth Reddy | కొడంగల్, జనవరి 30 : వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలో సీఎం రేవంత్‌రెడ్డి సోదరుడు, కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి తిరుపతిరెడ్డి హవా కొనసాగుతున్నది. ఈనెల 26న ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కొడంగల్ నియోజకవర్గాన్ని తిరుపతిరెడ్డి చూసుకుంటారని రేవంత్‌రెడ్డి ప్రకటించారు. ఆయనకు ఎలాంటి రాజ్యంగపరమైన పదవి లేకపోయినా అధికారిక కార్యక్రమాల్లో పాల్గొని శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తున్నారు. గురువారం దుద్ద్యాలలో ఏర్పాటు చేసిన ఎంపీడీవో కార్యాలయాన్ని తిరుపతిరెడ్డి ప్రారంభించారు. పట్టణ పరిధిలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో అదనపు గదుల నిర్మాణ పనులతోపాటు కొడంగల్, బొంరాస్‌పేట మండల కేంద్రాల్లో ఇందిరమ్మ మోడల్ ఇండ్ల నిర్మాణానికి భూమిపూజ చేశారు. 13 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి పథకం చెక్కులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ‘కడా’ ప్రత్యేకాధికారి వెంకట్‌రెడ్డి, దుద్యాల ఇన్చార్జి ఎంపీడీవో మహేశ్‌కుమార్ పాల్గొన్నారు.
పెద్దపల్లి, జనవరి 30 (నమస్తే తెలంగాణ): ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ను పట్టించుకోకుండా పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు నియోజకవర్గంలో గురువారం ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాల ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ కోడ్ అమలులోకి వచ్చినా కాల్వశ్రీరాంపూర్ మండలం పెడగపల్లి, మడిపెల్లి, ఉషన్నపల్లి గ్రామాల్లో సీసీ రోడ్లకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. రూ.3.25 కోట్ల అంచనా వ్యయంతో కాల్వశ్రీరాంపూర్ కేజీబీవీలో అదనపు తరగతి గదుల నిర్మాణం, రూ.50 లక్షలతో తహసీల్దార్ కార్యాలయ భవన నిర్మాణం, ఎలిగేడు మండలం రాములపల్లిలో రూ.5లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్డు పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. కాగా శిలాఫలకంలో 2025 జనవరి 29వ తేదీ ఉండడం కొసమెరుపు.