హైదరాబాద్, నవంబర్ 9 (నమస్తే తెలంగాణ) : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో (Jubilee Hills By-Election) కాంగ్రెస్ పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడే అవకాశం ఉన్నదని, దీంతో గట్టి నిఘా పెట్టాలని బీఆర్ఎస్ పార్టీ చేసిన విజ్ఞప్తికి ఎన్నికల సంఘం సానుకూలంగా స్పందించింది. 226 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై డ్రోన్ కెమెరాలతో నిఘా ఏర్పాటుచేసింది. అధికార పార్టీ నాయకుల తీరుపై ఒక కన్నువేసి పారదర్శకంగా ఎన్నికలు జరిగేలా చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ తరఫున ఢిల్లీలో ఇటీవల భారత ఎన్నికల కమిషన్(ఈసీఐ)కు ఆ పార్టీ పార్లమెంటరీ పార్టీ నేత కేఆర్ సురేశ్‌రెడ్డి, రాజ్యసభ సభ్యుడు దీవకొండ దామోదర్‌రావు ఫిర్యాదుచేశారు. ప్రతి పోలింగ్ బూత్‌లో మహిళా అధికారులు, పోలీసులను ఏర్పాటుచేయాలని, ఒకరి ఓటును మరొకరు వేసే ప్రయత్నాలు జరుగుతున్నందున అన్ని పోలింగ్ బూత్‌లలో వెబ్ కెమెరాలు పెట్టాలని సూచించారు.
ప్రతిపక్ష నాయకులపై దాడులు, అధికార దుర్వినియోగం ని యంత్రణకు కేంద్ర బలగాలను మోహరింపజేయాలని విజ్ఞప్తిచేశారు. ఉప ఎన్నికలో ఓడిపోతామన్న భయంతోనే సీఎం రేవంత్‌రెడ్డి అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నట్టు త మకు సమాచారం ఉన్నదని ఫిర్యాదుచేశారు. బీఆర్ఎస్ వినతిపై సానుకూలంగా స్పందించిన ఈసీఐ.. పోలింగ్ ప్రక్రియను మూడంచెల భద్రత నడుమ నిర్వహించేందుకు ఏర్పాట్లుచేసింది. 139 పోలింగ్స్టేషన్ల వద్ద 139 డ్రో న్లతో మానిటరింగ్ చేయనున్నారు. 58 మంది అభ్యర్థులు బరిలో నిలువగా.. ఈ నెల 11న పోలింగ్ జరుగనున్నది. తొలిసారి ఎన్నికల పోలింగ్ సమయాన్ని అదనంగా గంటపాటు పొడిగించారు. పోలింగ్ విధుల్లో 3 వేల మంది సిబ్బంది, 19 మంది నోడల్ అధికారులను నియమించారు. బందోబస్తులో 1,761 మంది లోకల్ పోలీసులతోపాటు 8 కంపెనీల సీఐఎస్ఎఫ్ బలగాలను మోహరించారు. 230 మంది రౌడీ షీటర్లను బైండోవర్ చేశారు.