హైదరాబాద్, డిసెంబర్ 17 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా మూడు విడతల పంచాయతీ ఎన్నికలు ముగిశాయి. మరోవైపు ఎన్నికల నిర్వహణలో పారదర్శకత కొరవడిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. మెజార్టీ పోలింగ్ స్టేషన్లలో వెబ్‌క్యాస్టింగ్ లేకపోవడం ఈ అనుమానాలకు తావిస్తున్నది. కేవలం 10శాతం కేంద్రాల్లోనే వెబ్‌క్యాస్టింగ్ నిర్వహించగా, మిగతా చోట్ల అలాంటి ఏర్పాట్లేమి చేయలేదు. ఈ క్రమంలో ఓట్ల లెక్కింపు ప్రక్రియలో అవకతవకలు జరిగినట్టు పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. ఈ అంశంపై ఇప్పటికే సర్పంచ్ అభ్యర్థులు రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినట్టు సమాచారం.
ఈనెల 11, 14, 17 తేదీల్లో పంచాయతీల ఎన్నికలు అధికారులు నిర్వహించారు. తొలి విడతలో 37,562 పోలింగ్ స్టేషన్లకుగాను కేవలం 3,461 (10.85%) కేంద్రాల్లో, రెండో విడతలో 38,337 పోలింగ్స్టేషన్లకుగాను 3,769 (10.17%) కేంద్రాల్లో, మూడో విడతలో 36,483 పోలింగ్ కేంద్రాలకుగాను 3,547(10.28%) కేంద్రాల్లో వెబ్‌క్యాస్టింగ్ అమలుచేశారు.
వచ్చే ఎన్నికల్లో వెబ్‌క్యాస్టింగ్‌ను మరింత వినియోగిస్తామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు తెలిపారు. మూడో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ సరళిని రాష్ట్ర ఎన్నికల కార్యాలయంలో డీజీపీ శివధర్‌రెడ్డి, ఎన్నికల కమిషనర్ రాణి కుముదినితో కలిసి బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల్లో టెక్నాలజీ వాడటంతో గ్రామాల్లో శాంతి భద్రతలపై అప్రమత్తంగా ఉండొచ్చని తెలిపారు.