న్యూస్‌నెట్‌వర్క్, అక్టోబర్ 2: ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పలు మండలాల్లో బుధవారం సాయంత్రం కురిసిన గాలివాన బీభత్సం సృష్టించింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షానికి పిడుగులు పడి ముగ్గురు మహిళలు మృతి చెందారు. వేగంగా వీచిన గాలులకు విద్యుత్తు స్తంభాలు విరిగిపడ్డాయి. పలు చోట్ల చెట్లు కూలిపోయాయి. మరికొన్ని చోట్ల వరి తదితర పంటలు నేలవాలాయి. ములుగు మండలం మల్లంపల్లి ప్రభుత్వ పాఠశాలలో చెట్టుపై పిడుగుపడి చీలిపోయింది. మంగపేట మండలంలోని పలు గ్రామాల్లో పలువురి ఇండ్లపై రేకులు ఎగిరిపోయాయి. మండల కేంద్రంలోని శివాలయం సమీపంలో ఉన్న సుమారు 100 ఏండ్ల నాటి భారీ చింత చెట్టు నేలకూలింది.
హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలం చౌళ్లపల్లికి చెందిన ఇటుకల నిర్మల (51), సోలెంక రమ (45)తోపాటు మరో ఎనిమిది మంది పత్తి తీయడానికి వెళ్లారు. ఉరుములు, మెరుపులతో వాన మొదలవ్వడంతో నిర్మల, రమ పక్కనే ఉన్న చెట్టు కింద నిలబడ్డారు. మిగతా వారు వేరే చోట ఉన్నారు. ఇదే సమయంలో చెట్టుపై పిడుగు పడి ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మృతి చెందారు. నిర్మలకు ముగ్గురు కుమార్తెలు, భర్త రాజేందర్ ఉన్నారు. రమకు ఇద్దరు కుమారులు, భర్త మహేందర్ ఉన్నారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం రంగయ్యపల్లెకు చెందిన కారట్లుపెల్లి లక్ష్మి (49) భర్త నగేశ్‌తో కలిసి వ్యవసాయ పొలం వద్దకు వెళ్లింది. పత్తి మొక్కలకు ఎరువులు వేస్తున్న సమయంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. దీంతో ఇంటికి వచ్చేందుకు సిద్ధమవుతుండగా ఒక్కసారిగా పిడుగుపడి లక్ష్మి అక్కడిక్కడే మృతి చెందింది. మృతురాలికి భర్తతోపాటు ఇద్దరు కూతుళ్లు, కొడుకు ఉన్నారు. విషయం తెలుసుకున్న భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డితోపాటు ప్రస్తుత ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు మృతురాలి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆమె కుటుంబాన్ని ఆదుకుంటామని భరోసా ఇచ్చారు.