స్టేషన్‌ఘన్‌పూర్/ధర్మసాగర్/చేగుంట, అక్టోబర్ 7 : కాలం కలిసి రాక.. అప్పులు తీర్చే మార్గం లేక మరో ముగ్గురు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటనలు జనగామ, హనుమకొండ, మెదక్ జిల్లాల్లో చోటుచేసుకున్నాయి. పోలీసులు తెలిపిన వివరాలు.. జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్ మండలం మీదికొండకు చెందిన చిలువేరు రవి(59) రెండెకరాల్లో వరి సాగుతోపాటు గొర్లను కాస్తూ జీవిస్తున్నాడు. మూడేండ్లుగా మామిడి తోటలు పడుతుండగా, రూ.10 లక్షల వరకు అప్పులయ్యాయి. వాటిని తీర్చే మార్గంలేక మనోవేదనకు గురై శనివారం పొలం వద్ద పురుగుల మందు తాగాడు. కుటుంబ సభ్యులు స్టేషన్‌ఘన్‌పూర్‌లోని ప్రభుత్వ దవాఖానకు, అక్కడి నుంచి వరంగల్ ఎంజీఎంకు తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు.
హనుమకొండ జిల్లా నారాయణగిరిలో..
హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం నారాయణగిరికి చెందిన దేవరుప్పుల భిక్షపతి(42) రెండెకరాల్లో మక్క, వరి వేశాడు. సరైన దిగుబడి రాక ఖర్చులు మీదపడ్డాయి. దీనికితోడు ఆరోగ్యం సహకరించకపోవడంతో వైద్యానికి రూ.6 లక్షలు అప్పులయ్యాయి. తీవ్ర మనోవేదనకు గురైన భిక్షపతి సోమవారం బావి వద్ద చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
మెదక్ జిల్లా పోలంపల్లిలో..
మెదక్ జిల్లా చేగుంట మండలం పోలంపల్లికి చెందిన రైతు వట్టెం రమేశ్ (32) రెండెకరాల్లో అప్పు చేసి ఏడు బోర్లు వేశాడు. ప్రస్తుతం నాలుగు లక్షలకుపైగా అప్పు ఉండటంతో కుంగిపోయాడు. ఈ నెల 4న అర్ధరాత్రి ఇంట్లో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించగా కుటుంబ సభ్యులు హైదరాబాద్ గాంధీకి తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు.