Revanth Reddy | హైదరాబాద్, జూలై 15 (నమస్తే తెలంగాణ): ‘రైతులకు మూడు గంటల కరెంట్ చాలు. ఉచిత విద్యుత్ అవసరం లేదు’ అంటూ చేసిన వ్యాఖ్యలు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయా? పార్టీలో తన ప్రతిష్ట దిగజార్చాయా? ఆ వ్యాఖ్యలతో పార్టీపై రైతుల్లో వ్యతిరేకత పెరిగిందా? అంటే అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి. వాస్తవానికి రేవంత్ వ్యాఖ్యలపై ఊహించనిరీతిలో ఇటు పార్టీ నుంచి అటు రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. నలువైపుల నుంచి కరెంట్ సెగ తగలడంతో తన వ్యాఖ్యలను కప్పిపుచ్చుకునేందుకు నానా తంటాలు పడుతున్నారు. వరుస ప్రెస్మీట్లు పెడుతూ మూడు గంటల కరెంట్ వ్యాఖ్యలపై దృష్టి మళ్లించేదుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు.
కరెంట్ వ్యాఖ్యలపై విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా.. సంబంధంలేని ఇతర విషయాలు ప్రస్తావిస్తూ తప్పించుకుంటున్నారు. అయినా, కుదరకపోవడంతో రేవంత్‌రెడ్డిలో ఫ్రస్టేషన్ పెరిగిపోయిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై గాంధీభవన్‌లో ఆసక్తికర చర్చ జరుగుతున్నది. గతంలో ప్రెస్మీట్లు పెట్టినప్పుడు సాధారణంగా మాట్లాడే రేవంత్‌రెడ్డి.. ఇప్పుడు సహనం కోల్పోయిన మాట్లాడుతున్నారని, సరైన సమాధానం చెప్పలేక బూతుపురాణం అందుకుంటున్నారని పార్టీ కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు.
ఆయన ముఖంలో కళ తప్పిందని అంటున్నారు. రేవంత్ మూడు గంటల కరెంట్ వ్యాఖ్యలు హస్తం పార్టీలో తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. ఇప్పటికే ఈ వ్యాఖ్యలపై అధిష్ఠానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. చీవాట్లు కూడా పెట్టినట్టు సమాచారం. కార్యకర్తలు కూడా రేవంత్‌రెడ్డి తీరుపై గుర్రుగా ఉన్నారు. రైతులకు సంబంధించిన సున్నితమైన కరెంట్ అంశంపై అభ్యంతర వ్యాఖ్యలు చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. రేవంత్ బూతు పురాణం వింటుంటే రేవంత్‌రెడ్డి మరో బండి సంజయ్ అవుతారేమోననే సందేహం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి పార్టీలో రేవంత్‌రెడ్డికి ‘మూడు’నట్టే అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు బండి సంజయ్ కూడా కన్నూ మిన్నూ కానకుండా సీఎం కేసీఆర్‌పై, కేటీఆర్‌పై ఇతర నాయకులపై నోటికొచ్చినట్టు మాట్లాడారు. ఇప్పుడు రేవంత్‌రెడ్డి కూడా బండి బాటలోనే నడుస్తున్నారు. అదే గతి రేవంత్‌రెడ్డికి కూడా పడుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
పొరుగు రాష్ట్రాలకు వలస పోవాల్సిందే
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 3 గంటల కరెంట్ ఇస్తే ఎవుసం ఇడిసిపెట్టుకోవాలి. పొరుగు రాష్ట్రాలకు వలస పోవాల్సిందే. మూడు గంటల కరెంట్ ఇస్తే రెండెకరాలు కూడా పండదు. ఖర్చులు బాగా పెరిగిన పరిస్థితుల్లో పిల్లల్ని సాదడం కష్టం. యాసంగిలో అయితే ఎకరా కూడా పండదు. కేసీఆర్ వచ్చినాక కరెంట్‌కు ఈ ఇబ్బంది లేదు. బోర్లు బాగా పోస్తున్నాయి. పంటలు బాగా పండుతున్నాయి. ఈ 9 ఏండ్లళ్ల ఎప్పుడు కూడా కరెంట్ కోసం బాధపడలేదు. గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు షిప్టుల వారీగా ఇచ్చే కరెంట్‌తో పారిన భూమే మళ్లీ పారేది. మిగతా పంట ఎండిపోయేది. అప్పుడు ఒకబోరు కింద రెండెకరాలు సాగైతే అదే బోర్ల కింద ఇప్పుడు ఐదారెకరాలు సాగవుతుంది. ఒక్క లాల్గడీమలక్పేటలోనే అంతకు ముందు 100 ఎకరాలు పండితే ఇప్పుడు 250 నుంచి 300 ఎకరాలు పండుతుంది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే వెనుకటి రోజులు మళ్లీ వచ్చేనట్టే.
– హరిశంకర్ గౌడ్, లాల్‌గడిమలక్‌పేట, శామీర్‌పేట మండలం, మేడ్చల్ జిల్లా