కాటారం/కౌడిపల్లి/బేల, జనవరి 20 : అప్పుల బాధతో ముగ్గురు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషాద ఘటనలు జయశంకర్ భూపాలపల్లి, మెదక్, ఆదిలాబాద్ జిల్లాల్లో చోటుచేసుకున్నాయి. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భూపాలపల్లి జిల్లా కాటారం గ్రామానికి చెందిన కోడెల సదానందం (42) పోతులవాయి శివారులో తనకున్న 4 ఎకరాల్లో పత్తి పంట సాగుచేశాడు. పెట్టుబడుల కోసం తెచ్చిన రూ.2 లక్షలకుపైగా అప్పు అలాగే ఉండిపోయింది. అప్పులు తీర్చేమార్గం లేక తీవ్ర మనోవేదనకు గురవుతున్నాడు. ఈ నేపథ్యంలో సోమవారం రాత్రి ఇం ట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మంగళవారం స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతుడికి భార్య రమ, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్టు కాటారం ఎస్సై శ్రీనివాస్ తెలిపారు.
మెదక్ జిల్లాలో..
మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం బతుకమ్మతండాకు చెందిన రైతు దేవ్‌సోత్ సర్వేశ్ (57) తనకున్న ఎకరం ఐదు గుంటల పొలంలో బోరు వేశాడు. ఇల్లు కట్టి, ఇద్దరు కుమారుల పెండ్లి చేయడానికి రూ.8 లక్షల వరకు అప్పు చేశాడు. అప్పులు ఎక్కువయ్యే సరికి వాటిని ఎలా తీర్చాలో తెలియక మానసికంగా కుంగిపోయాడు. ఈ క్రమంలో ఈనెల 11న పెద్దకొడుకు అనిల్‌కు ఫోన్‌చేసి గడ్డిమందు తాగినట్టు చెప్పాడు. వెంటనే నర్సాపూర్ ప్రభుత్వ దవాఖానకు, అక్కడ నుంచి హైదరాబాద్‌లోని గాం ధీ దవాఖానలో చేర్పించారు. చికిత్స పొందుతూ మృతి చెందాడు.
ఆదిలాబాద్ జిల్లాలో..
ఆదిలాబాద్ జిల్లా బేల మండలం పి ట్గావ్ గ్రామానికి చెందిన రైతు జాదవ్ అంకుష్ (33) తనకున్న మూడెకరాల్లో పత్తి, కంది సాగు చేశాడు. ఇందుకోసం అప్పులు తీసుకున్నాడు. అప్పులు ఎలా తీర్చాలో తెలియక మానసిక వేదనకు గు రైన అంకుష్ ఈనెల 18న పురుగుల మందు తాగాడు. కుటుంబ సభ్యులు ఆదిలాబాద్‌లోని రిమ్స్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతుండగా పరిస్థితి విషమించి మంగళవారం మధ్యాహ్నం మృతి చెందాడు.