హైదరాబాద్, జనవరి 21(నమస్తే తెలంగాణ) : సాగు వ్యతిరేక విధానాలతో కాంగ్రెస్ సర్కార్ చేస్తున్న ద్రోహం రైతన్నకు శాపంగా మారిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. చేతగాని ముఖ్యమంత్రి రేవంత్ పాలనలో సాగురంగం సంక్షోభంలో చిక్కుకున్నదని బుధవారం ఎక్స్‌వేదికగా ఆగ్రహించారు. ఆదిలాబాద్, మెదక్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో ఒకేరోజు ముగ్గురు అన్నదాతల బలవన్మరణాలే ఇందుకు నిదర్శనమని, వారిని పొట్టనపెట్టుకున్న పాపం ముమ్మాటికీ సీఎం రేవంత్‌రెడ్డిదేనని ధ్వజమెత్తారు. అబద్ధపు హామీల పేరిట చేసిన ద్రోహం వల్లే రైతాంగానికి ఈ దుస్థితి దాపురించిందని మండిపడ్డారు. పెట్టుబడి సాయానికి పాతరేసి, రుణమాఫీ పేరిట నయవంచన చేసి, చివరికి యూరియా కూడా ఎగ్గొట్టి దిగుబడిని దెబ్బతీయడంతో రైతుల పరిస్థితి అనాథలా మారిందని ఆవేదన వ్యక్తంచేశారు. రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన రైతుల బలవన్మరణ ఘటనలే ఇందుకు అద్దంపడుతున్నాయని స్పష్టంచేశారు.
రూ.25లక్షల పరిహారమివ్వాలి
అప్పులబాధతో భూపాలపల్లిలో కోడెల సదానందం, మెదక్‌లో దేవ్‌సోత్ సర్వేశ్, ఆదిలాబాద్‌లో జాదవ్ అంకుశ్ బలవన్మరణాలకు పాల్పడడంతో వారి కుటుంబాలు రోడ్డునపడ్డాయని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్కో కుటుంబానికి రూ.25 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా చెల్లించి ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. రెండేండ్లలో సుమారు 900మంది రైతులు గుండె పగిలి బలవన్మరణాలకు పాల్పడినా ఈ సర్కార్‌కు సోయిరాకపోవడం సిగ్గుచేటని ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో ధైర్యంగా బతికిన రైతు కుటుంబాల్లో ప్రస్తుతం మోగుతున్న మరణమృదంగానికి రేవంత్ సర్కార్ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ‘అన్నదాతలారా దయచేసి ధైర్యం కోల్పోకండి, మరో మూడేండ్ల ఓపిక పట్టండి.. వ్యవసాయ వ్యతిరేక కాంగ్రెస్ పార్టీని, రైతు ద్రోహి రేవంత్‌ను గద్దె దించుందాం.. మన తెలంగాణలో సాగుకు మళ్లీ మంచి రోజులు తెచ్చుకుందాం’ అని విజ్ఞప్తిచేశారు.