తెలంగాణ అస్తిత్వానికీ, ఆత్మగౌరవానికీ ముప్పు రాబోతున్నదా? తెలంగాణ ప్రయోజనాలు కాటగలవనున్నాయా? తెలంగాణ సమాజం పదేండ్లుగా అనుభవించిన స్వీయ నిర్ణయాధికారం ప్రమాదంలో పడిందా? అంటే.. పార్లమెంట్ ఎన్నికల ప్రచారం నేపథ్యంగా సాగిన రెండు జాతీయ పార్టీల వ్యవహారం అవుననే సమాధానం ఇస్తున్నది. ఇటువంటి పరిస్థితుల్లో తెలంగాణ సమాజం అప్రమత్తంగా ఉండి తన చైతన్యాన్ని చాటాల్సిన అనివార్యతలు నెలకొన్నాయని సామాజికవేత్తలు హెచ్చరిస్తున్నారు. ‘మన వేలుతో మన కన్నునే పొడిచే’ రీతిలో ఢిల్లీ టక్కరితనాన్ని కాంగ్రెస్, బీజేపీలు ప్రదర్శించాయని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ‘సర్దుకుపోదాం.. వాళ్లూ మన వాళ్లే’ అని ఏమరపాటుగా ఉన్న కారణానికి ఆరు దశాబ్దాలపాటు మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చిందని గుర్తుచేస్తున్నారు.
Telangana | హైదరాబాద్, మే 12 (నమస్తే తెలంగాణ): పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్, బీజేపీలు తెలంగాణ శాశ్వత ప్రయోజనాలను కొల్లగొట్టేందుకు పోటీపడ్డాయే తప్ప తెలంగాణ ఆకాంక్షలకు పూచీ ఇవ్వలేకపోయాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి కీలకమైన సమయంలో తెలంగాణ సమాజం తెలివైన నిర్ణయం తీసుకోవాలని ఉద్భోదిస్తున్నారు. వ్యక్తిగత అంశాలను ముందుపెట్టి తెలంగాణ వ్యవస్థీకృత ఆత్మను ఆగం చేయొద్దని హితవు పలుకుతున్నారు. దాదాపు నెలరోజులుగా ఆ పార్టీల ప్రచారాంశాల్లో చోటుచేసుకున్న కీలకమైన అంశాలను లోతుగా విశ్లేషిస్తున్నారు. ఎన్నికల ప్రచారం సందర్భంగా పలు కీలక అంశాలు తెరమీదికి వచ్చా యి. ఆయా అంశాల తేనెతుట్టెను కదిలిస్తే అసలు పరిష్కరించే అవకాశమేలేనివిగా ఉన్నాయని భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.
రెండు జాతీయ పార్టీలు వాటిపై తమ వైఖరిని ప్రదర్శించకపోగా అవి ఇచ్చిపుచ్చుకునే ధోరణినే అవలంభించాయని, తెలంగాణ ప్రయోజనాల విషయంలో ఆ రెండు పార్టీల వైఖరి ఒక్కటేనని సామాజికవేత్తలు స్పష్టంచేస్తున్నారు. ఈ క్లిష్ట సమయంలో కాంగ్రెస్, బీజేపీలకు చెక్‌పెట్టకపోతే తెలంగాణలో జరిగే పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయో వారు వివరిస్తున్నారు. తెలంగాణ రాష్ర్టానికి గుండెకాయ హైదరాబాద్. అది కేవలం రాష్ట్ర రాజధాని మాత్రమే కాదు- ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక వైభవానికి ప్రతీక. తెలంగాణ ఆర్థిక జీవగడ్డ. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కొలిక్కి వస్తున్న దశలో హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా చేసేందుకు జరిగిన బలమైన కుట్రలను తెలంగాణ సమాజం తిప్పికొట్టింది. హైదరాబాద్ లేని తెలంగాణ.. తలలేని మొండెంతో సమానమని తెలంగాణ తిరుగుబాటు చేసిన విష యం తెలిసిందే. ఏపీ పునర్వ్యవస్థీకరణ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం తెలిపిన తరువాత రెండుసార్లు లోక్‌సభకు ఎన్నికలు జరిగాయి. అప్పుడెప్పుడూలేని వాదన ఈసారి ఎందుకు వచ్చింది? దీనిని తెరపైకి తెచ్చింది ఎవరు? దాని వెనుక ఉన్న మతలబు ఏమిటి? వంటి అంశాలను అర్థం చేసుకొని తెలివైన నిర్ణయం తీసుకోవాలి.
రెండో రాజధాని: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఇష్టంలేని వాళ్లు రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ హైదరాబాద్‌ను దేశానికి రెండో రాజధాని చేయాలని సూచించారని గుర్తుచేస్తూ అనేక రకాల సూత్రీకరణలు చేశారు. ఆ మహనీయు డు రెండో రాజధాని అని ఎందుకు సిఫారసు చేశారు? నాడున్న భౌగోళిక, రాజకీయ పరిస్థితులను రెండో రాజధానికి సహేతుకమైన వివరణలు ఇచ్చి ఆ వాదన ప్రస్తుతం ఉన్న పరిస్థితులకు సరైంది కాదని తిప్పికొట్టారు. అయినా, పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో హైదరాబాద్‌ను రెండో రాజధానిగా తెరపైకి ఎందుకు తెచ్చారు? దీని వెనుక ఉన్న శక్తులకు సహకరిస్తున్నది ఎవరో తెలుసుకోకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది.
మెడపై వేలాడుతున్న ఉమ్మడి రాజధాని కత్తి: 1953లో తమిళనాడు నుంచి వేరుపడ్డ ఆంధ్ర రాష్ర్టానికి కర్నూలులో రాజధాని, గుంటూరులో హైకోర్టు ఉండేవి. రాజధాని సౌకర్యం లేక నానా అవస్థలు పడిన ఆంధ్రరాష్ట్రం కన్ను హైదరాబాద్ మీద పడింది. 1948 నుంచి 1956 వరకు ఉన్న హైదరాబాద్ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌గా మారడం, ఉమ్మడి రాష్ర్టానికి హైదరాబాద్ రాజధానిగా దాదాపు ఆరు దశాబ్దాలు కొనసాగిన విషయం తెలిసిందే. 2014లో తెలంగాణ రాష్ట్రంగా ఆవిర్భవించే సందర్భంలో హైదరాబాద్ పదేండ్లపాటు ఉమ్మడి రాజధానిగా ఉంటుందని సాక్షాత్తు విభజన చట్టంలోనే పొందుపరిచారు. అయితే, విభజన చట్టంలో పేర్కొన్న కాజీపేట కోచ్‌ఫ్యాక్టరీ, ఐఐఎం, బయ్యారం ఉక్కు కర్మాగారం, గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు, ఎయిమ్స్, ఐఐఎం, ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు సహా అనేక అంశాలపై కేంద్రం తెలంగాణకు చట్టబద్ధ పూచీ ఇచ్చినా వాటిని నెరవేర్చలేదు. 2024 జూన్ 2తో పదేండ్ల ఉమ్మడి రాజధాని గడువు ముగుస్తున్నది. అయితే, ఆంధ్రప్రదేశ్‌లో పదేండ్ల కాలం పూర్తి అవుతున్నా.. అక్కడ రెండు ప్రభుత్వాలు ఏర్పడినా రాజధాని నిర్మించుకోని కారణంగా కేంద్రంలో బీజేపీ లేదా కాంగ్రెస్ సారథ్యంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైతే హైదరాబాద్ ఉమ్మడి రాజధాని గడువును పెంచే ప్రమాదం పొంచి ఉన్నది. ఇటువంటి తరుణంలో తెలంగాణ తెలివైన నిర్ణయం తీసుకోవాలి.
ఇచ్చంపల్లి కుట్ర: గోదావరి జలాలను తమిళనాడుకు తరలించే కుట్రకు రెండు పార్టీలు తెరలేపాయి. గోదావరి నదిపై ఇచ్చంపల్లి దగ్గర ప్రాజెక్టు నిర్మించి తరలిస్తామని బీజేపీ బాహాటంగా ప్రచారం చేసింది. బీజేపీ వాదనకు రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ స్పందించలేదు. కేంద్రంలో పదేండ్లు అధికారాన్ని చెలాయించిన బీజేపీ గోదావరి, కృష్ణానదీ జలాల వాటా తేల్చడంలో పదేండ్లు అంటీముట్టన్నట్టు వ్యవహరించింది. కాంగ్రెస్ దానికి వంత పాడినట్టుగా వ్యవహరించిందే తప్ప ఏనాడూ వాటా తేల్చాలని కోరలేదు. పైగా ఇటీవలే రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కృష్ణానది జలాలను కేఆర్ఎంబీకి అప్పగించింది. చివరికి అసెంబ్లీ సాక్షిగా ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవడానికి ఉద్దేశించిన తీర్మానం చేసింది. ఇటువంటి వాతావరణంలో తెలంగాణ తలరాత నీటిమీద రాత కావద్దు.
స్వీయ రాజకీయ అస్తిత్వం: ‘మట్టిపనికైనా ఇంటివాడే కావాలి’ అన్నట్టుగా తెలంగాణ ప్రయోజనాల పరిరక్షణ ఢిల్లీ కేంద్రంగా రాజకీయాలు నడిపే పార్టీలకు ఉండదని చరిత్ర నిరూపించిన సత్యం. అరవై ఏండ్లగోసను తీర్చి పదేండ్లు పసిడిరాసులు కురిసిన పల్లెలు ఇవ్వాళ ఎందుకు బెంగటిల్లాయి? తెలంగాణకు ముల్లు గుచ్చుకుంటే పంటితో తీసే పనిమంతుడు కావాలి కానీ, పారిపోయేవాళ్లు కాదనే విషయాన్ని గ్రహించాలి.
ఆగని పగ.. అదే విషం: తల్లిని చంపి బిడ్డను బతికించారని, తలుపులు మూసి అప్రజాస్వామికంగా రాష్ర్టాన్ని ఏర్పాటు చేశారని పార్లమెంట్ సాక్షిగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావాన్ని, అమరవీరుల త్యాగాలను, ప్రజల ఆకాంక్షలను అవమానించింది బీజేపీ. ఆయా సందర్భాల్లో అదే పార్లమెంట్లో ఉన్న కాంగ్రెస్ మౌన ప్రేక్షకపాత్ర పోషించింది. ఆరు దశాబ్దాల తెలంగాణ పోరాటాన్ని, నాలుగున్నర కోట్ల ప్రజల తెలంగాణ ఆత్మగౌరవాన్ని అవహేళన చేసిన సన్నివేశాలు గుర్తుచేసుకొని తెలివైన నిర్ణయం తీసుకోవాల్సిన సమయం ఇదే.
జిల్లాల పునర్విభజన: జిల్లాల పునర్విభజనతో గడప గడపకూ సర్కారు ఫలాలు అందుతున్నాయి. ‘చిన్నకుటుంబం చింతల్లేని కుటుంబం’ అన్నట్టుగా భౌగోళికంగా చిన్న జిల్లాలు ఉండటం వల్ల పర్యవేక్షణ పెరిగి ప్రజలకు తక్షణ ప్రయోజనం కలిగింది. తద్వారా ప్రజల జీవన ప్రమాణాల్లో గణనీయమైన మార్పులు వచ్చాయి. రెవెన్యూ డివిజన్ల సంఖ్య పెంపు, నూతన మండలాల ఏర్పాటుతో సంక్షేమ పథకాల అమలు కాలంతోపాటు పోటీ పడింది నిజమా? అబద్ధమా? బేరీజు వేసి నిర్ణయం తీసుకోవాలి.
దశాబ్దాలుగా దగాపడిన రైతును ఒకదరికి తెచ్చేందుకు సాహసోపేతంగా ప్రారంభమైనదే రైతుబంధు. తన కాళ్ల మీద తాను నిలబడేదాకా రైతుకు సర్కారే అండగా ఉండాలన్న ఆకాంక్షతో కేసీఆర్ ప్రవేశపెట్టిన సీలింగ్లేని రైతుబంధు పథకం ఇంతాకలం విజయవంతంగా అమలైంది. వ్యవసాయరంగంలో విప్లవాత్మక చర్యగా రైతుబంధును ప్రపంచం కీర్తించింది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో మూలస్థంభంగా ఉండే రైతును ఆదుకునే మానవీయ కార్యక్రమంగా రైతుబంధును ఐక్యరాజ్యసమితి అభివర్ణించింది. ఎన్నికల ప్రచారం సందర్భంగా వెలువడిన ప్రకటనలు రైతుబంధును ప్రశ్నార్థం చేస్తున్నాయి. 5 ఎకరాల రైతులకే రైతుబంధు అమలు చేస్తామనే తీరుకు తేరుకొని సమాధానం చెప్పాల్సిన తరుణం ఇదే.