హైదరాబాద్, జనవరి 4 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడిగా నియమితులైన తోట చంద్రశేఖర్ ప్రగతిభవన్‌లో పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌తో బుధవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఏపీలో పార్టీ పటిష్టత తదితర అంశాలపై చర్చించారు. తనను ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడిగా నియమించినందుకు మరోసారి కేసీఆర్‌కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. సమావేశంలో బీఆర్ఎస్ ఏపీ నేత చింతల పార్థసారథి తదితరులు పాల్గొన్నారు.
సీఎం కేసీఆర్‌కు పలువురి శుభాకాంక్షలు
ప్రగతిభవన్‌కు బుధవారం ప్రజాప్రతినిధులు క్యూ కట్టారు. సీఎం కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. సీఎంను కలిసినవారిలో ఎమ్మెల్సీలు బస్వరాజు సారయ్య, తాతా మధు, శంభీపూర్ రాజు, ఎమ్మెల్యేలు జోగు రామన్న, చంటి క్రాంతికిరణ్, రాములునాయక్, సండ్ర వెంకటవీరయ్య, వరంగల్ మేయర్ గుండు సుధారాణి, సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్ తదితరులు ఉన్నారు. తమ జన్మదినం సందర్భంగా ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, జూలూరు గౌరీశంకర్ సీఎం కేసీఆర్ ఆశీస్సులు తీసుకున్నారు. జూలూరు రాసిన ‘ఈ సమరం సామరస్యం కోసం’ పుస్తకాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆవిష్కరించారు.