హైదరాబాద్, జూలై 19 (నమస్తే తెలంగాణ): పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ అనుసరిస్తున్న బీసీ వ్యతిరేక వైఖరిపై ఆ వర్గాలు గర్జిస్తున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ అమలుచేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలతో ప్రేరణ పొంది ప్రగతిపథంలో పయనిస్తున్న బీసీ వర్గాలను బీఆర్ఎస్కు దూరం చేయాలనే రాజకీయ దుర్బుద్ధితో కాంగ్రెస్ పన్నుతున్న కపట నాటకంలో భాగంగా రేవంత్‌రెడ్డి ఇటీవలి కాలంలో బీసీలపై అక్కసును వెళ్లగక్కుతున్నారని బీసీ వర్గాలు మండిపడుతున్నాయి. బీఆర్ఎస్ నుంచి బీసీలను దూరం చేయాలనే రేవంత్‌రెడ్డి కుట్రను ఛేదించేందుకు బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు సమరశంఖం పూరించారు. వివిధ బీసీ సామాజిక వర్గాలకు చెందిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు సమావేశమై కాంగ్రెస్ పార్టీకి అల్టిమేటం జారీ చేశారు. సందర్భం వచ్చిన ప్రతిసారీ రేవంత్ చేస్తున్న బీసీ వ్యతిరేక వ్యాఖ్యలను ఆ పార్టీలోని బీసీ నేతలు సమర్థిస్తారా? విభేదిస్తారా? తేల్చుకోవాలని సవాల్ విసిరారు. మరోవైపు రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా పలు బీసీ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కాంగ్రెస్ తీరు మార్చుకోవాలని గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు వెనుబడిన కులాలు హెచ్చరిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి హోదాలో రేవంత్‌రెడ్డి చేస్తున్న బీసీ వ్యతిరేక వైఖరిని పార్టీ విధానంగానే పరిగణించాల్సి ఉంటుందని స్పష్టంచేస్తున్నాయి. రేవంత్ చేస్తున్న బీసీ వ్యతిరేక వ్యాఖ్యలు, బీసీలను అవమానిస్తున్న వైఖరి సరైంది కాదని కాంగ్రెస్‌లోని బీసీ నేతలు సూచించడమో, మందలించడమో ఇప్పటికే జరగాలని, అలా జరగడం లేదంటే ఇది కాంగ్రెస్ పార్టీ వైఖరి కాక మరేమి అవుతుందని సదరు బీసీ నేతలు ప్రశ్నిస్తున్నారు.
త్వరలో కార్యాచరణ
కాంగ్రెస్ అనుసరిస్తున్న బీసీ వ్యతిరేక వైఖరికి నిరసనగా గ్రామ, మండల, నియోజకవర్గ, రాష్ట్రస్థాయిలో విస్తృత కార్యాచరణకు రంగం సిద్ధం అవుతున్నట్టు జరుగుతున్న పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. రాష్ట్రంలోని బీసీ సంఘాల మేధావులు, సామాజికవేత్తలు, వివిధ కుల సంఘాల బాధ్యులు రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ పార్టీ బీసీ వ్యతిరేక వైఖరికి నిరసన కార్యక్రమాలు చేపడతామని బీఆర్ఎస్పై ఒత్తిడి తెస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో బుధవారం పలువురు మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు సమావేశమయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా బీసీ సంఘాల నుంచి వస్తున్న అభిప్రాయాలపై చర్చించారు. సమావేశం అనంతరం త్వరలో తమ కార్యాచరణ ప్రకటిస్తామనీ వెల్లడించారు. తమ అభిప్రాయాలకు అనుగుణంగా అధికారంలో ఉన్నప్పటికీ మంత్రులు, ప్రజాప్రతినిధులు బీసీల ఆత్మగౌరవం కోసం ముందుకు వచ్చారని బీసీ సంఘాల నేతలు హర్షాతిరేకాలు వ్యక్తంచేశారు. మండలస్థాయి నుంచి రాష్ట్రస్థాయి దాకా కాంగ్రెస్ పార్టీ బీసీ వ్యతిరేక విధానాలను ఎండగడుతూ సదస్సులు నిర్వహిస్తామని, ఇందుకు వివిధ పార్టీల్లో ఉన్న బీసీ నేతలు సహకరించాలని బీసీ సంఘాలు విజ్ఞప్తి చేస్తున్నాయి. మొత్తంగా కాంగ్రెస్ వైఖరిపై బీసీ వర్గాలు సమరశంఖం పూరించాయని జరుగుతున్న పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి.