హైదరాబాద్, ఏప్రిల్ 29 (నమస్తే తెలంగాణ): ప్రస్తుత నీటి సంవత్సరం మరో 30 రోజుల్లో ముగియనున్నది. ఈ ఏడాది కృష్ణా నది నుంచి 75% జలాలను ఏపీ తరలించుకుపోయింది. అయినప్పటికీ రేవంత్ సర్కార్ కండ్లుమూసుకునే ఉన్నది. కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) మీటింగ్ పెట్టాలని డిమాండ్ చేయలేదు. తాజాగా బోర్డే సమావేశాన్ని ఏర్పాటు చేసినప్పటికీ తాము హాజరు కాలేమని కాంగ్రెస్ ప్రభుత్వం స్పష్టంచేసింది. సమావేశాన్ని వాయిదా వేయాలని విజ్ఞప్తి చేసింది. తెలంగాణ సర్కార్ కోరిందే తడువుగా ఆ సమావేశాన్ని వాయిదా వేసిన బోర్డు.. తదుపరి సమావేశ తేదీని సైతం ప్రకటించలేదు. ప్రతి నీటి సంవత్సరం అంటే జూన్ 1 నుంచి మే 31 వరకు ఉమ్మడి రిజర్వాయర్లలో నీటి నిల్వలను ఏ రాష్ట్రం ఏ మేరకు వినియోగించుకోవాలనేది త్రిసభ్య కమిటీ నిర్ణయిస్తుంది.
బోర్డు సభ్య కార్యదర్శి, ఇరు రాష్ర్టాల ఈఎన్సీ లతో కూడిన ఈ కమిటీ ఏటా సీజన్లవారీగా ఎప్పటికప్పుడు సమావేశాలను ఏర్పాటు చే యాల్సి ఉంటుంది. రాష్ర్టాల డిమాండ్లను, అందుబాటులో ఉన్న నీటినిల్వలను పరిగణనలోకి తీసుకొని ఇరు రాష్ర్టాలకు నీటి వాటాల ను కేటాయించాల్సి ఉంటుంది. ప్రాజెక్టుల ఔట్లెట్ల నుంచి నిర్ణీత సమయంలో నీటిని విడుదల చేస్తూ బోర్డు ఆర్డర్ జారీచేస్తుంది. కానీ, ప్రస్తుత నీటి సంవత్సరంలో ఇప్పటివరకు త్రిసభ్య కమిటీ సమావేశం జరగలేదు. ఈ భేటీ నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం సైతం పట్టుబట్టలేదు. ఫలితంగా ఎలాంటి ఇండెంట్లు, త్రిసభ్య కమిటీ నిర్ణయాలు, నీటి విడుదల ఆర్డర్లు లేకుండానే ఏపీ ప్రభుత్వం యథేచ్ఛగా కృష్ణా జలాలను మళ్లించుకుపోయింది. ఇప్పటికీ తరలిస్తూనే ఉన్నది. అయినప్పటికీ ఏపీని నిలువరించాలంటూ తెలంగాణ సర్కార్ కంటితుడుపుగా కేఆర్ఎంబీకి లేఖ రాయడం తప్ప చేస్తున్నదేమీలేదు.
సమావేశానికి రాలేమన్న తెలంగాణ
జనవరిలో బోర్డు సమావేశాన్ని నిర్వహిస్తామని, సంబంధించిన ఎజెండా పంపాలని కేఆర్ఎంబీ ఇరు రాష్ర్టాలను కోరింది. కానీ, అది కార్యరూపం దాల్చలేదు. ఏపీ కనీసం ఎజెండాను కూడా పంపకపోవడంతో బోర్డు సమావేశం జరుగలేదు. ప్రస్తుత నీటి సంవత్సరం నెల రోజుల్లో ముగియనున్న తరుణంలో బోర్డు సమావేశాన్ని నిర్వహించేందుకు కేఆర్ఎంబీ ముందుకొచ్చింది. అది కూడా ఏపీ ప్రభుత్వం తన ఎజెండాను పంపి, సమావేశాన్ని ఏర్పాటు చేయాలని కోరిందే తడవుగా బోర్డు రంగంలోకి దిగింది. ఈ నెల 30న బోర్డు 21వ సమావేశాన్ని నిర్వహించనున్నట్టు పది రోజుల క్రితమే ప్రకటించింది. కానీ, ముందస్తు కార్యక్రమాలు ఉన్నందు వల్ల ఈ భేటీకి హాజరు కాలేమని రేవంత్సర్కార్ పే ర్కొంటూ.. సమావేశాన్ని వాయిదా వేయాలని బోర్డుకు లేఖ రాసింది. ఇదే అదనుగా ఆ సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్టు ప్రకటించిన కేఆర్ఎంబీ.. తదుపరి సమావేశ తేదీని త్వరలోనే ప్రకటిస్తామని తెలిపింది.
ఏపీకి వంతపాడుతున్న రేవంత్ సర్కార్
ఈ ఏడాది సాగర్, శ్రీశైలం ఉమ్మడి రిజర్వాయర్ల నుంచి ఏపీ రికార్డు స్థాయిలో కృష్ణా జలాలను మళ్లించుకుపోయింది. ఒక్క పోతిరెడ్డిపాడు నుంచే 220 టీఎంసీలను మళ్లించింది. రేవంత్ ప్రభుత్వం ఉదాసీనత మూలంగా కేఆర్ఎంబీ సైతం పట్టించుకున్న పాపాన పోలేదు. శ్రీశైలం రిజర్వాయర్ ఫోర్‌షోర్ నుంచి ఏపీకి చెందిన పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ (పీఆర్పీ), తెలుగుగంగ ప్రాజెక్టు (టీజీపీ), ఎస్ఆర్బీసీ (శ్రీశైలం రైట్ బ్రాంచ్ కెనాల్), మల్యా ల, ముచ్చమర్రి లిఫ్ట్‌లు ఉన్నాయి. వాటిలో టీజీపీకి 15 టీఎంసీలు, ఎస్ఆర్బీసీకి 19 టీఎంసీలు కలిపి 34 టీఎంసీల నీటి కేటాయింపులు మాత్రమే ఉన్నాయి. అందుకు విరుద్ధంగా గతంలో ఎన్నడూ లేనివిధంగా ఏపీ ఇప్పటికే ఒక్క పోతిరెడ్డిపాడు ద్వారానే 220 టీఎంసీలకుపైగా జలాలను పెన్నా బేసిన్‌కు మళ్లించింది. అవికాకుండా మల్యాల, ముచ్చుమర్రి లిఫ్ట్‌ల ద్వారా మరో 40 టీఎంసీల జలాలను ఏపీ కొల్లగొట్టింది.
దిగువన నాగార్జునసాగర్ వద్ద కూడా కుడికాలువ, పంప్‌హౌస్ ద్వారా కూడా కృష్ణా జలాలను ఏపీ నిరంతరాయంగా తరలిస్తూనే ఉన్నది. అలా ఈ ఏడాది ఇప్పటివరకు 680 టీఎంసీలకుపైగా కృష్ణా జలాలను వినియోగించుకున్నది. నిర్దేశిత తాత్కాలిక వాటా 66 శాతమే కాగా.. అంతకు మించి 75% మేర జలాలను మళ్లించినట్టు అధికారిక గణాంకాలు తేటతెల్లం చేస్తున్నాయి. తెలంగాణ తన తాత్కాలిక వాటా కింద 34% జలాలను కూడా వినియోగించుకోలేని దుస్థితి నెలకొన్నది. ఇప్పటివరకు కనీసం 21% జలాలను కూడా వినియోగించుకోలేదు. శ్రీశైలం, సాగర్ రిజర్వాయర్లలో ప్రస్తుతం అంతంతమాత్రంగా ఉన్న నీటినిల్వలన్నీ తమకే కావాలని ఏపీ డిమాండ్ చేస్తున్నది. ఇంతకాలం చోద్యం చూస్తూ వచ్చిన బోర్డు సైతం ఇప్పుడు ఏపీ ప్రతిపాదనలు పెట్టగానే హడావుడిగా స్పందించింది. బోర్డు మీ టింగ్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించినప్పటికీ ఆ సమావేశాన్ని వాయిదా వేయాలని తెలంగాణ కోరడంతో ఏపీకి రేవంత్సర్కార్ ఎంతగా వంత పాడుతున్నదో తేలిపోతున్నది. పూర్తిస్థాయిలో నీటిని వినియోగించుకోవడంపై దృష్టి పెట్టికుండా చోద్యం చూస్తున్నది.