హైదరాబాద్, ఆగస్టు 20 (నమస్తే తెలంగాణ): లాగులు నడుముపై నిలువవు.. అంగీలేమో పట్టవు.. కుట్లు ఉండవు.. కాలు, చేతులు చాపితే చిరిగిపోతున్నాయి.. ప్రభుత్వం విద్యార్థులకు అందజేసిన యూనిఫామ్ దుస్థితి ఇదీ. నాణ్యతకు తిలోదకాలివ్వడంతోపాటు, కొలతల్లేకుండానే విద్యార్థులకు సప్లయ్ చేశారు. పీటీ, నైట్ డ్రెస్ జాడేలేకుండా పోయింది. ప్రభుత్వం కమీషన్ల కక్కుర్తి ఫలితంగా గతంలో ఎన్నడూ లేనివిధంగా యూనిఫామ్‌లు నాసిరకంగా వచ్చాయని తల్లిదండ్రులు, ఉపాధ్యాయవర్గాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, జనరల్ గురుకులాలతోపాటు, సంక్షేమ హాస్టళ్లు, కస్తూర్బా విద్యాలయాలు, గిరిజన ఆశ్రమ పాఠశాలలు, మోడల్ స్కూల్స్, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ప్రతి సంవత్సరం రెండు జతల యూనిఫామ్స్, గురుకుల విద్యార్థులకు అదనంగా పీటీ, నైట్ డ్రెస్సులను పంపిణీ చేస్తుంటారు.
ఈ ఏడాది బాలురకు 75,28,053.26 మీటర్లు, బాలికలకు 1,39,58,119.53 మీటర్ల క్లాత్ అవసరమని నిర్ధారించి కేంద్రీకృత టెండర్లు నిర్వహించి గుజరాత్‌కు చెందిన ఓ కంపెనీకి కట్టబెట్టారు. 45 రోజుల్లో పూర్తి మెటీరియల్ సప్లయ్ చేయాల్సి ఉండగా, ఇప్పటికీ సగం క్లాత్‌ను కూడా సప్లయ్ చేయలేదు. రెండు జతలకు ఒక్క జతే ఇచ్చారు. విద్యార్థులకు సరఫరా చేసిన యూనిఫామ్స్ క్లాత్ ఫ్యాబ్రిక్ అత్యంత పలుచగా ఉన్నది. పిల్లలు ఆటలాడితే చిరిగిపోతున్నది. యూనిఫామ్స్‌కు కుట్లు సరిగా లేక నెల తిరిగేసరికే భుజాల దగ్గర ఊడిపోతున్న పరిస్థితి. ప్రస్తుతం పాఠశాలలు ప్రారంభమై రెండునెలలు దాటిపోయింది. కానీ ఇప్పటివరకు కనీసం 50శాతం మంది విద్యార్థులకు సైతం యూనిఫామ్స్ అందలేదు. గతంలో ఎన్నడూ ఇంతటి అధ్వానమైన యూనిఫామ్స్‌ను చూడలేదని ఉపాధ్యాయులు మండిపడుతున్నారు. పూర్తిగా నాణ్య త లేదని చెప్తున్నారు.
రూ. కోట్లలో గోల్మాల్?
ప్రతిఏటా విద్యార్థులకు పుస్తకాలు, యూనిఫామ్స్, స్టేషనరీ, దుప్పట్లు, బూట్లు, సాక్సులు ప్రభుత్వమే అందిస్తుంది. గతంలో ఏ గురుకుల విద్యాసంస్థకు సంబంధించి ఆ విద్యాసంస్థనే సొంతంగా జిల్లా స్థాయిలో కలెక్టర్ల ద్వారా టెండర్లు నిర్వహించి కొనుగోలు చేసేవి. ఇప్పటివరకు అదే పద్ధతి పాటించారు. ఈ ఏడాది కాంగ్రెస్ ఆ విధానానికి స్వస్తి పలికింది. సోషల్వెల్ఫేర్ సెక్రటరీ నేతృత్వంలో అన్ని గురుకుల సొసైటీల కార్యదర్శులతో ప్రాజెక్టు మానిటరింగ్ యూనిట్ (పీఎంయూ) ఏర్పాటు చేసింది.
విద్యార్థులకు సంబంధించిన అన్ని వస్తువుల సరఫరా, సేకరణ, ధరల ఖరారు, టెండర్ ప్రక్రియను అప్పగించింది. టెండర్ కండీషన్లను జాతీయ బడా కంపెనీలకే దక్కేవిధంగా రూపొందించింది. 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి 9 ఐటమ్స్‌కు టెండర్లను పూర్తి చేసింది. రూ. 1200 కోట్ల వర్క్ ఆర్డర్లో గోల్మాల్ జరిగిందని ఆరోపణలున్నాయి. యూనిఫామ్స్ క్లాత్ టెండర్‌ను రూ. 300 కోట్లకు, పీటీ, నైట్ డ్రెస్, ట్రాక్‌సూట్ టెండర్‌ను రూ. 196 కోట్లకు గుజరాత్‌కు చెందిన ఒక కంపెనీ దక్కించుకున్నది. ప్రస్తుతం విద్యార్థులకు సరఫరా చేసిన యూనిఫామ్స్ చూస్తుంటే కమీషన్ల కక్కుర్తి ఫలితంగానే నాణ్యత లోపించిందని తేటతెల్లమవుతున్నది. ప్రభుత్వం ఇకనైనా స్పందించాలని విద్యార్థి, ఉపాధ్యాయ సంఘాలు, తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.
ఇష్టారీతిన కొలతలతో..
గతంలో పాఠశాలలకు క్లాత్‌ను ఇవ్వడంతోపాటు, ప్రత్యేకంగా ప్రతి విద్యార్థి కొలతలనూ తీసుకునేవారు. ఆ ప్రకారమే విద్యార్థులకు యూనిఫామ్స్ స్థానికంగానే కుట్టి అందించేవారు. సాధారణ టైలర్ వద్ద కుట్టించుకున్న తరహాలోనే విద్యార్థులకు తగినవిధంగా అవి సరిపోయేవి. కానీ ఈ ఏడాది అందుకు భిన్నంగా యూనిఫామ్స్ సప్లయ్ చేశారు. టెండర్‌ను దక్కించుకున్న ఏజెన్సీలు క్లాత్‌ను సప్లయ్ చేయగా, ఎస్‌హెచ్‌జీ గ్రూపులకు వాటిని అందజేశారు.
వారు కొలతలు తీసుకోకుండా, రెడీమేడ్ షాపుల తరహాలో అనామతు కొలతలతో యూనిఫామ్స్‌ను కుట్టి సప్లయ్ చేశారు. లార్జ్, ఎక్స్ట్రా లార్జ్, స్మాల్, మీడియం కేటగిరీలవారీగా సప్లయ్ చేయగా, వాటినే విద్యార్థులకు అందించారు. అయితే ఏజెన్సీలు సప్లయ్ చేసిన సైజులు ప్రస్తుతం ఏ ఒక్క విద్యార్థికీ సరిపోని దుస్థితి నెలకొన్నది. చిన్న పిల్లాడికి పెద్ద సైజులు, పెద్ద పిల్లాడికి చిన్న సైజులు ఇచ్చారు. అదీగాక కుట్లు సైతం సవ్యంగా వేయలేదు. కొందరికి బిగుతుగా, మరికొందరికి పూర్తిగా వదులుగా, లాగులు పొట్టిగా, అంగీలు పొడవుగా ఇలా ఒక పద్ధతి అంటూ లేకుండా పోయింది. యూనిఫామ్స్‌ను మార్చి వేరొకటి ఇవ్వాలని విద్యార్థులు, తల్లిదండ్రులు కోరుతున్నా ఇవ్వడం లేదు.