ముంబై: మహారాష్ట్రలోని కొల్హాపూర్‌కు చెందిన మహాదేవి ఏనుగు.. కొన్నాళ్లు గుజరాత్‌లోని వంతారా(Vantara)లో చికిత్స పొందింది. అయితే ఆ సంరక్షణ కేంద్రంలో ఆ ఏనుగును మాధురిగా పిలిచేవారు. ఇప్పుడు సుప్రీంకోర్టు ఆదేశాలతో ఆ వన్యప్రాణిని మళ్లీ తన స్వంత ప్రదేశానికి పంపించారు. బాంబే హైకోర్టు, సుప్రీంకోర్టు, హెచ్పీసీ ఆదేశాల ప్రకారం 2025 జూలై 30న జామ్‌నగర్‌లో ఉన్న వంతార కేంద్రానికి మహాదేవి ఏనుగుని తీసుకువచ్చారు. ఇక అక్కడ వంతారా బృందం.. మాధురికి సేవలు చేశారు. దాని ఆరోగ్యం కుదుటపడేలా చర్యలు తీసుకున్నారు. కోల్హాపూర్‌లో మాధురి ఏనుగు పట్ల స్థానికల్లో ఉన్న ప్రేమను గుర్తిస్తామని, అయితే మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు తర్వాత.. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఆ ఏనుగును మళ్లీ కోల్హాపూర్‌కు పంపిస్తున్నట్లు వంతారా పేర్కొన్నది.
కొల్హాపూర్‌లోని నందనిలో ఉన్న జంతు సంరక్షణ కేంద్రాన్ని విజిట్ చేసిన వంతార బృందం అక్కడ మాధురికి తగిన ఏర్పాట్లను చేసింది. కానీ ఊరేగింపులకు మాధురిని వాడరాదన్న నిబంధనతో దాన్ని అప్పగించేందుకు అంగీకరించారు. ప్రతి 15 రోజులకు ఒకసారి మాధురి వైద్య పరీక్షలు చేయించాలని వంతార షరతు పెట్టింది. చాలా వరకు అస్వస్థత తగ్గినా.. మాధురికి కొన్ని దీర్ఘకాలిక సమస్యలు ఉన్నాయని, వాటి కోసం పశువైద్యుల అవసరం ఉంటుందని వంతార తెలిపింది.
మాధురిని కొల్హాపూర్‌కు పంపడంతోనే తమ బాధ్యత తీరిపోలేదని, అక్కడికి తమ పశువైద్యులు వెళ్లి ఆ ఏనుగు బాగోగులు చూసుకుంటారని వంతార పేర్కొన్నది. నందినిలో ఏర్పాటు చేసిన ఎన్‌క్లోజర్ వర్క్‌ను వంతార సమీక్షించింది. బాధ్యతాయుతమైన జంతువుల సంరక్షణ అవసరమని ఈ సందర్భంగా వంతార ఓ ప్రకటనలో తెలిపింది. మాధురి తరలింపుపై సుప్రీంకోర్టు, బాంబే హైకోర్టు, హెచ్పీసీ ఇచ్చిన ఆదేశాలను మర్యాదపూర్వకంగా ఆహ్వానిస్తున్నట్లు వంతార పేర్కొన్నది. మాధురి ఎక్కడ ఉన్నా.. దాని ఆరోగ్యం, సంక్షేమం తమకు ముఖ్యమని వంతార స్పష్టం చేసింది.