Harish rao | కేసీఆర్ ప్రజల గురించి ఆలోచిస్తే సీఎం రేవంత్ రెడ్డి భూముల గురించి ఆలోచిస్తున్నాడని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు ఆరోపించారు. శుక్రవారం ఆయన తెలంగాణ భవన్లో 22A నిషేదిత జాబితా స్కాంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. రాష్ట్రంలో నేడు 22ఏ భూముల గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నది. సీఎం రేవంత్ భూముల చుట్టూ తిరుగుతున్నాడు. రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీనివాస్ రెడ్డి పొంగులేటి రియల్ ఎస్టేట్ వ్యాపారులుగా మారారని విమర్శించారు.
ఒక్క కలం పోటుతో ఊళ్లకు ఊళ్లను 22ఏలో పెట్టిస్తున్నారు. గ్రామాలకు గ్రామాలను 22ఏలో పెట్టడమేంటని ప్రశ్నించారు. భూమి ప్రజల ఆస్తి, వారి హక్కు అనే విషయాన్ని మర్చిపోవదన్నారు. ఈ ప్రభుత్వం భూమిని మార్కెట్ వస్తువులా చూస్తున్నది. నిన్నటి వరకు హైడ్రా, నేడు 22ఏ పేరుతో ప్రజలతో చెలగాటమా డుతున్నారు. ప్రభుత్వమే ప్రజలకు భరోసా లేకుండా చేస్తే ఎలా అని ప్రశ్నించారు. ఇక ప్రజలు తమ సమస్యలను ఎవరికి చెప్పుకోవాలని నిలదీశారు. కాంగ్రెస్ ప్రభుత్వం హెచ్సీయూ భూములను బాంబే స్టాక్ఎక్సేంజ్లో కుదువపెట్టి 10 వేలే కోట్ల అప్పు తీసుకొచ్చారు. రేవంత్ ఏం చేసినా దానికి వెనుక భూములను కాజేసే కుట్ర ఉంటుందని ఆరోపించారు. ఈ ప్రభుత్వాన్ని ప్రజలే 30 పర్సంటేజ్ ప్రభుత్వం అంటున్నారని గుర్తు చేశారు.
మేము సెంటు భూమి కూడా 22ఏ లిస్టులో పెట్టలేదని, గత బీఆర్ఎస్ ప్రభుత్వమే పెట్టిందని మంత్రి పొంగులేటి అంటున్నాడు. కానీ వివిధ జిల్లాల్లో పెద్ద ఎత్తున 22ఏ లిస్టులో పెడుతూ కలెక్టర్లకు లేఖలు రాసింది నిజం కాదా? అని ప్రశ్నించారు. వారు సీసీఎల్ ఆదేశాలతోనే ఇలా చేశామని చెప్తున్నారు. భూభారతిలో దేవాదాయ, వక్ఫ్ భూములు లేవు. పెట్టాల్సినవి పెట్టకుండా ప్రజల ఆస్తులను పెట్టారని విమర్శించారు.