నగోయా: భారత వెటరన్ షూటర్, హైదరాబాదీ కైనన్ చెనాయ్ ఆసియా గేమ్స్‌లో మళ్లీ మెరిశాడు. గత ఎడిషన్‌లో స్వర్ణం సహా రెండు పతకాలు గెలిచిన అతను ఈసారి పసిడి పతకంతో సత్తా చాటాడు. బుధవారం జరిగిన ట్రాప్ మిక్స్డ్ టీమ్ ఫైనల్లో నీరు దండాతో కలిసి స్వర్ణ పతకాన్ని కొల్లగొట్టింది. ఫైనల్లో భారత్ 40 లక్ష్యాలకు గానూ 34 పాయింట్లు సాధించి ఆసియా, ఆసియా గేమ్స్ రికార్డుతో పసిడిని కైవసం చేసుకుంది. మెగా గేమ్స్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో భారత్‌కు ఇదే తొలి స్వర్ణం కావడం విశేషం. హర్యానాలోని జింద్ ప్రాంతానికి చెందిన 26 ఏండ్ల నీరూ ఈ మెగా గేమ్స్‌లో మొత్తం మూడు పతకాలు నెగ్గి ఔరా అనిపించింది. అంతకుముందే మహిళల వ్యక్తిగత ట్రాప్‌లో స్వర్ణం గెలిచి, ఆసియాడ్ చరిత్రలోనే వ్యక్తిగత షాట్‌గన్ పసిడి నెగ్గిన భారత మహిళగా రికార్డు సృష్టించిన నీరూ టీమ్ ఈవెంట్లో వెండి పతకం సాధించింది.
తండ్రి 30 ఏండ్ల నాటి బారెల్‌తో
హైదరాబాద్‌లోని ఓ పార్శీ కుటుంబంలో కైనన్ షూటర్ తండ్రి డారియస్ చెనాయ్ ట్రాప్ షూటింగ్లో మాజీ జాతీయ చాంపియన్. స్కూల్ డేస్‌లో ఫుట్‌బాల్, హాకీ, స్విమ్మింగ్ ఆడిన కైనన్ తర్వాత తండ్రి ప్రేరణతో తుపాకీ పట్టాడు. భారత షూటింగ్ దిగ్గజం మాన్షెర్ సింగ్ వద్ద శిక్షణ పొంది తండ్రిని మించిన తనయుడిగా మారాడు. తండ్రి జాతీయ చాంపియన్‌గా ఆగిపోతే.. కైనన్ మాత్రం రియో ఒలింపిక్స్‌కు అర్హత సాధించడే కాకుండా ఆసియా చాంపియన్‌షిప్స్‌లో పతకాల మోత మోగించాడు. గత ఆసియాడ్‌లో రెండు పతకాలు నెగ్గిన అతను తాజా ఎడిషన్‌లో తన అనుభవాన్ని రంగరించాడు.
ఫైనల్ మ్యాచ్ తొలి రౌండ్లోనే కైనన్ ఒక షాట్, నీరూ మూడు షాట్లు మిస్ కావడంతో భారత్ తీవ్ర ఒత్తిడిలో పడింది. కానీ అపార అనుభవం ఉన్న చెనాయ్ ఏమాత్రం సహనం కోల్పోకుండా ఆ తర్వాత వరుసగా 19 లక్ష్యాలను పర్ఫెక్ట్గా కొట్టి జట్టును మ్యాచ్‌లోకి తీసుకొచ్చాడు. ఈ విజయం వెనుక ఒక ఆసక్తికరమైన కథ ఉంది.తన తండ్రి డారియస్ 30 ఏండ్ల క్రితం కొనుగోలు చేసిన గన్ బారెల్‌తో కైనాన్ ఈ పోటీల్లో పాల్గొన్నాడు. ‘మా నాన్నకు తెలిసే ఆయన 30 ఏళ్ల నాటి గన్ బారెల్ను తెచ్చుకున్నాను. అది నాకు లక్కీగా మారింది. ఇకపై దీన్ని తిరిగిఇచ్చే ప్రసక్తే లేదు’ అని కైనన్ సరదాగా వ్యాఖ్యానించాడు.