పెనుబల్లి, సెప్టెంబర్ 30 : ప్రభుత్వ పాఠశాలలో అల్పాహారం తిని ఆరుగురు విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటన ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం ఉప్పలచిలక యూపీఎస్‌లో బుధవారం చోటు చేసుకున్నది. వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాల విద్యార్థులకు ఓ సంస్థ సహకారంతో ప్రభుత్వం ప్రతిరోజూ అల్పాహా రం అందిస్తున్నది. మధిర నుంచి ఉదయం 8 గంటలకు అల్పాహారం రావాల్సి ఉండగా.. బుధవారం కాస్త ఆలస్యంగా ఉప్మా, చట్నీ తీసుకొచ్చారు.
అది తిన్న 4, 5, 7 తరగతులకు చెందిన ఆరుగురికి వాంతులు కావడంతో ఉపాధ్యాయులు వారిని పెనుబల్లి ప్రభుత్వ దవాఖానకు తరలించారు. అస్వస్థతకు గురైన వారిలో బొమ్మకంటి నవీన్, ఎనుముల మనోజ్‌కుమార్, చెక్కిలాల శివకేశవ, ఓరుగంటి నవీన్, ఎనయల స్రవంతిక, బొమ్మకంటి ఉదయశ్రీ ఉన్నారు. పాఠశాలకు వెళ్లిన విద్యార్థులు ఒక్కసారిగా అస్వస్థతకు గురికావడంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు.