2BHK houses | నిరుపేదల ఆత్మగౌరవానికి కేసీఆర్ కలల సౌధాలైన డబుల్ బెడ్రూం ఇండ్లే నిదర్శనమని మంత్రులు స్పష్టం చేశారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మూడో విడత డబుల్ ఇండ్ల పత్రాలను సోమవారం లబ్ధిదారులకు మంత్రులు, స్థానిక ఎమ్మెల్యేలు అందజేశారు. నగరంలోని పలు ప్రాంతాల్లో జరిగిన కార్యక్రమాల్లో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, చామకూర మల్లారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, పట్నం మహేందర్‌రెడ్డి, మహమూద్ అలీ, డిప్యూటీ స్పీకర్ పద్మారావుగౌడ్‌తోపాటు జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, స్థానిక ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 19,020 మంది లబ్ధిదారులకు ఇండ్ల పత్రాలను స్థానిక ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా అందజేశారు. జీహెచ్ఎంసీలో తొమ్మిది నియోజకవర్గాల పరిధిలో జరిగిన ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం పకడ్బందీగా నిర్వహించింది. గ్రేటర్లో నిర్మించిన లక్ష డబుల్ బెడ్రూం ఇండ్లను దశలవారీగా పంపిణీ చేస్తుండగా.. తొలి విడదల 11,700, రెండో విడతలో 13,200 ఇండ్లను లబ్ధిదారులకు అందజేశారు. మూడో విడతలో ఇండ్ల పత్రాలు అందుకున్న లబ్ధిదారులు ఆనందంతో ఉబ్బితబ్బిబయ్యారు.
విపక్షాల విమర్శలు పసలేనివి
కొల్లూరులో ఇండ్ల పంపిణీలో మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్
సంగారెడ్డి, అక్టోబర్ 2 (నమస్తే తెలంగాణ): గ్రేటర్ హైదరాబాద్‌లోని పేదల కోసం మరో లక్ష ఇండ్లు నిర్మిచేందుకు సీఎం కేసీఆర్ సిద్ధంగా ఉన్నారని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ రూ.9,600 కోట్లతో సకల సౌకర్యాలతో లక్ష డబుల్ బెడ్రూం ఇండ్లను నిర్మించి పేదలకు ఉచితంగా పంపిణీ చేస్తున్నట్టు చెప్పారు. తెలంగాణ తరహాలో దేశంలో ఎక్కడైనా కేంద్ర ప్రభుత్వం కానీ, రాష్ట్ర ప్రభుత్వాలు కానీ డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించినట్టు చూపిస్తే తన పదవికి రాజీనామా చేస్తానని సవాల్ చేశారు. సంగారెడ్డి జిల్లా కొల్లూరు టౌన్షిప్లో డబుల్ బెడ్రూం ఇండ్లను సోమవారం మంత్రి తలసాని పంపిణీ చేశారు. పటాన్చెరు సహా హైదరాబాద్‌లోని ఎనిమిది నియోజకవర్గాలకు చెందిన 6,067 మందికి ఇండ్ల పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. జీహెచ్ఎంసీలోని పేదలు కిరాయి ఇండ్లలో ఉండొద్దని, ప్రతి ఒక్కరూ సొంత ఇంటిలో ఉండాలన్నది సీఎం కేసీఆర్ సంకల్పం అని వెల్లడించారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సీఎం కేసీఆర్ అమలు చేస్తున్నారన్నారు. ఇవేమీ పట్టని విపక్షాలు చిల్లర విమర్శలు చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదల పక్షపాతి కేసీఆర్‌కు ప్రజలు అండగా నిలిచి, మళ్లీ సీఎంను చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు మహిపాల్‌రెడ్డి, దానం నాగేందర్, ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ భూపాల్‌రెడ్డి పాల్గొన్నారు.
సంక్షేమంలో ఆదర్శం: మంత్రి మహమూద్ అలీ
దేశానికి స్వాతంత్య్రం గాంధీ తీసుకువస్తే.. ఉనికిని కోల్పోతున్న తెలంగాణకు సీఎం కేసీఆర్ ఉద్యమాలతో ఊపిరి పోసి మరో గాంధీలా నిలిచారని హోం మంత్రి మహమూద్ అలీ పేర్కొన్నారు. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్‌లో ఏర్పాటు చేసిన డబుల్ బెడ్రూం ఇండ్ల పంపిణీలో ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద, మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజుతో కలిసి మంత్రి లబ్ధిదారులకు ఇండ్ల పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా మహమూద్ అలీ మాట్లాడుతూ.. మరో లక్ష ఇండ్లను వచ్చే ఎన్నికల తర్వాత నిర్మించాలని సీఎం కేసీఆర్‌ను కోరుతామని చెప్పారు. ఇంటింటికీ సంక్షేమ పథకాలతో అన్ని రాష్ర్టాలకు తెలంగాణ ఆదర్శంగా నిలుస్తున్నదని వెల్లడించారు.
పైసా భారం మోపలేదు: మేయర్ విజయలక్ష్మి
జీహెచ్ఎంసీలోని 24 నియోజకవర్గాల పరిధిలో లక్ష డబుల్ బెడ్రూం ఇండ్లను రూ.10 వేల కోట్లతో ప్రభుత్వం నిర్మించిందని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి చెప్పారు. రాజేంద్రనగర్ నియోజకవర్గం పరిధిలోని నార్సింగి, బైరాగిగూడలో నిర్మించిన డబుల్ ఇండ్లను ఎంపీ రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్‌తోపాటు లబ్ధిదారులకు పట్టాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ.. నిరుపేదలు ఆత్మగౌరవంతో జీవించడమే ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పమని, నయా పైసా భారం మోపకుండా పేదలకు ఇండ్లను పంపిణీ చేస్తున్నామని వెల్లడించారు.
ప్రజలంతా కేసీఆర్ వెన్నంటే: ఎమ్మెల్యే మంచిరెడ్డి
పేద ప్రజలు ఆత్మగౌరవంతో జీవించేలా సీఎం కేసీఆర్ డబుల్ బెడ్రూం ఇండ్ల పథకానికి శ్రీకారం చుట్టారని రంగారెడ్డి జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి వెల్లడించారు. అబ్దుల్లాపూర్‌మెట్‌లో నిర్మించిన 180 డబుల్ బెడ్రూం ఇండ్లను ఎమ్మెల్సీ బుగ్గారపు దయానంద్గుప్తతో కలిసి ఎమ్మెల్యే లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అన్ని వర్గాల అభ్యున్నతి కోసం అహర్నిశలు శ్రమిస్తున్న సీఎం కేసీఆర్ వెన్నంటే ప్రజలంతా ఉన్నారని, పని చేసే ప్రభుత్వాన్ని మరోసారి ఆశీర్వదించాలని కోరారు.
డబుల్ ఇండ్లు కేసీఆర్ ఘనతే: మంత్రి మల్లారెడ్డి
నిరుపేదలకు రూ.35 లక్షలకు పైగా విలువ చేసే ఇండ్లను కట్టించిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి పేర్కొన్నారు. దేశంలో ఇలాంటి పథకం మరెక్కడా లేదని స్పష్టంచేశారు. మేడ్చల్ జిల్లాలోని రెండు ప్రాంతాల్లో జరిగిన డబుల్ ఇండ్ల పంపిణీ కార్యక్రమంలో మంత్రి మల్లారెడ్డి పాల్గొన్నారు. ఎల్బీనగర్, మలక్‌పేట్, చార్మినార్ నియోజకవర్గాలకు చెందిన 3,214 మంది లబ్ధిదారులకు రాంపల్లిలోని ఇండ్ల పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. డబుల్ ఇండ్ల పంపిణీ నిరంతరం కొనసాగుతుందని, అర్హులందరికీ ఇండ్లను ప్రభుత్వం అందిస్తుందని చెప్పారు.
పేదలకు వరం: డిప్యూటీ స్పీకర్ పద్మారావు
ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన డబుల్ బెడ్రూం ఇండ్లు పేదలకు వరమని డిప్యూటీ స్పీకర్ పద్మారావుగౌడ్ పేర్కొన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలో డబుల్ బెడ్రూం ఇండ్ల పంపిణీలో ఎమ్మెల్యే అరికెపూడి గాంధీతో కలిసి పద్మారావుగౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నయా పైసా ఖర్చు లేకుండా ప్రతి పేదవాడికి డబుల్ బెడ్రూం ఇంటిని అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నదని చెప్పారు. మళ్లీ అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, పని చేస్తున్న ప్రభుత్వాన్ని ప్రజలు తప్పకుండా ఆదరించాలని కోరారు. ప్రభుత్వం ఇచ్చిన ఇండ్లను అమ్ముకోవద్దని సూచించారు.
కేసీఆర్‌ను ఆశీర్వదించండి: మంత్రి పట్నం
సంక్షేమంలో తెలంగాణ దేశంలోనే నంబర్ వన్ స్థానంలో నిలిచిందని గనులు, భూగర్భవనరుల, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు. చేవెళ్ల నియోజకవర్గం శంకర్పల్లి మండలంలో 1,512 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే కాలె యాదయ్యతో కలిసి మంత్రి డబుల్ ఇండ్ల పత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రతి వ్యక్తికి, కుటుంబానికి ఏదో ఒక సంక్షేమ పథకం అందేలా చూసిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కిందని చెప్పారు. ఇచ్చిన హామీలు నెరవేర్చామని, మరోమారు సీఎం కేసీఆర్‌ను ఆశీర్వదించాలని కోరారు.
పేదల సొంతింటి కల సాకారం: మంత్రి సబిత
పేదల సొంతింటి కలలను సాకారం చేసి ముఖ్యమంత్రి కేసీఆర్ పేదల పక్షాన నిలుస్తున్నారని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం మన్సాన్పల్లిలో జిల్లా ఎమ్మెల్యేలతో కలిసి మంత్రి లబ్ధిదారులకు ఇండ్ల పత్రాలను అందజేశారు. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రతి గడపకు చేరుతున్నాయని, తెలంగాణను అన్ని రంగాల్లో ముందుకు తీసుకుపోతున్నారని కొనియాడారు. దేశంలో ఏ రాష్ట్రలో లేనివిధంగా నయా పైసా ఖర్చు లేకుండా పేదలకు ఆత్మగౌరవ సౌధాలను అందిస్తున్నారని తెలిపారు. మహేశ్వరంలో 2,099 మందికి ఇండ్ల పట్టాలను పంపిణీ చేశారు.
సర్వాంగ సుందరంగా నూకపెల్లి కేసీఆర్ కాలనీ
జగిత్యాల పట్టణ ప్రాంత నిరుపేదలకు సొంతింటి కల నిజం కాబోతున్నది. దాదాపు రూ.300 కోట్లతో 4,520 డబుల్ బెడ్రూం ఇండ్లను రాష్ట్ర ప్రభుత్వం నూకపెల్లిలో నిర్మించింది. ఈ కాలనీని మంగళవారం మంత్రులు కేటీఆర్, కొప్పుల ఈశ్వర్ ప్రారంభించనున్నారు. ఎంపిక చేసిన 3,722 మంది లబ్ధిదారులకు ఇండ్ల పత్రాలను అందజేయనున్నారు.
బాన్సువాడలోని డబుల్ బెడ్రూం ఇండ్లు
2bhk8
డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణాల్లో రాష్ట్రంలోనే కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గం ప్రత్యేకతను సాధించింది. అత్యధిక ఇండ్ల నిర్మాణాలతో కేరాఫ్‌గా మారుతున్నది. ఈ నియోజకవర్గానికి ఇప్పటి వరకు 11 వేల ఇండ్లను ప్రభుత్వం మంజూరు చేసింది. ఇందులో 10 వేల ఇండ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి.