Shadnagar | హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 5 (నమస్తే తెలంగాణ): ‘విధి నిర్వహణలో వచ్చే జీతం, పేరు ప్రఖ్యాతల కంటే అప్పనంగా వచ్చే సొమ్ముకు ఆశపడే షాద్‌నగర్ ఘటనలో పోలీసులు అరాచకానికి పాల్పడ్డారా?’ అంటే ‘అవును’ అనే సమాధానమే వస్తున్నది. ఒకటీ అరా కాదు.. పోయిన 22 తులాల బంగారం రికవరీ చేస్తే ఏకంగా సగం వాటా.. అంటే పదకొండు తులాల బంగారం దక్కుతుందనే అత్యాశ వారిని రెచ్చిపోయేలా చేసిందని స్పష్టమవుతున్నది. చివరికి విచక్షణ కోల్పోయి సభ్య సమాజం సిగ్గుపడేలా దళిత మహిళపై థర్డ్‌డిగ్రీ ప్రయోగించే దాకా వెళ్లింది. ఇక్కడ పోలీసుల వ్యవహారం, సాంకేతికత వినియోగంలో దేశానికే ఆదర్శంగా నిలిచిన ‘తెలంగాణ పోలీస్’కు మచ్చ తెచ్చింది. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ ఘటనలో ఫిర్యాదుదారుడితో పోలీసులు కుమ్మక్కయి, రికవరీ సొమ్ములో ‘ఫిఫ్టీ ఫిఫ్టీ’ ఒప్పందం చేసుకొని దళిత మహిళను చిత్రహింసలు పెట్టారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఘటన జరిగిన సమయంలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న కారణంగా పోలీసులు పక్కా ప్రణాళికతో విషయం బయటికి పొక్కకుండా జాగ్రత్త పడినట్టు తెలుస్తున్నది. ఓవైపు పోలీస్ ఉన్నతాధికారులు ఫ్రెండ్లీ పోలీసింగ్ కోసం వినూత్న కార్యక్రమాలు చేపడుతుంటే, మరోవైపు కిందిస్థాయి పోలీస్ అధికారులు, సిబ్బంది నోటికి, లాఠీకి మాత్రమే పని చెబుతుండటం చర్చనీయాంశమైంది.
అంగీకరించాలని కర్కశత్వం
ఫిర్యాదుదారుడితో డీఐతో పాటు క్రైం సిబ్బంది కుదుర్చుకున్న ఒప్పందం వల్లే దొంగతనం చేసినట్టు ఒప్పుకోవాలని దళిత మహిళలను, ఆమె కొడుకును, భర్తను ఇష్టం వచ్చినట్టు కొట్టారన్న విషయం బయటకు వచ్చింది. పోలీసుల దెబ్బలకు తాళలేక మహిళ స్పృహ తప్పి పడిపోతే ఆమెను రాత్రికి రాత్రే ఇంటికి పంపిన పోలీసులు తదుపరి ఫాలో అప్‌లో కూడా ఉన్నారు. మరుసటి రోజు ఆమె ఆరోగ్య పరిస్థితిని తెలుసుకొని వారం పాటు మరో గ్రామంలో ఆమెను దాచిపెట్టారనే ఆరోపణలు సైతం వినిపిస్తున్నాయి. ఆ సమయంలో అసెంబ్లీ సమావేశాలు జరుతున్నందున విషయం బయటపడకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకున్నట్టు తెలుస్తున్నది. అంతా సద్దుమణిగిందని పోలీసులు భావించిన సమయంలో బాధిత మహిళ నోరు విప్పడంతో వారి కర్కశత్వం లోకానికి తెలిసింది.
శివారులో అంతే!
సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ పరిధిలోని ఆయా పోలీస్స్టేషన్లలో పోలీసు జులుం నడుస్తున్నదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇన్స్పెక్టర్, ఎస్సై, కానిస్టేబుళ్లకు ప్రజలు భయపడాలనే ధోరణితో వ్యవహరిస్తున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. ఠాణాకు వచ్చే వారితో మర్యాదగా మాట్లాడే పద్ధతులకు తిలోదకాలిచ్చినట్టు ఇటీవలి ఉదంతాల ద్వారా స్పష్టమవుతున్నది. ఇటీవల శంకర్పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్న సందర్భంగా యువకులను అక్కడి ఇన్స్పెక్టర్ బూటు కాళ్లతో తన్నుతూ కొట్టుకుంటూ తీసికెళ్లిన ఘటన సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో నెటిజన్లు తీవ్రస్థాయిలో స్పందించారు. ఔటర్ రింగు రోడ్డుపై ఓ డ్రైవర్‌ను జీడిమెట్లకు చెందిన ట్రాఫిక్ ఎస్సై బూతులు తిడుతూ జులం ప్రదర్శించిన వీడియో కూడా సోషల్‌మీడియాలో వైరలై ఆ శాఖపై ప్రజల ఆగ్రహానికి కారణమైంది.
శాస్త్రీయ విచారణ మరిచిన పోలీసులు
దొంగతనం కేసులో షాద్‌నగర్ పోలీసులు శాస్త్రీయ విచారణను పక్కనబెట్టారు. ఫిర్యాదుదారుడు అనుమానం వ్యక్తం చేయగానే మహిళ అని కూడా చూడకుండా మూస పద్ధతుల్లో విచారణ పేరిట ఆమెను చిత్రహింసలు పెట్టారు. బీఆర్ఎస్ హయాంలో అనేక కీలకమైన కేసుల్లో తెలంగాణ పోలీసులు చేపట్టిన శాస్త్రీయ విచారణ, ఇతర రాష్ర్టాల పోలీసుల మన్ననలు పొందింది. కానీ షాద్‌నగర్ ఘటనలో అందుకు భిన్నమైన విచారణ శైలి కనిపించింది. అన్నిటికీ మించి కొడుకు ముందే ఓ తల్లిని బట్టలు విప్పించి కొట్టడం వంటి జుగుప్సాకరమైన ఘటన చోటుచేసుకోవడం మొత్తం పోలీసులనే తలదించుకునేలా చేసింది.