ఖిలావరంగల్: ఖిలా వరంగల్‌లో ఆదివారం రాత్రి ఆర్ఎంపీ ఇంట్లో దొంగలు పడి భారీగా బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లారు. స్థానికులు, పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. ఖిలా వరంగల్ పడమర కోటకు చెందిన ఆర్ఎంపీ వైద్యుడు గుర్రం రామకృష్ణ, సవితారాణి దంపతులు ఆదివారం రాత్రి ఓ ఫంక్షన్ నిమిత్తం ఊరికి వెళ్లారు. కాగా, మధ్య రాత్రి గుర్తుతెలియని దొంగలు ఇంట్లోకి చొరబడి బీరువాను పగలగొట్టారు.
అందులో ఉన్న 15 తులాల బంగారు నగలను అపహరించారు.
సోమవారం ఉదయం తలుపులు తెరిచి ఉండడం గమనించిన అతని తల్లి కుమారుడికి ఫోన్ ద్వారా సమాచారం చేరవేసింది. చోరీ జరిగిన విషయం తెలుసుకొని పోలీసులకు సమాచారమిచ్చారు. సంఘటన స్థలానికి వరంగల్ ఏసీపీ నందిరాం నాయక్, మిల్స్ కాలనీ సీఐ రమేష్, డాగ్ స్క్వాడ్, క్లూస్ టీమ్‌లు చేరుకొని ఇంటి చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరాల ఫుటేజ్‌ను పోలీసులు స్వాధీనం చేసుకొని విచారణ ప్రారంభించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.