హైదరాబాద్ (ఖైరతాబాద్), సెప్టెంబర్ 27 : ఉప ముఖ్యమంత్రి భట్టి ఇంట్లో దొంగలు పడ్డారు. బంగారం, వెండి, నగదు ఎత్తుకెళ్లారు. ఇంట్లో వాచ్‌మన్‌గా పనిచేస్తున్న వ్యక్తే ఈ దొంగతనానికి పాల్పడినట్టు పోలీసుల విచారణలో తేలింది. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 14 బీఎన్‌రెడ్డి కాలనీలో భట్టి విక్రమార్కకు సొంత ఇల్లు ఉన్నది. అయితే ప్రభుత్వం కేటాయించిన ప్రజాభవన్‌లో ప్రస్తుతం భట్టి కుటుంబం నివాసముంటున్నది. ఈ క్రమంలో బంజారాహిల్స్‌లోని ఇంటి వద్ద బీహార్‌కు చెందిన రోషన్‌కుమార్ మండల్ అనే వ్యక్తిని వాచ్‌మన్‌గా ఉంచారు. ఇదే అదునుగా భావించిన రోషన్‌కుమార్ తనకు తెలిసిన ఉదయ్‌కుమార్‌తో కలిసి చోరీకి పాల్పడ్డాడు. అనంతరం ఇద్దరు పశ్చిమబెంగాల్‌కు పారిపోయారు. ఖరగ్‌పూర్ రైల్వేస్టేషన్లో అనుమానాస్పదంగా సంచరిస్తున్న వీరిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించారు. దీంతో భట్టి ఇంట్లో దొంగతనం బయటపడింది. నిందితుల వద్ద రూ.2.2 లక్షల నగదు, వంద గ్రాముల బంగారం, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకొని బంజారాహిల్స్ పోలీసులకు సమాచారమిచ్చారు. నిందితులను హైదరాబాద్‌కు తీసుకొచ్చే అవకాశమున్నది.
హైదరాబాద్, సెప్టెంబర్ 27 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో దొంగలుపడ్డారు. ఎక్కడికక్కడ దోచేస్తున్నారు. ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. మరీ ముఖ్యంగా హైదరాబాద్ నగరంతోపాటు సమీప జిల్లాల్లో దొంగల ముఠాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. చైన్‌స్నాచింగ్ ఘటనలు అన్ని జిల్లాల్లో చోటుచేసుకుంటున్నాయి. తెలంగాణలో తిష్టవేసిన పార్తీ గ్యాంగ్‌లు, థార్ గ్యాంగ్‌లు, బిహారీ దొంగల ముఠాలు పేట్రేగిపోతున్నాయి. వివిధ రాష్ర్టాల నుంచి ఇక్కడికి వచ్చి అడ్డగోలుగా దొంగతనాలు చేస్తున్నారు. ఏకంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇంట్లో చొరపడి విలువైన నగదు, నగలు, విదేశీ కరెన్సీ తదితర సామగ్రిని దోచుకున్న ఘటన మరింత భయాందోళన కలిగిస్తున్నది. మళ్లీ వరసగా చైన్‌స్నాచింగ్, దొంగతనాలు జరుగుతుండటం ఆందోళనకరం. నగర శివార్లలోని సీసీ కెమెరాలు లేని ప్రాంతాలను లక్ష్యంగా చేసుకోవడంతోపాటు ఎక్కువ మొత్తంలో నగలను కొల్లగొట్టేందుకు జిల్లాలకు విస్తరించాయి.
గత మూడు నెలల్లో ఖమ్మం జిల్లా పెనుబల్లిలో, నిజామాబాద్ జిల్లా మామిడిపల్లి, మేడ్చల్ జిల్లా ఘట్కేసర్, పోచారంలో, వరంగల్ జిల్లా చిల్పూర్‌లో, హైదరాబాద్ నగర శివారులోని మరో రెండుచోట్ల చైన్‌స్నాచింగ్ ఘటనలు చోటుచేసుకున్నాయి. విద్యుత్ మోటర్లు ఎత్తుకెళ్లే ముఠాలు, రాగి వైరు దొంగలు, బైక్‌ల దొంగలు, కార్ల దొంగలు రెచ్చిపోతున్నారు. గత ఆరు నెలలుగా దొంగతనాలు, చోరీల్లో నల్లగొండ జిల్లా అగ్రస్థానంలో ఉన్నది. పోలీసులు పార్థీగ్యాంగ్ను ఎట్టకేలకు అరెస్టు చేయడంతో అక్కడ కొద్దిగా దొంగతనాల బెడద తగ్గింది. ఇటీవల మళ్లీ దొంగలు చెలరేగిపోతున్నారని స్థానికులు అంటున్నారు. సెల్ షాపులు, మూసి ఉన్న దుకాణాలు, ఇండ్లు టార్గెట్‌గా చోరీలకు పాల్పడుతున్నారు. హైదరాబాద్ సహా సమీప జిల్లాల్లో థార్ గ్యాంగ్‌లు, పార్థీ గ్యాంగ్‌లు, భవారీయా ముఠాలు, చుడీదార్ గ్యాంగులు, రైళ్లలో దొంగతనం చేసే ముఠాలు, ఫోన్లు అపహరించే ముఠాలు, కిరాయి హత్యలు చేసే మూకలు, చిన్నారులను అపహరించే గ్యాంగులు రాష్ట్రంలో తిష్టవేసినట్టు పోలీసులే చెబుతున్నారు. కానీ, వారిని అరెస్టు చేయడంలో, తెలంగాణ వైపు కన్నెత్తి చూడకుండా చేయడంలోనూ ఎలాంటి పటిష్ట చర్యలు తీసుకోలేకపోతున్నారు.