బుధవారం 08 జూలై 2020
Telangana - Jun 12, 2020 , 08:32:26

దొంగతనాలకు దూరమై.. వ్యవసాయానికి చేరువై

దొంగతనాలకు దూరమై.. వ్యవసాయానికి చేరువై

అదో చిన్న గిరిజన తండా. ఒకప్పుడు దొంగతనాలకు పెట్టిందిపేరు. చివరకు తన పేరును దొంగతండాగా కూడా మార్చుకొని ప్రసిద్దికెక్కింది. జిల్లాలో ఎక్కడ దొంగతనాలు జరిగినా కేరాఫ్‌ అడ్రస్‌గా నిలిచింది. అలాంటి తండాలోని ప్రజలు దొంగతనాలను పూర్తిగా మానేశారు. సేద్యం చేస్తూ సిరులు పండిస్తున్నారు. పిల్లల్ని ఉన్నతంగా చదివిస్తున్నారు. వాళ్లలో ఇప్పుడు అనేకమంది ప్రభుత్వ ఉద్యోగాలు కూడా చేస్తున్నారు.    

ఏన్కూరు: ఒకప్పడు ఈ గ్రామం.. ఆ పక్కనే ఉన్న బురదరాఘవాపురం గ్రామ పంచాయతీలో అంతర్భాగంగా ఉండేది. దీనికి దొంగతండా, మర్రికొయ్యతండా అనే పేర్లు కూడా ఉండేవి. 1960 నుంచి 1980 వరకు కరువు పరిస్థితులు తీవ్రంగా ఉన్నప్పుడు గ్రామస్తుల్లో అధిక శాతం దొంగతనాలు చేసేవారు. ఉమ్మడి జిల్లాలో మేకల దొంగతనాలకు ఈ గ్రామం పేరుగాంచింది. వంట పాత్రలను కూడా దొంగిలించేవారు. చిల్లర దొంగతనాలు కూడా చేసేవారు. పేరు మోసిన దొంగలు అరడజను వరకు ఉండేవారు. పోలీసులు ఎన్నిసార్లు కేసులు పెట్టినా, ఎంతగా నచ్చచెప్పినా వారిలో మార్పు రాలేదు. దొంగతనాలు చేయకుండా ఉన్న కొంతమంది మాత్రం అప్పట్లో పోలీసుల వేధింపులు తట్టుకోలేక సమీపంలోని బురదరాఘవాపురంలోనే ప్రత్యేక తండాగా ఏర్పాటు చేసుకొని నివాసం ఉంటున్నారు. ఇంకా ఇక్కడ మిగిలిపోయిన వారిలో ఉన్న కొంతమంది మాత్రం దొంగతనాలను మాత్రం మానుకోలేదనే ప్రచారం ఉంది. 

ఇద్దరి హత్యతో పరివర్తన..

దొంగల బాధ తట్టుకోలేక 1992లో గ్రామానికి చెందిన నాన్యా, బుచ్చా అనే ఇద్దరిని మూలపోచారం సమీపంలో ఇతర గ్రామాల ప్రజలు కర్రలతో కొట్టి చంపారు. ఆ ఘటనతో గ్రామస్తుల్లో పరివర్తన వచ్చింది. అంతా కలిసి కూర్చొని దొంగతనాలు చేయవద్దని తీర్మానించుకున్నారు. 


ప్రశాంతంగా జీవిస్తున్నాం..

మాది చిన్న పంచాయతీ. 1100 మంది జనాభా ఉన్నారు. మా గ్రామంలో ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. గ్రామస్తులందరూ ప్రశాంతంగా జీవిస్తున్నారు. వ్యవసాయం చేసుకుంటూ బతుకుతున్నారు. పిల్లల్ని చదివించుకుంటున్నారు. తెలంగాణ ప్రభుత్వం తండాలను పంచాయతీలుగా చేయడంతో మా గ్రామం మరింత అభివృద్ధి చెందుతున్నది. నాటుసారా కూడా పూర్తిగా తగ్గింది. గ్రామంలో గొడవలు, ఘర్షణలు లేవు. -బోడా వినోద్‌, సర్పంచ్‌

వ్యవసాయానికి చేరువై..

ఇక ఎలా బతకాలనే ఆలోచన వచ్చింది. కొంతమంది కూలి పనులకు సిద్ధమయ్యారు. మరి కొంతమంది పోడు వ్యవసాయంపై దృష్టిపెట్టారు. ఇంకొంతమంది కౌలు వ్యవసాయం మొదలుపెట్టారు. ఇప్పుడు వారంతా సిరులు పండిస్తున్నారు. పిల్లల్ని ఉన్నతంగా చదివిస్తున్నారు. వారు కూడా పోలీసులుగా, ఉపాధ్యాయులుగా, ఇంజినీర్లుగా స్థిరపడుతున్నారు. 


logo