మహబూబ్‌నగర్, మే 13 (నమస్తే తెలంగాణ ప్ర తినిధి) : ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని రెండు పార్లమెంట్ స్థానాలకు సోమవారం జరిగిన పోలింగ్‌లో అక్కడక్కడ చెదురుమదురు ఘటనలు, ఎన్నిక ల బహిష్కరణలు, పలు చోట్లా ఈవీఎంల మొరాయింపు మినహా ప్రశాంతంగా జరిగింది. ఉదయం 7 గంటలకే ప్రారంభమైన ఓటింగ్ సాయంత్రం 6 గం టల వరకు కొనసాగింది. చాలాచోట్లా ఎండను సైతం లెక్క చేయకుండా ఓటర్లు ఓటేయడానికి పోలింగ్ కేం ద్రాల వద్ద బారులుదీరారు. మహబూబ్‌నగర్ మున్సిపల్ పరిధిలోని నాలుగో వార్డు పరిధిలోని ఎదిర, దివిటిపల్లి, అంబటిపల్లి, సిద్ధాయపల్లి ప్రజలు అమరరా జా కంపెనీకి వ్యతిరేకంగా ఎన్నికలను బహిష్కరించా రు.
నాగర్‌కర్నూల్ పార్లమెంట్ పరిధిలో బల్మూరు మండలం మైలారం గ్రామస్తులు అక్రమ మైనింగ్‌ను ఆపాలని ఎన్నికలను బహిష్కరించారు. ఆమనగల్ మండలం ముద్విని గ్రామంలో అక్రమ మైనింగ్ పర్మిషన్ ఎలా ఇచ్చారని కొద్దిసేపు ఎన్నికలు బహిష్కరించారు. కొల్లాపూర్ మండలం చెంచుగూడెంలోని చెం చుకాలనీకి విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ఓటర్లు ఓటెయ్యమని భీష్మించారు. మహబూబ్‌నగర్ జిల్లా హన్వాడ మండలంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య జరిగిన ఘర్షణలో ఓ బీఆర్ఎస్ కార్యకర్తకు చెయ్యి విరిగింది. ఆత్మకూరు మండలం జూరాల గ్రామంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ శ్రేణులు ఘర్షణ పడ గా ఓ వ్యక్తి కత్తితో హల్చల్ చేశారు. జోగుళాంబ గ ద్వాల జిల్లా వడ్డేపల్లి మండలం పైపాడు గ్రామంలోని పోలింగ్ బూత్‌లో ఓ దుండగుడు కారు గుర్తు కనిపించకుండా మార్కర్‌తో చెరిపేశారు.
ఇది గమనించిన పార్టీ నేతలు ఆందోళన చేయడంతో గుర్తును మళ్లీ అమర్చారు. అడ్డాకుల మండలం రాచాల, అయిజ, కోడేరు, మద్దూరు మండలం అప్పిరెడ్డిపల్లి గ్రామాల్లో ఈవీఎంలు మొరాయించడంతో అధికారులు వాటిని సరిచేశారు. దీంతో ఆయా గ్రామాల్లో పోలింగ్ కొద్దిసే పు ఆలస్యంగా ప్రారంభమైంది. జడ్చర్ల నియోజకవర్గ పరిధిలోని ఊర్కొండ మండలం జంగబోయినపల్లి లో సమయం దాటినా కూడా 20 మంది ఓటర్లు ఉం డడంతో వారికి ఓటేసే అవకాశం కల్పించారు.
అమ్రాబాద్ మండలం వటువర్లపల్లిలో ఓటు వేయడానికి వెళ్లిన ఓటర్లపై తేనెటీగలు దాడి చే యగా ఐదుగురికి గాయాలయ్యాయి. మొత్తంమీద చిన్న చిన్న ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా ముగియడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. అసెంబ్లీ ఎన్నికలను తలదన్నే విధంగా పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ భారీగా జరిగింది. పోలింగ్ ముగియడంతో అధికార యంత్రాంగం ఈవీఎంలను సీల్ చేసి వాటిని పాలమూరు యూనివర్సిటీలోని స్ట్రాంగ్ రూములకు భారీ బందోబస్తు మధ్య తరలించారు.
ఉమ్మడి జిల్లాలో పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. అక్కడక్కడ చెదురుమదురు ఘటనలు మినహా రెం డు పార్లమెంట్ పరిధిలో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం ఏడు గంటలకి పోలింగ్ ప్రారంభం కాగా అప్పటికే ఓటర్లు ఆయా కేంద్రాల వద్ద బారులు దీరారు. ఉదయం పూట ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వా తావరణం మేఘావృతం కావడంతో అక్కడక్కడ చిరుజల్లులు పడ్డాయి. వాతావరణం బాగా చల్లబడటంతో ఓటర్లు పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు చేరుకొని ఓటేశారు. మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ పార్లమెంట్ ఓటింగ్ సరళిని కేంద్ర ఎన్నికల సంఘం పరిశీలకులు పరిశీలించారు.
మహబూబ్‌నగర్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి రవినాయక్, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి నారాయణపేట జిల్లా కలెక్టర్ కోయ హర్ష, నాగర్‌కర్నూల్ పార్లమెంట్ ఎన్నికల అధికారి ఉదయ్‌కుమార్, అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్లు తే జస్నందలాల్ పవార్ తదితరులు పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేశారు. ఇటు ఆయా జి ల్లా ఎస్పీలు, కలెక్టర్లు పోలింగ్ కేంద్రాల్లోని వెబ్ కెమెరాల ద్వారా కంట్రోల్ రూమ్‌లో ఉండి ఓటింగ్ సరళిని పరిశీలించారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రత్యేక స్ట్రైకింగ్ ఫోర్సును ఏర్పాటు చేశారు. సమస్యాత్మక కేంద్రాల వద్ద అధికారులు కేంద్ర బలగాలను రంగంలో దించారు.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మహబూబ్‌నగర్ పార్లమెంట్ పరిధిలోని కొడంగల్ అసెంబ్లీ సెగ్మెంట్లో కుటుంబ సభ్యులతో కలిసి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. బీఆర్ఎస్ మహబూబ్‌నగర్ పార్లమెంట్ అభ్యర్థి మన్నె శ్రీనివాస్‌రెడ్డి నవాబ్ పేట మండలం గురకుంటలో కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. బీఆర్ఎస్ నాగర్‌కర్నూల్ పార్లమెంట్ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ అలంపూర్‌లో కుటుంబ సభ్యులతో కలిసి ఓటేశారు.
మాజీ మంత్రులు శ్రీనివాస్‌గౌడ్ మహబూబ్‌నగర్‌లో, నిరంజన్‌రెడ్డి వనపర్తిలో, లక్ష్మారెడ్డి జడ్చర్ల లో ఓటేశారు. అదేవిధంగా మహబూబ్‌నగర్ బీజేపీ అభ్యర్థి డీకే అరుణ, కాంగ్రెస్ అభ్యర్థి చల్లా వంశీచంద్‌రెడ్డి మహబూబ్‌నగర్‌లో తమ ఓటు హక్కును వినియోగించుకోగా జిల్లాలోని ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ప్రముఖులు సైతం తమతమ గ్రామాల్లో ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ సజావుగా సాగింది. మక్తల్ అ సెంబ్లీ నియోజకవర్గంలో 70.85, నారాయణపేట 68.71, షాద్‌నగర్‌లో 77.42, జడ్చర్లలో 76.07 శాతం నమోదైనట్లు అధికారులు పేర్కొన్నారు. అలాగే సాయంత్రం 5 గంటల వరకు అందిన వివరాల మేరకు దేవరకద్ర 71.90 శాతం, , కొడంగల్ 65.54శాతం, మహబూబ్‌నగర్ 63.26శాతం పోలింగ్ నమోదైనట్లు చెప్పారు. అయితే మిగతా వివరాలు ఇంకా తెలియాల్సి ఉన్నది.