హనుమకొండ చౌరస్తా, మే 4 : యాసంగిలో లక్షా 30 టన్నుల పంటలను రికార్డు స్థాయిలో పండించినట్టు మంత్రులు చెప్తున్నారని, అయితే వారి ముఖం చూసి పంటలు పెరిగాయా? అని బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ఎద్దేవా చేశారు. 16 నెలల్లో ప్రభుత్వం ఏమి చేస్తే పంటల ఉత్పత్తి పెరిగిందో చెప్పాలని ప్రశ్నించారు. ఆదివారం ఆయన హనుమకొండ రాంనగర్లోని తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ.. దేవాదుల ప్రాజెక్టు లక్ష్యం, విస్తీర్ణం, ఎన్ని ఎకరాలకు నీళ్లు ఇస్తారో చెప్పకుండా.. రెండేండ్లలో ఆరు లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తామంటూ బుద్ధి, జ్ఞానం లేకుండా మంత్రులు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. గతం కంటే ఈ యాసంగిలో కొత్త ఆయకట్టు ఏమైనా తీసుకొచ్చారా? ఏ పద్ధతిలో పంటల ఉత్పత్తిలో రికార్డు సృష్టించారో చెప్పాలని ప్రశ్నించారు. విధి విధానాలు మార్చాలి, అవకాశాలు మెరుగుపర్చాలి, విస్తీర్ణం పెరగాలి, అందుకు తగ్గటుగా నీళ్లు సరఫరా చేయాలి. కానీ, ఇవేవీ చేయకుండా చిటికెలు, విజిల్స్ వేస్తే పంటలు పండవని చెప్పారు. ఈ సంవత్సరం అవసరమైన మేర సాగునీరు సరఫరా చేశారా? పంటలు ఎందుకు ఎండిపోయాయని ప్రశ్నించారు. తమకు కావాల్సిన ఎమ్మెల్యేకు మోటర్ల ద్వారా నీళ్లు ఇచ్చారని, సామాన్య రైతులకు సాగునీటిని సరఫరా చేయడంలో విఫలమయ్యారని దుయ్యబట్టారు. ఏ ఒక చెరువులో కూడా నీళ్లు లేవని, తకువగా పంపు చేస్తున్నారని చెప్పారు.
ఒకవైపు నీళ్లు లేక పంటలు ఎండిపోతే, మంత్రులు మాత్రం 30 బస్తాలు పండే చోట 50 బస్తాలు పండించినట్టు గొప్పలు చెప్పుకుంటున్నారని పొన్నాల లక్ష్మయ్య విమర్శించారు. నాగార్జునసాగర్ నుంచి ఆంధ్రకు నీళ్లను తరలించుకుపోతుంటే, ఉన్న వాటిని వాడుకోలేని దౌర్భాగ్య స్థితిలో మన మంత్రులు ఉన్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి కొడంగల్లో లిఫ్ట్ ఇరిగేషన్కు ముందు రూ.1,890 కోట్లు అని, మరో నెల రోజుల్లో రూ.4 వేల కోట్లు అని, ఇప్పుడు రూ.6,900 కోట్లు అని అంటున్నారని, అసలు డీపీఆర్ లేకుండా టెండర్లు ఇచ్చారని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రికి ఇలా చెప్పుకోవడానికి సిగ్గుండాలని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టులో రూ.లక్ష కోట్లు ఖర్చు పెట్టారంటూ తెలివి, జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.