చిక్కడపల్లి, డిసెంబర్ 30: సమస్యలు పరిష్కరించాలంటూ చేనేత కార్మికులు ఆందోళనలకు సిద్ధమవుతున్నారు. ఈ మేరకు ఫిబ్రవరి 20న హైదరాబాద్లో చేనేత గర్జన, జనవరి 20న అన్ని జిల్లాల కలెక్టరేట్ల ఎదుట ధర్నాకు సిద్ధం కావాలని అఖిలపక్ష సమావేశంలో నిర్ణయించారు. తెలంగాణ చేనేత కార్మిక సంఘం ఆధ్వర్యంలో సోమవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సంఘం అధ్యక్షుడు వనం శాంతి కుమార్ అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి హాజరైన సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వంలో చేనేత కార్మికుల కోసం అమలు చేసిన సంక్షేమ పథకాలు కాంగ్రెస్ ప్రభుత్వంలో కొనసాగించాలని డిమాండ్ చేశారు.
చేనేత కార్మికుల సమస్యలపై ఉద్యమించేవారికి పూర్తి మద్దతు ఉంటుందని, చనిపోయిన కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించాలని కోరారు. చేనేత కార్మికులు ఆత్మహత్య చేసుకోవద్దని విజ్ఞప్తి చేశారు. అనంతరం ఎమ్మెల్సీ ఎలగందుల రమణ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం చేనేత కార్మికుల సమస్యలను పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. సమస్యల పరిష్కారం కోసం చేనేత కార్మిక సంఘాల జేఏసీ ఏర్పాటు చేయాలని సూచించారు.
సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు చెరుపల్లి సీతారాములు మాట్లాడుతూ చేనేత ఉద్యమానికి పార్టీ తరఫున పూర్తి మద్దతు ఉంటుందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేనేత కార్మికుల సమస్యలు పట్టించుకోవడం లేదని సంఘం ముఖ్య సలహాదారుడు కూరపాటి రమేశ్ మండిపడ్డారు. ప్రొఫెసర్ నరసింహారెడ్డి, సంఘం రాష్ట్ర కార్యదర్శి గంజి మురళీధర్, సహాయ కార్యదర్శి ముషం నరహరి, ఉపాధ్యక్షుడు చంద్రశేఖర్, ఆప్కో మాజీ డైరెక్టర్ వీరన్న, చిక్క దేవదాస్, నర్వేశం, గణేశ్ తదితరులు పాల్గొన్నారు.