Mahabubabad | మహబూబాబాద్, మే 28(నమస్తే తెలంగాణ): ‘కాళ్లు మొకుతా బాంచెన్.. మా వడ్లను కొనండి’ అంటూ మహిళా రైతులు తహసీల్దార్ కాళ్లపై పడి విలపించిన ఘటన మహబూబాద్ జిల్లా నర్సింహులపేట మండ లం కేంద్రంలో చోటుచేసుకున్నది. మంగళవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి ధాన్యం తడిసి మొలకెత్తింది. బుధవారం ఉదయం తిరుమల తండాకు చెందిన మహిళా రైతులు భూక్యా ఈరి, గోరి పీఏసీఎస్ కొనుగోలు కేంద్రానికి చేరుకొని తడిసిన ధాన్యాన్ని చూసి బోరున విలపించారు. తాము కొనుగోలు కేంద్రానికి ధాన్యం తెచ్చి 43 రోజులైనా ఎందు కు కొనుగోలు చేయలేదని సిబ్బందితో గొడవకుదిగారు. విషయం తెలుసుకున్న తహసీల్ద్దార్ రమేశ్‌బాబు కొనుగోలు కేంద్రానికి చేరుకున్నారు.
కొనుగోలు కేంద్రంలో నిర్వాహకులు కాంటాలు పెట్టడం లేదని రైతులు తహసీల్దార్‌కు ఫిర్యాదుచేశారు. ధాన్యం రాశుల వద్దకు తీసుకెళ్లి తడిసిన వడ్లని చూపించి బోరున విలపించారు. ‘మా గోడు వినండి.. మమ్మల్ని కాపాడండి’ అంటూ తహసీల్దార్ కాలు మొకుతూ మొరపెట్టుకున్నారు. ఇంకా నాలు గు రోజులైతే మళ్లీ నారు పోయాలి.. పాత ధాన్యమే అమ్మలేకపోతే కొత్త సాగు ఎలా మొదలెడతాం?’ అని వాపోయారు. తడిసిన వడ్లు కొనకుంటే ఆత్మహత్యే శరణ్యమంటూ మహిళా రైతులు రోధించిన తీరు ప్రతి ఒక్కరిని కలిచివేసింది. పైసలు ఇచ్చిన వారికే కాంటాలు పెట్టారని వాపోయారు. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని, లేదంటే తమకు ఆత్మహత్య చేసుకోవడం తప్ప మరో మార్గం లేదని విలపించారు.