ములుగు జిల్లా వాజేడు మండలానికి వచ్చిన భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావుకు శుక్రవారం ఓ కాంగ్రెస్ కార్యకర్త గోడు వెల్లబోసుకున్నాడు. ఇందిరమ్మ ఇంటి మంజూరు కోసం కొందరు రూ.10వేలు అడుగుతున్నారని కొప్పుసూరు గ్రామానికి చెందిన కార్యకర్త ముత్యారావు ఫిర్యాదు చేశాడు. అర్హత ఉన్నా తన భార్య జమున పేరు జాబితాలో రాలేదని తెలిపాడు.
-వాజేడు
నారాయణపేట జిల్లా మక్తల్ మున్సిపాలిటీలోని అంబేదర్నగర్లో అధికారులు శుక్రవారం ఇందిరమ్మ ఇండ్ల అర్హుల జాబితా విడుదల చేశారు. అందులో అనర్హుల పేర్లు ఉండడంతో స్థానికులు అధికారులను నిలదీశారు. ఓ కాంగ్రెస్ నేత స్పందించి ‘మాకు ఇష్టం వచ్చిన వారికే ఇండ్లను కేటాయిస్తున్నాం.. ఇది మా ప్రభుత్వం..’ అంటూ తెగేసి చెప్పాడు.
– మక్తల్
‘ఇందిరమ్మ ఇండ్ల ఎంపికలో అవకతవకలు జరుగుతున్నాయి. ఇందిరమ్మ కమిటీ సభ్యులు డబ్బులిచ్చినోళ్లను.. నచ్చినోళ్లనే ఎంపిక చేస్తున్నరు. అర్హులందరికీ న్యాయం చేయాలి’ అని డిమాండ్ చేస్తూ మంచిర్యాల జిల్లా కిష్టంపేట జీపీ పరిధిలోని ఎల్లక్కపేట కాలనీవాసులు రోడ్డెక్కారు.
-చెన్నూర్ రూరల్
తలదాచుకునేందుకు గూడు లేని తమకు ఇండ్లు ఎందుకు ఇవ్వరని భద్రాద్రి జిల్లా గుర్రాలచెరువు గ్రామస్థులు అధికారులను నిలదీశారు. అర్హుల జాబితాపై అధికారుల విచారణలో మండిపడ్డారు. ఇందిరమ్మ కమిటీల బాధ్యులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు.
– అశ్వారావుపేట టౌన్