కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం శాలపల్లి-ఇందిరానగర్ గ్రామాల మధ్య సోమవారం నిర్వహించిన దళిత బంధు పథకం ప్రారంభ సభలో కమలాపూర్ మండలం కన్నూరుకు చెందిన లబ్ధిదారు కనకం అనిత రవీందర్ దంపతులకు దళిత బంధు కార్డు అందజేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్. చిత్రంలో మంత్రులు హరీశ్‌రావు, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, శ్రీనివాస్‌గౌడ్, సాంస్కృతిక సారథి చైర్మన్ రసమయి బాలకిషన్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు కాలె యాదయ్య, సుంకె రవిశంకర్, జడ్పీ చైర్పర్సన్ విజయ, కలెక్టర్ కర్ణన్, టీఆర్ఎస్ నేత కౌశిక్‌రెడ్డి తదితరులు
పొలం, బర్రెలు కొనుక్కుంట
నా భార్య, నేను రోజూ కూలీ పనులకు పోతేనే ముగ్గురు పిల్లలకు, మాకు బుక్కెడు బువ్వ దొరుకుతది. ఒక్కోసారి పని దొరుకక మస్తు తిప్పలైతది. ఇంత భూమి ఉంటే దున్నుకొని బతికేటోళ్లం. దళితబంధు కింద నన్ను ఎంపిక చేసిన్రు. సీఎం సార్ చేతుల నుంచి రూ.10 లక్షల చెక్కు అందుకుంటనని కలల గూడ అనుకోలె. మస్తు సంబురంగా ఉంది. నాకిచ్చిన పైసలతో 20 గుంటలు కొనుక్కుంట. ఎవుసం చేసుకుంట. అట్లనే బర్రెలు కొని పాల వ్యాపారం చేస్త. ఒక్క రూపాయి కూడ వట్టిగ ఖర్చుపెట్ట. అక్కరకు వాడుకుంట. – నాంపెల్లి రాజేందర్, శనిగరం(కమలాపూర్)
సీఎం రుణం తీర్చుకుంటం
నాకు ఐదుగురు బిడ్డలు. ముగ్గురు కొడుకులు. పెద్ద సంసారం. కూలీ, నాలీ జేసుకుంటున్నం. అరిగోస పడ్డం. ఇంకో బిడ్డ, కొడుకు పెళ్లికున్నరు. ఇప్పుడు శాతనైతలేదు. సీఎం సారు మాకేదో పథకం ఇత్తరు అన్నరు. మాకే ముందుగచ్చింది. ఇయ్యాళ తీసుకున్న బిడ్డా. ఏదో ఓటి పెట్టుకుంట. పిలగాండ్లను దారిల పడేత్త. బాకీల్నైతే పడం. ఏదో రూపంల సీఎం రుణం తీర్సుకుంటం మరి. ఊకుంటమా ఏంది. – చెరుకు ఎల్లమ్మ, నగురం(జమ్మికుంట)
పదిమందికి ఉపాధి కల్పిస్తాం
మాకు ఉండడానికి ఇల్లు కూడా లేదు. నేను కుట్టు పనిచేస్త.. నా భర్త కూలికెళ్తడు. సీఎం చేతుల మీదుగ రూ.పది లక్షల చెక్కు అందుకునుడుతో జన్మధన్యమైంది. ఎప్పటికీ సారుకు రుణపడి ఉంటం. ఎంబ్రాయిడరీ మిషన్ కొన్కుని పదిమందికి ఉపాధి కల్పిస్తం. సార్‌కు మంచి పేరు వచ్చేలా వ్యాపారం చేస్తాం. మా జీవితంల ఇలాంటి మార్పు వస్తదని కలలగూడ అనుకోలే. – కనకం చంద్రకళ రాజ్‌కుమార్, చెల్పూరు, హుజూరాబాద్‌రూరల్
మా గురించి ఇట్ల ఎవ్వలాలోచించలే..
దేశంల ఇన్ని రాష్ట్రాలున్నయ్. ఏ ముఖ్యమంత్రైనా, ప్రధానమంత్రైనా దళితుల గురించి ఆలోచించిన్రా. ఎవ్వలాలోచించలే. అసలు మమ్మల్ని పట్టించుకోలే. సీఎం కేసీఆర్ సారు దళితుల బాగు కోసం ఆలోచించిండు. మా కోసం దళితబంధు తెచ్చిండు. పదిలచ్చలిచ్చిండు. ఈ పథకం మా జీవితాల్లో వెలుగులు నింపుతది. సీఎం సారుకు బతికినంత కాలం మేం, మా పిల్లలం రుణపడి ఉంటం. – గుల్లి సుగుణ, జమ్మికుంట
బతికున్నన్ని రోజులు కేసీఆర్‌నే కొలుస్తం
మాకు ఉండడానికి ఇల్లు కూడా లేదు. ఏండ్లుగా చిన్న రేకుల షెడ్డు కిందనే బతుకుతున్నం. రోజూ పన్జేత్తనే బుక్కెడు బువ్వ దొరుకుతది. ఏ పని దొరకనప్పుడు నా భర్త కిరాయి ఆటో నడుపుతడు. మునుపు కొందరు సార్లు.. నాయకులచ్చి మాకు అది జేత్తం.. ఇది జేత్తమని చెప్పిన్రు. ఆనక పత్తా లేకుంట పోయిన్రు. గిప్పుడు మన ముఖ్యమంత్రి కేసీఆర్ సారు దళితబంధు కింద రూ.10 లక్షలు ఇత్తరని సార్లు చెప్పిన్రు. వాటితో సొంత ఆటో కొనుక్కుంటం. బతికి ఉన్నన్ని రోజులు గాయననే దేవునోలె కొలుస్తం. – తాడెం వినోద-రాజు, మల్యాల, ఇల్లందకుంట
ఏదన్న దుకాణం బెట్టుకుంటం
మా కట్టాలన్నీ తీర్వడానికే కేసీఆర్ సారు అచ్చిండు. పది లచ్చలిచ్చిండు. బతకమన్నడు. ఇంకేంది. సెప్పలేని సంభ్రమైతంది. మా పిల్లగాండ్లు గూడ బాగా సదువుకున్నరు. ఎట్టనో ఏందో అనుకున్నం. ఇగ పైసలచ్చినయ్. ఏదన్న దుకాణం బెట్టుకుంటం. మంచిగ బతుకుతం. సీఎం సారు మా జీవితాలకు బాటసూపిండు. ఎట్ల మరిసిపోతం. సారుతోనే ఉంటం. – బాజాల సంధ్య(జమ్మికుంట)