‘పవన్‌కల్యాణ్ సినిమా అనగానే కథ కూడా వినకుండా ఓకే చెప్పాను. ఇండస్ట్రీకి వచ్చిన నాటి నుంచి పవన్ స్టార్డమ్ గురించీ, పవనిజం గురించి వింటూవుండేదాన్ని. ఆయనతో ఒక్క సినిమా అయినా చేయాలని కలలు కనేదాన్ని. ‘ఉస్తాద్ భగత్‌సింగ్’తో నా కల నిజమైంది’ అంటూ ఆనందం వెలిబుచ్చింది నటి రాశీఖన్నా. పవన్‌కల్యాణ్‌కి జోడీగా ఆమె నటించిన ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ చిత్రం ఈ నెల 29న విడుదల కానుంది. ఈ సందర్భంగా సోమవారం రాశీఖన్నా మీడియాతో ముచ్చటించింది.
“గబ్బర్‌సింగ్’ లాగే ఇది కూడా చాలా ఎంటర్టైనింగ్గా ఉంటుంది. ఇదొక ఫ్యామిలీ సినిమా. ఇందులో వింటేజ్ పవర్‌స్టార్‌ని చూస్తారు. ఇందులో నా పాత్ర పేరు శ్లోక. మోడరన్ అమ్మాయి. కథలో ప్రాధానత్య ఉన్న పాత్ర. దర్శకుడు హరీశ్‌శంకర్ ఈ సినిమాను అద్భుతంగా తీర్చిదిద్దారు. ఆయన చాలా స్మార్ట్. మాస్ పల్స్ తెలిసిన డైరెక్టర్. సాధారణంగా 120రోజులు పట్టే షూటింగ్‌ని కేవలం 40 రోజుల్లో పూర్తి చేశారు. సరిగ్గా నిద్ర కూడా పోకుండా ఈ సినిమాకోసం కష్టపడ్డారు. లొకేషన్లోనే డైలాగులు కూడా రాసిచ్చేవారు. వృత్తిపట్ల ఆయనలోని అంకితభావం నన్నెంతో ఆకర్షించింది.
మేం కూడా పవన్‌కల్యాణ్ టైమింగ్స్‌కి అనుగుణంగా పగలు రాత్రి తేడా లేకుండా కొన్నిసార్లు 24గంటల షిఫ్టులు పనిచేశాం’ అని తెలిపింది రాశీఖన్నా. శ్రీలీల కాంబినేషన్ సీన్స్ తనకు లేవని, ప్రతి పాత్రా దేనికదే ప్రత్యేకంగా ఉంటుందని, మైత్రీ అధినేతలు నవీన్, రవిశంకర్ సినిమాకోసం ప్రాణం పెట్టే నిర్మాతలని, బడ్జెట్ విషయంలో రాజీ పడరని, ఈ సంస్థలో మళ్లీ మళ్లీ సినిమాలు చేయాలనుందని ఆశాభవం వ్యక్తం చేసింది రాశీఖన్నా.