కొత్తగూడెం ప్రగతి మైదాన్, మార్చి 16 : అన్ని పోలీస్స్టేషన్లలో ఉన్న పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించాలని ఎస్పీ బిరుదరాజు రోహిత్ రాజు పోలీస్, కోర్టు డ్యూటీ అధికారులను ఆదేశించారు. జిల్లాలోని అన్ని పీఎస్‌ల స్టేషన్ హౌజ్ ఆఫీసర్లు, కోర్టు డ్యూటీ అధికారులతో కొత్తగూడెంలోని తన కార్యాలయంలో సోమవారం సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ న్యాయాధికారులతో సమన్వయం పాటిస్తూ పాత కేసుల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. కేసుల పురోగతిని ఎప్పటికప్పుడు తమ అధికారులకు తెలియజేయాలని, ఏవైనా సందేహాలుంటే డీసీఆర్బీ అధికారులకు వివరించి వాటిని నివృత్తి చెసుకోవాలన్నారు. కేసు నమోదైనప్పుటి నుంచి పరిష్కారం అయ్యే వరకు ప్రతీ విషయాన్ని ఆన్లైన్లో పొందుపరచాలని టెక్ టీమ్ ఆపరేటర్లకు సూచించారు.
ఆన్లైన్లో పొందుపరిచే క్రమంలో ఏమైనా సమస్యలుంటే వెంటనే ఐటీ సెల్ సహకారం తీసుకోవాలన్నారు. పలు కేసులలో నేరస్తులకు శిక్ష పడేవిధంగా కృషి చేసి, బాధితులకు న్యాయం చేకూర్చడంలో ప్రతీ అధికారి, సిబ్బంది పాత్ర ఉండాలని ఆదేశించారు. సమావేశంలో డీఎస్పీలు లింగనబోయిన ఆదినారాయణ, ఆర్.సతీశ్‌కుమార్, వి.రవీందర్‌రెడ్డి, వెంకన్నబాబు, ఎస్బీ ఇన్స్పెక్టర్ చెన్నూరి శ్రీనివాస్, డీసీఆర్బీ సీఐ శ్రీనివాస్, ఇతర అధికారులు పాల్గొన్నారు.