ములుగు, మార్చి 16 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు తమ జీవితాల్లో వెలుగులు నిండుతాయని ఆశగా ఎదురు చూసిన ఆశ వర్కర్లు హక్కుల సాధన కోసం ఉమ్మడి వరంగల్ జిల్లాలో కదం తొక్కారు. సోమవారం ఆయా కలెక్టరేట్ల ఎదుట ఆందోళనలు, ధర్నాలు చేపట్టారు. ఇందులో భాగంగా ములుగు జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ పక్కన ఉదయం నుంచే 48 గంటల ధర్నా, వంటావార్పులో పాల్గొన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో భాగంగా తమకు రూ. 18 వేల ఫిక్స్డ్ వేతనంతో పాటు ఇన్సూరెన్స్, రిటైర్మెంట్ బెనిఫిట్స్, ఉద్యోగ భద్రత, 2 నెలల పెండింగ్ వేతనాలు, అంత్యక్రియల ఖర్చులు ఇవ్వాల్సిందేనంటూ డిమాండ్ చేశారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చిన పిలుపును విజయవంతం చేసేందుకు సోమవారం రాత్రి ధర్నా చేపట్టిన స్థలం వద్దనే ఆశ వర్కర్లు వంట చేసుకొని తిని అక్కడే నిద్రకు ఉపక్రమించారు. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో తమ డిమాండ్లపై సానుకూల జీవో విడుదల అవుతుందని ఎదురుచూస్తున్నారు. దోమలు కుడుతున్నా ఇంటికి వెళ్లకుండా తమ డిమాండ్లు నెరవేరితే చాలని, కుటుంబాలు బాగు పడుతాయని చీకటిలో పడుతున్న కష్టాన్ని చూసి స్థానికులు చలించిపోయారు. రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖకు ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి సీతక్క దృష్టికి తమ సమస్యలు తీసుకెళ్లేందుకే రాష్ట్ర యూనియన్ పిలుపు మేరకు సీఐటీయూ ఆధ్వర్యంలో 48 గంటల ధర్నా, వంటవార్పును నిర్వహిస్తున్నట్లు ఆశలు తెలిపారు.