వనపర్తి టౌన్, మార్చి 16 : సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందించి స్ఫూర్తి నింపాలని, శ్రీపరాభవ నామ సంవత్సరం ప్రజల జీవితాలలో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, అష్ట ఐశ్వర్యాలు తీసుకురావాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. సోమవారం సాహితీ కళా వేదిక ఆధ్వర్యంలో పరాభవ నామ ఉగాది కవి సమ్మేళనం నిర్వహించారు. ఈ సమ్మేళనాన్ని మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారం భించారు.
అదేవిధంగా నవతరం కవులు, సాహితీవేత్తలు వినిపించిన కవితలను ఆలకించి వారిని సన్మానించి అభినందించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి మాట్లాడుతూ యుగానికి ఆదిగా నాంది పలుకుతున్న ఉగాదికి స్వాగతమని, పరాభావ నామ సంవత్సరంలో ప్రజలకు విజయాలు కలగాలన్నారు. సాహిత్యములో గాంఢీర్యం, పట్టు ఉన్న కవితలు ప్రశంసనీయమని, ప్రజలకు సరళమైన భాషలో కవిత్వం చెప్పడం నైపుణ్యంతో కూడుకున్నదన్నారు.
భాషాభివృద్ధి, సంస్కృతం, సంప్రదాయాలు భావితరాలకు అందించే బాధ్యత నవ కవులదని, ఆచార వ్యవహారాలు, జీవించే శైలీలను పండుగలు తెలియజేస్తాయన్నారు. పండుగలు, జాతరలు ప్రజలలో విజ్ఞానాన్ని పెంచుతాయని, వ్యవసాయ పనులు ప్రారంభం అయ్యేందుకు ఉగాది పండుగ శుభసూచకమని అన్నా రు. పండుగలు ప్రజల జీవన శైలితో ముడిపడి ఉన్నాయన్నారు. వ్యవసాయాన్ని తపస్సులా యజ్ఞంలా స్వీకరించి భావితరాలకు ఆదరించేలా కవితలు ఉండాలని నా భావన అని అన్నారు.
సంఘజీవి మనిషి అని ఏకాకిగా ఉండడానికి ఇష్టపడుతున్నాడని ఇది ప్రజలలో ఐక్యమత్యానికి, అనుబంధాలకు ప్రమాదమని, మేధావులు, కవులు, సాహితీవేత్తలు ప్రపంచ శాంతికోరుకునే విధంగా ప్రజలను ప్రభావితం చేస్తూ కవితలు రావాలని అన్నారు. కార్యక్రమంలో వాకిటి శ్రీధర్, నందిమల్ల అశోక్, గంధం పరంజ్యోతి, నాగన్నయాదవ్, ప్రేమ్‌నాథ్‌రెడ్డి, హేమంత్, చిట్యాల రాము, కుమార్, మంద రాము, ముద్దుసార్, సాహితీ కళావేదిక అధ్యక్షుడు పలుస శంకర్‌గౌడ్, నారాయణరెడ్డి, డాక్టర్ వీరయ్య, ఖాజామెహినుద్దీన్, బైరోజు చంద్రశేఖర్, కవులు, సాహితీ వేత్తలు పాల్గొన్నారు.