Gurukula Schools | హైదరాబాద్, ఆగస్టు 25 (నమస్తే తెలంగాణ): గురుకులాల్లో గందరగోళం నెలకొన్నది. ఉపాధ్యాయులు, విద్యార్థులు, ఉద్యోగులు, సిబ్బంది రెండు నెలలుగా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఎస్సీ వెల్ఫేర్ సొసైటీ లో పాలన గాడితప్పింది. బదిలీలు, ప్రమోషన్ల ప్రక్రియ ఒక ప్రహసనంగా కొనసాగుతున్నది.
సత్వరమే స్పందించి సమస్యలన్నింటికీ ముగింపు పలకాలని సీఎం రేవంత్‌రెడ్డిని కోరుతున్నారు. ప్రభుత్వం దృష్టిపెట్టకపోతే సొసైటీల్లోని యూనియన్లు పోరుబాటకు సిద్ధమవుతున్నాయి. సాంఘిక సంక్షేమ గురుకులాల్లో వేలాది మంది ఉపాధ్యాయులు రోజుల తరబడి కార్యాలయాల చుట్టూ తిరుగుతుండగా, బోధన అస్తవ్యస్తంగా మారింది. విద్యార్థుల బాగోగులను పట్టించుకునే వారే కరువయ్యారు. పలుచోట్ల కిందిస్థాయి సిబ్బంది అక్కడ పెత్తనం చెలాయిస్తున్నారు.
సంక్షేమ శాఖలకు మంత్రులే కరువు
రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరి 9 నెలలు కావస్తున్నది. ఇప్పటికీ సాంఘిక సంక్షేమ, మైనార్టీ, గిరిజన సంక్షేమ శాఖలకు మంత్రులను నియమించలేదు. ఆయా శాఖలన్నీ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వద్దే ఉన్నాయి. దీంతో ఆయా శాఖల పరిధిలోని గురుకులాల పరిస్థితి దయనీయంగా మారింది. సీఎం అజమాయిషీలో ఉన్నా కూడా ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేక, విధానపర నిర్ణయాల జాప్యంతో క్షేత్రస్థాయిలో అనేక ఇబ్బందులు నెలకొంటున్నాయి. ప్రధాన కార్యాలయాల్లోని కొందరు అధికారులు ఆధిపత్యాన్ని చెలాయిస్తున్నారు.
కార్యాలయాల్లో కొందరు ఓడీలపై తిష్ఠవేసి జులూం ప్రదర్శిస్తున్నారు. ఇష్టారీతిన నిర్ణయాలు తీసుకుంటూ ఇటు విద్యార్థులను, అటు ఉపాధ్యాయులకు చుక్కలు చూపుతున్నారు. సోషల్ వెల్ఫేర్‌లో రాత్రికి రాత్రే సర్క్యూలర్లు, మరుసటి రోజే ఆర్డర్లతో అన్ని అనాలోచిత నిర్ణయాలే తీసుకుంటూ అరిగోస పెడుతున్నారని సొసైటీ ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమస్యను చెప్పుకున్నా పరిష్కరించకుండా, ఆపై బెదిరింపులకు దిగుతున్నారని, వ్యక్తిగతంగా లక్ష్యంగా చేసుకుని కక్షసాధింపులకు దిగుతున్నారని కొందరు మహిళా ఉపాధ్యాయులు కన్నీటిపర్యంతమవుతున్నారు.
అటకెక్కిన అనేక సమస్యలు
గురుకుల అధికార యంత్రంగమంతా బదిలీలు, ప్రమోషన్లకే పరిమితం కావడంతో అనేక అంశాలు అటకెక్కాయి. విద్యార్థులకు కాస్మొటిక్ చార్జీలు ఈ ఏడాది మార్చి వరకే అందాయి. డైట్ చార్జీలు పెండింగ్‌లో ఉన్నాయి. దీంతో సరైన పౌష్ఠికాహారం అందని పరిస్థితి నెలకొన్నది. నాణ్యతలేని సరుకులను సరఫరా చేస్తుండటంతో విద్యార్థులు అనారోగ్యాల పాలవుతున్నారు. అస్వస్తతకు గురవుతున్నారు.
అనేక భవనాల అద్దెలు, విద్యుత్తు చార్జీలు బిల్లులు నిలిచిపోయాయి. సీవోఈలు, పార్ట్ టైమ్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు, సీనియర్ ఫ్యాకల్టీ సబ్జెక్ట్ అసోసియేట్లకు రెండు నెలలుగా జీతాల చెల్లింపు నిలిచిపోయింది.దీంతో వారం తా అనేక ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.
పోరుబాటకు యూనియన్లు సిద్ధం
ఉన్నతాధికారుల అనాలోచిత నిర్ణయాలు, మరోవైపు ప్రభుత్వ నిర్లక్ష్యంపై సొసైటీల్లోని అన్ని యూనియన్లు ఆగ్రహంతో ఉన్నాయి. బదిలీలు, ప్రమోషన్లలో అనేక అవకతవకలు జరిగాయని ఆరోపణలు వెల్లువెత్తుతున్నా ప్రభు త్వం స్పందించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే బాధిత ఉపాధ్యాయులతో కలిసి అనేకమార్లు నేరుగా ప్రజాభవన్‌కు వెళ్లి వినతులు సమర్పించారు. సీఎస్, సీఎంవో కార్యాలయ అధికారులకు మొరపెట్టుకున్నారు. ఇప్పటికీ ఆశించిన ఫలితం రాకపోవడంతో యూనియన్లు మండిపడుతున్నాయి.
కలిసికట్టుగా పోరుబాట పట్టేందుకు సిద్ధమవుతున్నాయి. సీఎం రేవంత్‌రెడ్డి వెంటనే స్పందించి సోషల్ వెల్ఫేర్ గురుకులంలో బదిలీలు, ప్రమోషన్లను పూర్తిగా పునఃసమీక్షించేందుకు ఆదేశాలు జారీ చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. ఆయా అంశాలపై ప్రభుత్వం నుంచి మరో రెండు రోజుల్లో స్పష్టమైన నిర్ణయాలు వెలువడకుంటే భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని హెచ్చరిస్తున్నాయి. మూకుమ్మడిగా విధులను బహిష్కరించి, సెక్రటేరియట్ ముట్టడికి తరలివెళ్లి తాడోపేడో తేల్చుకోవాలని యూనియన్లు ప్రణాళికలను రూపొందిస్తున్నాయి.