హైదరాబాద్, మార్చి 31 (నమస్తే తెలంగాణ): ఒక సెంటర్లో వెయ్యి మంది అభ్యర్థులు పరీక్ష రాస్తే టాప్-500 జాబితాలో ఒక్కరు కూడా లేరు. రెండు సెంటర్ల నుంచే 74మంది టాప్-500లో ఉన్నారు. తక్కువ మంది రాసిన సెంటర్ల నుంచి పదుల సంఖ్యలో అభ్యర్థులు టాప్‌లో ఉండటం, ఎక్కువ మంది రాసిన చోట వారిలో నుంచి ఒక ఒక్కరు లేకపోవడం పలు అనుమానాలకు తావిస్తున్నదని అభ్యర్థులు చెప్తున్నారు. ఇలాంటి వ్యత్యాసాలు గ్రూప్-1మెయిన్స్‌లో చాలా ఉన్నాయని ఆవేదన వ్యక్తంచేస్తున్ననారు. దీంతో మెయిన్స్‌లో అవకతవకల ఆరోపణలు రోజురోజుకు పెరుగుతున్నాయి. జనరల్ ర్యాంకింగ్ లిస్టులో (జీఆర్ఎల్) ఒకే సెంటర్ నుంచి అత్యధికులు టాప్‌మార్కులు సాధించడం, మరికొన్ని సెంటర్ల నుంచి ఒక్కరు కూడా లేకపోవడమే అక్రమాలకు నిదర్శనమని క్యాడిడేట్స్ చెప్తున్నారు. కొన్ని సెంటర్లల్లో కాపీయింగ్ జరిగిందా? లేక కావాలనే ఎక్కువ మార్కులేశారా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
పరీక్షలు నిర్వహించిన ఆరు సెంటర్ల నుంచి టాప్-500లో ఎంపికైన వారున్నారా? అని చూస్తే ఒక్కరు కూడా లేకపోవడం పట్ల చాలామంది ఆశ్చర్యం వ్యక్తంచేస్తున్నారు. ఆయా సెంటర్ల నుంచి దాదాపు 3,800 మంది పరీక్షలు రాస్తే ఒక్కరు కూడా మెరిట్లో ఉండకపోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఒక సెంటర్లో మొత్తం 984 మంది పరీక్షరాస్తే టాప్-500 జాబితాలో ఒక్కరంటే ఒక్కరు కూడా లేరు. ఇంతమంది రాస్తే ఒక్కరు కూడా మెరిట్ జాబితాలో ఉండరా ? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. రెండు సెంటర్ల నుంచి 74 మంది టాప్-500 జాబితాలో ఉన్నారు. మరో 25 సెంటర్ల నుంచి కేవలం 68 మందే ఉన్నారు. ఇది పూర్తిగా అనుమానాలకు తావిస్తున్నది. కొన్ని సెంటర్ల నుంచి ఒక్కరంటే ఒక్కరు కూడా లేకపోవడంతో భారీ అక్రమాలు జరిగాయని, గ్రూప్-1లో జరిగిన కుంభకోణమేని అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. మొత్తం వ్యవహారంపై జ్యుడీషియల్ కమిషన్‌తో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు.
గ్రూప్-1లో తెలుగు మీడియం అభ్యర్థులకు అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేస్తున్న అభ్యర్థులు ఆందోళనకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో ఉద్యమ కార్యాచరణ రూపొందించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మూల్యాంకనంలో లోపాలు, టీజీపీఎస్సీ అనుమానాలు ఉన్నాయని చెప్తున్నారు. ఇంగ్లీష్ మీడియం వారికి ఎక్కువ మార్కులేసి, తెలుగు మీడియం వారికి తక్కువ మార్కులేశారని, చేతిరాతను బట్టి కూడా అదనంగా మార్కులేశారని ఆరోపిస్తున్నారు. జవాబు పత్రాలును మరోసారి మూల్యాంకనం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఆదివారం గ్రూప్-1 జీఆర్ఎల్ విడుదల నేపథ్యంలో పోరును మరింత ఉధృతం చేయాలని నిర్ణయించారు.
ఒకవైపు న్యాయపోరాటం చేస్తూనే, మరోవైపు ప్రత్యక్ష పోరుకు దిగాలన్న వ్యూహాంతో ముందుకెళ్తున్నారు. ఇందులోభాగంగా నిరుద్యోగ జేఏసీ నేతలు మంగళవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. గ్రూప్-1లో నష్టపోయిన అభ్యర్థులంతా ఈ సమావేశానికి తరలిరావాలని నిరుద్యోగ జేఏసీ నేతలు పిలుపునిచ్చారు. ఈ సమావేశం తర్వాత ఉద్యమ కార్యాచరణను ప్రకటించే అవకాశాలున్నాయి. ఇప్పటికే గ్రూప్-1 మెయిన్స్ మూల్యాంకనంపై హైకోర్టులో మూడు కేసులు వేశారు. ఇదిలా ఉండగా, ప్రత్యక్షపోరుకు సమాయత్తమవుతున్నారు.
గ్రూప్ -1పై భవిష్యత్తు కార్యాచరణ రూపొందించేందుకు నిరుద్యోగ జేఏసీ నేతలు మంగళవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో సమావేశం కానున్నారు. అఖిలపక్షనేతలు ఈ సమావేశానికి హాజరుకానున్నారు. ప్రజాసంఘాల నేతలు కూడా పాల్గొననున్నారు. బీఆర్ఎస్ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్, రాకేశ్‌రెడ్డి, బీజేపీ నాయకుడు మురళీ మనోహర్, సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ, బీఎస్పీ నాయకుడు మల్లు ప్రభాకర్, తెలంగాణ ఉద్యమకారులు విఠల్, పృథ్వీ, బక్క జడ్సన్‌ను ఈ సమావేశానికి ఆహ్వానించారు.