యూరియా కొరతతో రైతులు తల్లడిల్లుతున్నరు. పత్తి పంట వేసి 60 రోజలవుతున్నా ఒకసారి మాత్రమే యూరి యా వేశాం. మొలకెత్తిన తర్వాత 20 రోజుల్ల్లో మొక్కకు యూరియా వేస్తే ఏపుగా పెరుగుతుంది. యూరియా లేకపోవడంతో 60 రోజుల్లో పెరగాల్సిన మొక్క ఆ స్థాయిలో పెరగలేదు. కానీ కాయలు కాస్తున్నా ఎదుగుదల తగ్గిం ది. మొక్క పెరిగితేనే కాయల దిగుబడి పెరుగుతుంది. లేకుంటే నాలుగు కాయ లు కాసి శక్తిని కోల్పోతుంది. దీంతో రైతులు తీవ్రంగా నష్ట్రపోయే అవకాశాలున్నాయి. మక్కలో యూరియా అవసరం అధికంగా ఉంటుంది. 50 రోజులవుతున్నా ఒకసారి కూడా యూరి యా వేయని రైతులున్నారు. మక్క ఎదుగుదల ఆగింది.
కంకి పెట్టక అట్లాగే ఉండిపోతుంది. పత్తి, మక్క, వరితో పాటు అనేక రకాల పంటలకు యూరియా తల్లి పాల లాటింది. పొద్దంతా యూరియా కోసం క్యూలైన్లో నిలబడితే ఒకరికి ఒక బస్తా మాత్రమే రాస్తున్నారు. అది కూడా స్టాకు ఉంటేనే చివరి రైతుకు అందుతుంది. లేకుంటే లేదు. రైతులు వ్యవసాయ పనులను వదిలేసి యూరియా కోసం పడిగాపులు కాస్తున్నారు. కేసీఆర్ పదేండ్ల పాలనలో ఒక్కసారి కూడా యూరియా కోసం లైన్ కట్టలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రైతులు నానా కష్టాలు పడుతున్నరు. ముందుముందు యూరియా రాదని అధికారులు అంటున్నరు. ఇట్లయితే ఎవుసం కూడ చేయలేం. కాంగ్రెస్ సర్కారుకు రైతుల ఉసురు తగుల్తది.
– గడ్డమీది ధనుంజయ్, రైతు, ఊకల్, వరంగల్ జిల్లా
తెళ్లవారకముందే అన్నదాతల పాట్లు
ఎక్కడ: మహబూబాబాద్ జిల్లా శ్రీరామగిరి
ఏం జరిగింది: మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం శ్రీరామగిరి సొసైటీ వద్ద యూరియా కోసం రైతులు నానా తిప్పలు పడ్డారు. ఆదివారం తెల్లవారుజామున 5 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు సుమారు 600 మంది యూరియా కోసం వేచి చూశారు. తీరా 222 బస్తాలు మాత్రమే పంపిణీ చేయడంతో మిగిలిన రైతులు నిరాశతో వెనుదిరిగిపోయారు.
కాంగ్రెస్ వచ్చింది.. కష్టాలు తెచ్చింది
ఎక్కడ: సిద్దిపేట జిల్లా చెప్యాల
ఏం జరిగింది: కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత తీవ్రమైన యూరియా కొరత ఏర్పడిందని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి మండిపడ్డారు. యూరియా సరఫరా చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. రైతులు పడుతున్న ఇబ్బందులను మీడియా దృష్టికి తీసుకువస్తుంటే కాంగ్రెస్ నాయకులు జీర్ణించుకోలేక పోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కమటం నరేశ్ అనే దాత ఇచ్చిన రూ.లక్ష విరాళంతో సీసీ కెమెరాలను రాష్ర్ట ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యతో కలిసి ప్రారంభించారు.
యూరియా కోసం వర్షంలోనూ క్యూ
ఎక్కడ: నారాయణపేట జిల్లా నర్వ
ఏం జరిగింది: పీఏసీసీఎస్ వద్ద రైతులు బారులుతీరారు. ఆదివారం ఉదయం సొసైటీకి లారీ లోడ్ యూరియా వచ్చింది. రైతులు పాస్ పుస్తకాలు, ఆధార్ కార్డులు పట్టుకొని నిలబడ్డారు. వర్షం వచ్చినా అక్కడి నుంచి వెళ్లకుండా క్యూలోనే ఉన్నారు. పీఏసీసీఎస్ అధికారులు కొందరు రైతుల చొప్పున అందజేయగా.. బ్యాగులు అందని రైతులు నిరాశతో వెనుదిరిగారు.
టోకెన్ల కోసం రాస్తారోకో
ఎక్కడ: మహబూబాబాద్ జిల్లా ధన్నసరి సొసైటీ
ఏం జరిగింది: మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండల కేంద్రంతో పాటు ధన్నసరి సొసైటీల వద్ద ఆదివారం రైతులు యూరియా కోసం బారులుతీరారు. కేసముద్రం సొసైటీకి 400 బస్తాల యూరియా రాగా, వెయ్యి మందికి పైగా రైతులు క్యూలైన్లో నిలబడ్డారు. పోలీసుల సమక్షంలో వ్యవసాయ అధికారులు టోకెన్లు సరఫరా చేశారు. ఒక్కో రైతుకు ఒక యూరియా బస్తా మాత్రమే అందించారు. 400 మంది రైతులకు టోకెన్లు ఇవ్వకపోవడంతో నిరాశతో తొర్రూరు వెళ్లే రహదారిపై రాస్తారోకో నిర్వహించారు.
పొద్దుపొద్దున్నే దుకాణాల బాట
ఎక్కడ: రాజన్న సిరిసిల్ల జిల్లా అల్మాస్పూర్
ఏం జరిగింది: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం అల్మాస్పూర్ గోదాంకు అల్మాస్పూర్తో పాటు అక్కపల్లి, బుగ్గరాజేశ్వరతండా, రాజన్నపేటకు చెందిన రైతులు ఆదివారం ఉదయం 5గంటలకే పెద్ద సంఖ్యలో వచ్చారు. 5.30గంటల వరకు చెప్పులు క్యూలో ఉంచారు. తర్వాత సిబ్బంది చెప్పులను క్యూలో నుంచి తీయించి, రైతులకు టోకెన్లు ఇచ్చారు. మొత్తం 330 బస్తాలే యూరియా ఉండగా, 6గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఒక్కొక్కరికి ఒక్కో బస్తా అందజేశారు. 200 మంది రైతులు బస్తాలు అందక వెనుదిరిగారు.
యూరియా కష్టాలు తీరేనా..?
ఎక్కడ: వికారాబాద్
ఏం జరిగింది: వికారాబాద్‌లోని ఎరువుల దుకాణం వద్ద రైతులు పెద్ద సంఖ్యలో బారులు తీరారు. పంటసాగుకు యూరియా సరిపోక ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. బస్తాలు త్వరగా అయిపోవడంతో మరుసటి రోజు రావాలని చెప్తున్నారని.. ఇదే తీరు కొనసాగుతున్నదని మండిపడుతున్నారు. నాట్లేసి నెల గడుస్తున్నా యూరియా చల్లకుండా దుకాణాల చుట్టూ తిరగాల్సి వస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు.
యూరియా కోసం రోడ్డెక్కిన రైతులు
ఎక్కడ: మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి సొసైటీ
ఏం జరిగింది: మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తిలో యూరియా కోసం రైతులు రోడ్డెక్కారు. సహకార సంఘానికి ఆదివారం ఉదయం 200 బస్తాల యూరియా వచ్చిందనే సమాచారంతో రైతులు తరలివచ్చారు. ఆధార్ కార్డు జిరాక్స్‌లతో ఉదయం నుంచే రైతువేదిక ముందు బారులు తీరారు. అనంతరం రహదారిపై ఆందోళన నిర్వహించారు. బీఆర్ఎస్ పాలనలో యూరియా కొరత లేదని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. జై కేసీఆర్ ఆంటూ నినదించారు.