తిరుమలగిరి, ఏప్రిల్ 15 : రేవంత్ సర్కారును కూల్చాల్సిన అగత్యం బీఆర్ఎస్కు లేదని ప్రభుత్వాన్ని అస్థిరపరిచే ప్రయత్నాలు కాంగ్రెస్ నుంచే అంతర్గతంగా జరుగుతున్నాయని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి పేర్కొన్నారు. తిరుమలగిరి మండల కేంద్రంలో మంగళవారం విలేకరులతో ఆయన మాట్లాడారు. దేశ చరిత్రలో ఎక్కడా లేనివిధంగా ప్రజలే రేవంత్ ప్రభుత్వాన్ని గద్దె దించాలని చూస్తున్నారని తెలిపారు. రేవంత్ ప్రభుత్వం ఆర్థిక అరాచక పాలన సాగిస్తున్నదని దుయ్యబట్టారు. అంతకుముందు బీఆర్ఎస్ రజతోత్సవ సభ విజయవంతం కోసం తుంగతుర్తి నియోజకవర్గ నాయకులతో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరంగల్ జిల్లా వేదికగా జరిగే సభ చరిత్రను తిరగరాస్తుందని తెలిపారు. ప్రజల్లో తిరుగుబాటు మొదలైతే పోలీస్, మిలటరీ ఎవరూ ఆపలేరని హెచ్చరించారు. కేసీఆర్ పదేండ్ల పాలనలో అందిన ఫలాలనే ప్రజలు ఇప్పటికీ గుర్తుచేసుకుంటున్నారని పేర్కొన్నారు. కేసీఆర్ గురుకులాలను కార్పొరేటుకు దీటుగా తీర్చిదిద్ది దేశంలోనే ఆదర్శంగా నిలిపారని పేర్కొన్నారు. రేవంత్‌రెడ్డి మాత్రం విద్యాశాఖకు మంత్రిగా ఉండి 90 మంది గురుకుల విద్యార్థుల చావుకు కారణమై దేశంలోనే రికార్డు నెలకొల్పారని విమర్శించారు. సభలో మాట్లాడుతుండగానే కరెంట్ పోవడంతో.. రేవంత్‌రెడ్డి హయాంలో కరెంట్ పరిస్థితి ఇలా ఉందని పేర్కొనడంతో నాయకులు, కార్యకర్తలు ఒక్కసారిగా నవ్వారు. రెప్పపాటు సమయం కూడా కరెంట్ పోకుండా కేసీఆర్ విద్యుత్తు అందిస్తే.. నేడు కరెంట్ ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి నెలకొందని ఎద్దేవాచేశారు.