హైదరాబాద్, జులై 7 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వానికి గతంలో సొంతంగా వేలాది ఎకరాల భూమి ఉండేదని, ఇప్పుడు టాయిలెట్స్ కట్టేందుకు కూడా జాగాలేని పరిస్థితులు ఏర్పడ్డాయని హైకోర్టు అభిప్రాయపడింది. ప్రభుత్వ స్థలాలను అడ్డగోలుగా ఎవరికిపడితే వాళ్లకు కేటాయించడం, ఆక్రమణల క్రమబద్ధీకరణ వల్లే ఇలా జరిగిందని పేర్కొన్నది. వికారాబాద్ జిల్లా దరూర్ మండలం అంతరంలో సర్వే నంబర్ 32, 82లో హేచరీ నిర్మాణం కోసం 6 ఎకరాలు కేటాయించాలన్న వినతిపత్రంపై ప్రభుత్వం చర్యలు తీసుకోవడంలేదంటూ ఎండీ ఖలీల్ దాఖలు చేసిన వ్యాజ్యంపై జస్టిస్ సీవీ భాస్కర్‌రెడ్డి సోమవారం విచారించారు. పిటిషనర్ తరపున న్యాయవాది ముమ్మనేని శ్రీనివాసరావు వాదిస్తూ, భూమి కేటాయించాలని 2022లో జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పిస్తే స్పందన లేద చెప్పారు. దీనిపై స్పందించిన హైకోర్టు, హేచరీ నిర్మాణం వల్ల ప్రజలకు ఏ మేరకు ఉపయోగమో చెప్పాలని ప్రశ్నించింది. నిజాం పాలనలో గైరాన్ భూములు కమ్యూనిటీ అవసరాలకు భూముల కేటాయింపులు జరిగాయని గుర్తుచేసింది. బందెలదొడ్డి నిర్మాణం, గ్రామ కమ్యూనిటీ అవసరాలకు భూమి ఉండేదని పేర్కొన్నది. అర్హులైన పేదలకు భూములను, స్థలాలను కేటాయించాలన్న సుప్రీంకోర్టు నిబంధనలకు విరుద్ధంగా భూకేటాయింపులు జరిగాయని తప్పుపట్టింది. తదుపరి విచారణను ఈ నెల 22కి వాయిదా వేసింది.