Congress | 50 ఏండ్ల పరిపాలనలో హామీలు అమలు చేసిన చరిత్ర లేదు. ఇప్పుడు అధికారంలో ఉన్న మూడు రాష్ర్టాల్లో అమలు చేస్తున్న దాఖలా అసలే లేదు. ఇచ్చిన హామీలు ఎలా నెరవేర్చాలన్న వ్యూహం లేదు. మాట తప్పి ప్రజల్ని మోసం చేస్తమేమో అన్న భయం లేదు. అధికారంలోకి వచ్చేదుందా? చచ్చేదుందా? కొండకు వెంట్రుక కడుదాం. వస్తే కొండ వస్తది. లేకుంటే పొల్లు మాట పోతే పోతది. ఇదీ కాంగ్రెస్ వైఖరి.
హైదరాబాద్ శివారులో ఆదివారం సాయంత్రం బహిరంగ సభలో కాంగ్రెస్ అగ్రనేతలు ఇచ్చిన హామీలు అచ్చంగా ఇలాంటివే. దశాబ్దాల క్రితం ఏర్పడ్డ సుసంపన్నమైన కర్ణాటకలో చెప్పని, అమలు చేయని, చేయలేని హామీలన్నింటినీ పదేండ్ల తెలంగాణలో అమలు చేస్తామని కాంగ్రెస్ నేతలు నమ్మాలంటున్నారు. 50 ఏండ్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉండి చేయని వాటన్నింటిని ఇప్పుడు చేస్తామని మోసకారి ముచ్చట్లు చెప్తున్నారు. వీటన్నింటిని నమ్మడానికి తెలంగాణ ప్రజలు ఏమైనా అమాయకులా?
హైదరాబాద్, సెప్టెంబర్ 17 (నమస్తే తెలంగాణ): ‘నడ్డి నాది కాదంటే ఢిల్లీ దాక దేకిస్త’ అన్న చందంగా ఉన్నది కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 6 గ్యారెంటీల పరిస్థితి. 50 ఏండ్ల పాలనలో గతంలో అమలు చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీకి లేదు. పోనీ ప్రస్తుతం ఆ పార్టీ అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో చేస్తున్న దాఖలాలూ లేవు. ఈ హామీలను ఇక్కడ ఏ విధంగా అమలు చేస్తామనే వ్యూహం లేదు. అయినప్పటికీ మోసకారి కాంగ్రెస్ మరోసారి అర్రాస్ పాట పాడింది. గెలిచేదుందా? చచ్చేదుందా?.. మాటే కదా ఇచ్చేస్తే పోలా అనేలా నోటికొచ్చినవన్నీ పాటకట్టి పాడింది. తెలంగాణ రాష్ట్రం ఏంటిది? దీని ఆర్థిక స్థోమత ఎంత? మరో 10 ఏండ్ల తర్వాత దీని పరిస్థితి ఎలా ఉంటుంది? ఈ అవగాహనే ఆ పార్టీకి గానీ, ఆ పార్టీ నేతలకు గానీ లేదు. పచ్చబడ్డ రాష్ట్రంలో అచ్చంగా అధికారంలోకి రావాలని, మరోసారి దోపిడీ పర్వం మొదలుపెట్టాలనే ఆలోచన తప్ప.. తెలంగాణ ప్రజల భవిష్యత్‌పై చింతలేదు. నాయకులకు టికెట్ల ఆశపెట్టి తరలించుకొచ్చిన జనం ముందు అబద్ధాల హామీలను ప్రకటించేసింది. ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ ఆదివారం ప్రకటించిన 6 గ్యారెంటీలపై అన్ని వర్గాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాంగ్రెస్ అలవిగానీ హామీలు గుప్పించిందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
రెండుమూడు రాష్ర్టాల బడ్జెట్ కావాల్సిందే
‘సంపద పెంచడం.. పేదలకు పంచడం బీఆర్ఎస్ ప్రభుత్వ విధానం. మన ఆర్థిక పరిస్థితి పెరుగుతున్న కొద్దీ ప్రజలకు నూతన సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నం, ఉన్నవాటిని మెరుగుపరుస్తున్నం’ అని సీఎం కేసీఆర్ పదే పదే చెప్తుంటారు. పిండికొద్దీ రొట్టె అన్నట్టుగా, రాష్ట్ర ఆదాయవ్యయాలను దృష్టిలో పెట్టుకొని పథకాలు ప్రకటించి, అమలు చేసినప్పుడే వాటికి విలువ, ప్రజలకు ప్రయోజనం ఉంటుంది. కానీ కాంగ్రెస్ ఇచ్చిన హామీలు చూస్తుంటే ఒక్క తెలంగాణ బడ్జెట్ సరిపోయే పరిస్థితిలేదు. రాష్ట్ర ఖజానా ఖాళీ కావడంతోపాటు రెండుమూడు రాష్ర్టాల బడ్జెట్‌ను కూడా కలపాల్సి వచ్చేలా ఉన్నదని ఆర్థికవేత్తలు మండిపడుతున్నారు. రాష్ర్టాన్ని ఎలా అభివృద్ధి చేస్తారో? ఆదాయాన్ని ఎలా పెంచుతారో? చెప్పకుండా ఇచ్చే హామీలన్నీ బూటకమేనని విమర్శిస్తున్నారు.